మరోసారి భూమా, శిల్పా వర్గాల మధ్య విభేదాలు
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో భూమా, శిల్పా వర్గాల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. మంత్రి భూమా అఖిలప్రియ వ్యవహారశైలిలపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల మున్సిపాలటీ అధికారులు, కౌన్సిలర్లతో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తొలిసారి మంత్రి అఖిలప్రియ పాల్గొన్నారు. అయితే చైర్‌పర్సన్ దేశం సులోచన రాకముందే భూమా అఖిల ప్రియ సమావేశం ప్రారంభించారు. కాస్త ఆలస్యంగా సమావేశంలో పాల్గొన్న చైర్‌పర్సన్‌కు మంత్రి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.
దీంతో తమ వర్గానికి మాట్లాడే అవకాశం ఎందుకివ్వరని సులోచన అఖిలప్రియను ప్రశ్నించారు. చైర్ పర్సన్ రాకముందే మీటింగ్ ప్రారంభించడం కాకుంగా చైర్‌పర్సన్ పట్ల అఖిల ప్రియ కనీస మర్యాద లేకుండా ప్రవర్తించడంతో చైర్ పర్సన్ భర్త, కోఆప్షన్ మెంబర్ దేశం సుధాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. భూమా అఖిల ప్రియ తమ వార్డులలో సమస్యలు ఉంటే చెప్పాలని అడుగుతున్నారే తప్ప చైర్‌పర్సన్ కు అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం సమావేశంలో ఉండగానే తనకు కర్నూల్ వెళ్లాల్సి ఉందని, మీరు మాట్లాడుకోండి అని అఖిలప్రియ అనడంతో సుధాకర్ రెడ్డి వెంటనే లేచి మంత్రి గారు మీకు ఇది సబబుకాదని.. చైర్ పర్సన్ కు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అలా ఎలా వెళ్లిపోతారని ప్రశ్నించారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌ను అఖిల ప్రియ అవమానించారని సుధాకర్ రెడ్డి తెలిపారు. మంత్రి అయి ఉండి ఇలా చేయడం చాలా భాధ కలిగించిందని.. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు. అలాగే చైర్‌పర్సన్ అనుమతి లేకుండా సమావేశానికి వస్తే సహించేది లేదని ఘాటుగా స్పందించారు.