
తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
రాజకీయ చైతన్యానికి మారుపేరయిన గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగుదేశం పార్టీ అసలు రంగు బయటపడింది. మున్సిపల్ కౌన్సిల్ సాక్షిగా టీడీపీ కౌన్సిలర్లు తన్నుకున్నారు. ముష్టియుద్ధాన్ని తలపించిన ఈ ఘటనలో కౌన్సిలర్లు గుమ్మడి రమేష్, పసుపులేటి త్రిమూర్తులు వీధిరౌడీలను తలపించారు. అసభ్య పదజాలం ఉపయోగిస్తూ.. ఒకరిపై ఒకరు కలబడ్డారు. తాము ప్రజలతో ఎన్నుకున్న గౌరవనీయ సభ్యులన్న విషయాన్ని కూడా మరిచి ఒకరిపై ఒకరు కలబడ్డారు.
తెలుగు తమ్ముళ్ల ముష్టిఘతాలతో నివ్వెరపోయిన తెనాలి కౌన్సిల్‌లోని ఇతర సభ్యులు వీరిద్దరిని నిలువరించేందుకు ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదు. మినిట్స్ బుక్‌లో ఎంట్రీలకు సంబంధించిన విషయమై ఇద్దరు సభ్యుల మధ్య తొలుత మాట మాట పెరిగింది. ఇంతలో పసుపులేటి త్రిమూర్తులు, గుమ్మడి రమేష్ నువ్వెంత అంటే నువ్వెంత అంటూ గొడవకు దిగారు. క్షణాల్లో పరిస్థితి అదుపుతప్పి ఇద్దరు వీధిరౌడిల్లా ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో కౌన్సిల్ సమావేశాన్ని గంట పాటు వాయిదా వేశారు.