కుటుంబ కథా చిత్రమ్!
Published Thu, Mar 13 2014 12:40 AM | Last Updated on Tue, Oct 16 2018 6:40 PM
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల బరిలోకి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ల భార్యలు దిగక తప్పడం లేదు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఒక కారణమైతే, ముందుగా ఎంపిక చేసుకున్న వార్డులు మహిళలకు రిజర్వు కావడం మరో కారణం. రిజర్వేషన్లవల్ల ఈసారి జిల్లావ్యాప్తంగా ‘పుర’పోరులో 700 మంది మహిళలు రంగంలోకి దిగుతారని అంచనా. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో 153 మంది మహిళలు కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా ఎన్నిక కాను న్నారు. అమలాపురంలో రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేసి,వైస్ చైర్మన్ పదవి కూడా వహించిన వైఎస్సార్ సీపీ నాయకుడు చెల్లుబోయిన శ్రీనివాసరావు తానుపోటీ చేయాలనుకున్న 17వ వార్డు మహిళలకు రిజర్వు కావడంతో తన భార్య శ్రీదేవిని పోటీకి నిలిపారు. రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేసిన టీడీపీ నాయకుడు తిక్కిరెడ్డి నేతాజీ గతంలో తాను పనిచేసిన 7వ వార్డులో రిజర్వేషన్ కారణంగా తన భార్య ఆదిలక్ష్మిని పోటీకి నిలబెట్టారు. మరో మాజీ కౌన్సిలర్ జంగాఅబ్బాయి వెంకన్న (టీడీపీ) మహిళా రిజర్వేషన్ నేపథ్యంలో తన భార్య స్వర్ణ కనకదుర్గను పోటీకి దింపుతున్నారు. మాజీ కౌన్సిలర్ గంపల నాగలక్ష్మి ఈ దఫా 27వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. పిఠాపురం మున్సిపాలిటీలో మాజీ కౌన్సిలర్ కేశవబోయిన సత్యనారాయణ ఈసారి తన భార్య లక్ష్మిని పోటీకి నిలబెడుతున్నారు. ఇదే మున్సిపాలిటీ నుంచి మాజీ కౌన్సిలర్ బోను లక్ష్మారావు 50 శాతం మహిళా రిజర్వేషన్ ఇచ్చిన అవకాశంతో తన కోడలిని పోటీకి దింపుతున్నారు. పెద్దాపురం మున్సిపాలిటీ 17వ వార్డు మాజీ కౌన్సిలర్ తాళాబత్తుల సాయి ఈసారి తన భార్యతో పోటీ చేయిస్తున్నారు. ఇలా జిల్లాలో ప్రతి మున్సిపాలిటీలో మాజీ కౌన్సిలర్లు తమ భార్యలను బరిలో దించుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఎన్నికల బరిలో దంపతులు
గొల్లప్రోలు, న్యూస్‌లైన్ : గొల్లప్రోలు నగర పంచాయతీకి తొలి సారిగా జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు భార్యాభర్తలు నామినేషన్లు వేశారు.వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ చైర్మన్ అభ్యర్ధిగా బలపరచిన తెడ్లపు చిన్నా 8వ వార్డు నుంచి, ఆయన భార్య సీతారత్నం 9వవార్డు నుంచి బరిలో నిలవనున్నారు. సస్యరక్షణ మందుల వ్యాపారి చిన్నా మొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో దిగారు. దివంగత మహానేతపై అభిమానంతో ఆయన చైర్మన్ అభ్యర్థిగా పోటీకి ముందుకు వచ్చారు. 8,9 వార్డుల్లో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికసంఖ్యలో ఉండడంతో తమ గెలుపు సులువవుతుందని అదే వర్గానికి చెందిన చిన్నా భావించారు. దీంతో 9వ వార్డునుంచి తన భార్య సీతారత్నాన్ని బరిలో నిలిపారు. అన్ని వర్గాలతో సత్సంబంధాలు, సాన్నిహిత్యం ఉన్న వీరికి సామాజిక వర్గ ఓట్లతో పాటు, అందరి మద్దతూ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. గొల్లప్రోలులో ఇప్పుడు అందరి దృష్టీ ఇప్పుడు భార్యాభర్తలు పోటీచేస్తున్న 8,9 వార్డులపైనే ఉంది.
నామినేషన్ వేసిన గర్భిణి
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ : అమలాపురం మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకుడు వాసంశెట్టి జగదీష్ భార్య భవాని కరుణశ్రీ పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఏడు నెలల గర్భిణిగా ఉన్న కరుణశ్రీ మహిళకు రిజర్వు అయిన 30వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. బుధవారం భర్తతో కలసి ఆమె మున్సిపల్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. గర్భవతినైనప్పటికీ వార్డులో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తానని ఆమె చెప్పారు.
Advertisement
Advertisement