- వైఎస్సార్ సీపీ నేతలంతా జగన్‌తోనే..
- టీడీపీ ప్రలోభాలకు ఎవరూ తలొగ్గరు
- పజల పక్షాన ఉండి పోరాటం చేస్తాం
- ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
ఒంగోలు అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాలో మరీ ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో తాగు, సాగునీటి సమస్య సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వై .వి.సుబ్బారెడ్డి చెప్పారు. తన కార్యాలయంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్‌రెడ్డి, జంకె వెంకటరెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజులతో కలసి గురువారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో వైఎస్సార్ సీపీకి ఆరు శాసనసభ స్థానాలు, ఒక ఎంపీ స్థానం కట్టబెట్టిన ప్రజలకు వై.వి. కృతజ్ఞతలు తెలిపారు.
- జిల్లా వ్యాప్తంగా నెలకొన్న నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ తనతో పాటు తమ పార్టీ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ విజయకుమార్, సంబంధిత అధికారులను కలసి వినతి పత్రం అందజేసినట్లు చెప్పారు. అవసరమైతే ఈ 20 రోజులు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటాం.
- వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులను తమ వైపునకు తిప్పుకునేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. తమ పార్టీ నేతలంతా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు.
- ఇడుపులపాయలో బుధవారం నిర్వహించిన పార్టీ శాసనసభాపక్ష సమావేశానికి దివంగత భూమా శోభానాగిరెడ్డి, అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొడాలి నాని తప్ప, మిగిలిన శాసనసభ్యులంతా హాజరయ్యారని చెప్పారు.
- చంద్రబాబు బూటకపు వాగ్దానాలు, అమలు కానీ హామీలను ప్రజలు నమ్మారని, మోడీ గాలి కొంత రాష్ట్రంపై కూడా ప్రభావం చూపిందని, దీనివల్లే వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాలేకపోయిందని విశ్లేషించారు.
- ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్షంలో ఉండి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడతామని ఎంపీ వివరించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, రమణారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
నీటి సమస్యను పరిష్కరిస్తాం
Published Fri, May 23 2014 4:09 AM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM
Advertisement