వారి డబ్బులతోనే జల్సాలు
టీడీపీ నేతల అండతో దారుణాలు
తెనాలి యువతి ఏటీఎం కార్డు కూడా నవీన్ వద్దే
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ నేత, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడు, రౌడీషి టర్ నవీన్ టీడీపీ నాయకులతో ఉన్న సంబంధాలను ఆసరా చేసుకొని పాల్పడిన దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎవరిమీద పడితే వారిపై దౌర్జన్యాలు చేయడమే కాకుండా, యువతులను ట్రాప్ చేసి, వారి డబ్బుల తోనే జల్సాలు చేయడమే అతను వృత్తిగా పెట్టుకొన్నట్లు వల్లభాపురం గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో గుంటూరులో ఒక యువతిని ప్రేమిస్తున్నట్లు చెప్పి లొంగతీసుకున్నాడు. తర్వాత తెనాలి మండలం ఈమని గ్రామానికి చెందిన వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె డబ్బులతోనే తెనాలిలో ఇల్లు తీసుకుని ఉంటున్నట్లు సమాచారం. ఆరు నెలల క్రితం తెనాలి యువతిని వలలో వేసుకొని, ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు.
ఆమె ఏటీఎం కార్డు కూడా నవీన్ దగ్గరే ఉందని, ఆమె డబ్బులు పెద్ద ఎత్తున వాడుకున్నాడని, తిరిగి డబ్బులు అడిగినందుకే ఇరువురి మధ్య వివాదం జరుగుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే దాడి చేసి ఉంటాడని చెబుతున్నారు. కారులో వెళ్తుండగా సడన్ బ్రేక్ వేయడంతో ముందుకు పడి తలకు దెబ్బ తగిలిందని నవీన్ పోలీసులకు చెబుతున్నాడు. బ్రేక్ వేస్తే తల వెనుక దెబ్బ తగిలే ఆస్కారం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇది ఖచ్చితంగా దాడేనని వారు స్పష్టం చేస్తున్నారు. దాడికి ముందు లైంగిక దాడి జరిగిందా! లేదా!అన్న విషయంపై పరీక్షలు నిర్వహించారు.
ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. నవీన్ పథకం ప్రకారమే ఆ యువతిని బయటకు తీసుకువెళ్లి దాడి చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. నవీన్ ఒక్కడే ఈ పనిచేశాడా? అతని స్నేహితుల హస్తం కూడా ఉందా అన్నదానిపై విచారణ జరుపుతున్నారు. యువతి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నవీన్‌తోపాటు ఇద్దరు స్నేహితులు లైంగికంగా వేధించి దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అధికార పార్టీతో అతనికి ఉన్న సంబంధాల నేపథ్యంలో ఈ కేసును నీరు గార్చేందుకు పోలీసులపై పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం.
మరింత విషమించిన యువతి ఆరోగ్యం
నవీన్ చేతిలో తీవ్రంగా గాయపడిన యువతి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. మెదడులో రక్తస్రావం జరుగుతూనే ఉండటంతో అమెను కాపాడేందుకు జీజీహెచ్ వైద్యులు చేస్తున్న ప్రయత్నాలు ఫలితం ఇవ్వడంలేదు. సోమవారం ఉదయం ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, పల్స్ పూర్తిగా పడిపోయినట్లు చెబుతున్నారు. ఆ యువతి ఆరు వారాల గర్భిణి అని వైద్యులు నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment