ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి ఘన సన్మానం
సూళ్లూరుపేట: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేత, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని సూళ్లూరుపేట వైఎస్సార్‌సీపీ నాయకుడు దబ్బల రాజారెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల గెలిచిన మున్సిపల్ కౌన్సిలర్లు బుధవారం ఘనంగా సన్మానించారు. ఆయన ఒంగోలు నుంచి చెన్నై వెళుతుండగా సూళ్లూరుపేట హోలీక్రాస్ సెంటర్ వద్ద జాతీయ రహదారిపై ఆపి శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. దబ్బల రాజారెడ్డి ఆయనతో మాట్లాడుతూ సూళ్లూరుపేటలో పార్టీ పరిస్థితి బాగుందని, మున్సిపాలిటీలో 10 వార్డులు గెలుచుకున్నామని చెప్పారు.
మండలంలో 9 ఎంపీటీసీలకు 6 స్థానాలు గెలుచుకున్నామని తెలిపారు.
మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంటామని చెప్పారు. చైర్‌పర్సన్ అభ్యర్థి ముత్తుకూరు లక్ష్మమ్మతో పాటు 9 మంది వార్డు సభ్యులు మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తామన్నారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి కార్యకర్తలు అండగా ఉండాలని కోరారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
రుణమాఫీపై ప్రభుత్వం చెప్పే మాటల్లో నిజం లేదు కాబట్టి ప్రతిపక్షంగా మనం ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసి ప్రజలకు మేలు చేకూరేలా పనిచేయాలన్నారు. పార్టీ నాయకులు నలుబోయిన రాజసులోచనమ్మ, కళత్తూరు శేఖర్‌రెడ్డి, గండవరం సురేష్‌రెడ్డి, గోగుల తిరుపాలు, వెంకటసుబ్బయ్యశెట్టి, కౌన్సిలర్లు పాల మురళి, కలిశెట్టి బాబు, గునిశెట్టి చిరంజీవి, తొప్పాని సుశీలమ్మ, వాయలూరు సరసమ్మ, ముంగర శేషారెడ్డి, పేర్నాటి దశయ్య, ఉమ్మిటి జానకీరామ్, నలుబోయిన చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.