గందరగోళంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
- పలు అంశాలను లేవనెత్తిన వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్ సస్పెన్షన్
- టెండర్ల రద్దుపై కొనసాగిన వాదనలు
- మీడియాను అనుమతించని కమిషనర్
కొత్తగూడెం: పాలకవర్గం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందంటూ బుధవారం కొత్తగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు ధ్వజమెత్తడంతో..సభలో గందరగోళం నెలకొంది. 37 అంశాలతో చేపట్టిన మున్సిపల్ సమావేశంలో కనీసం ప్రతిపక్షానికి సమాధానం చెప్పకుండానే ఏకపక్షంగా కొనసాగింది. సింగిల్ టెండర్ల రద్దు విషయంపై వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్ కంభంపాటి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ జీవో 94 ప్రకారం లెస్‌కు వేసిన సింగిల్ టెండర్లు ఆమోదించాల్సి ఉండగా..రద్దు చేయాలంటూ పాలకపక్షం తీర్మానించడం సబబు కాదన్నారు. 10 నెలల కాలంలో ఐదు సింగిల్ టెండర్లను ఆమోదించిన కౌన్సిల్, కేవలం తమ వర్గానికి చెందినవారికి టెండర్ దక్కలేదనే దురుద్దేశంతోనే వాటిని రద్దు చేయాలని తీర్మానించిందన్నారు. ఎజెండాలో అంశాలను ఆమోదం కొరకు చేర్చే పాలకపక్షం వారే దానిని వ్యతిరేకించడం తగదన్నారు. ఈ విషయంపై గంటపాటు వాదోపవాదాలు జరిగాయి. మున్సిపల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్‌గా పనిచేసిన కె.స్వామిని గతేడాది సెప్టెంబర్‌లో సరెండర్ చేస్తున్నట్లు తీర్మానించి, దళితుడు కావడంతో ఏడు నెలలుగా లెటర్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌కు కారు ఏర్పాటు విషయంలో టెండర్లు పిలవకుండా కొటేషన్లను ఆమోదం కోసం కౌన్సిల్ అంశంలో చేర్చడమేంటని ప్రశ్నించారు. పీఎఫ్, ఈఎస్‌ఐ లేకుండానే టౌన్‌లెవెల్ ఫెడరేషన్‌కు కాంట్రాక్టును అప్పగించడంపై అభ్యంతరం తెలిపారు.
ప్రశ్నించిన వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్ సస్పెన్షన్..
ఇష్టారాజ్యంగా మున్సిపల్ ఎజెండాలో చేర్చిన అంశాలపై ప్రశ్నించిన వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్ కంభంపాటి దుర్గాప్రసాద్‌ను రెండు నెలలు సస్పెండ్ చేయాలంటూ చైర్‌పర్సన్ పులి గీత తీర్మానం ప్రవేశపెట్టడం గమనార్హం. కొత్తగూడెం మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడి 15 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు కౌన్సిలర్లను సస్పెండ్ చేసిన దాఖలాలు లేవు. స్థానిక ప్రజా ప్రతినిధి ఒత్తిడి మేరకు అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు మున్సిపల్ కార్యాలయం ముందు తిష్టవేసి ఆదేశాలు జారీ చేయడంతో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేశారనే విమర్శలు విన్పిస్తున్నాయి.
అంశాలు చర్చించకుండానే ఆమోదం..
మున్సిపల్ సాధారణ సమావేశంలో ఎజెండాలో 38 సాధారణ అంశాలతోపాటు మరో రెండు అంశాలపై చర్చించి కౌన్సిల్ ఆమోదం పొందాల్సి ఉంది. అయితే రెండుమూడు అంశాలపై వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్ కంభంపాటి దుర్గాప్రసాద్, భీమా శ్రీవల్లి చర్చను లేవనెత్తారు. దీంతో దుర్గాప్రసాద్‌ను సస్పెండ్ చేశారు. అనంతరం 38 అంశాలను కౌన్సిల్‌లో చర్చించకుండానే ఆమోదిస్తున్నట్లుగా చైర్‌పర్సన్ ప్రకటించారు. ప్రజల సమస్యలపై చర్చించకుండానే ఏకపక్షంగా కౌన్సిల్ ఆమోదించడంపట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
మరోమారు మీడియాపై ఆంక్షలు..
మున్సిపల్ చట్టం షెడ్యూల్-3, రూల్-1 ప్రకారం మున్సిపాల్టీలో జరిగే అన్ని సమావేశాలకు మీడియాను అనుమతించాల్సి ఉంది. అయితే గతనెల జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మీడియాను నిషేధిస్తూ బయటకు పంపించి వేశారు. ఈ అంశంపై అదేరోజు మీడియా ప్రతినిధులు ఆందోళన సైతం చేశారు. ఈ క్రమంలో బుధవారం జరిగిన సాధారణ సమావేశంలో కూడా మీడియా ప్రతినిధులను అనుమతించకుండా ఆంక్షలు విధించారు. కేవలం పాలకపక్షం స్వలాభం కోసం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేందుకే మీడియూను అనుమతించలేదని పాలకపక్ష కౌన్సిలర్లే పేర్కొనడం గమనార్హం. కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పులిగీత, కమిషనర్ సైఫుల్లా అహ్మద్, డీఈ సలీం, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
‘గూడెం’ కౌన్సిల్‌లో రగడ
Published Fri, May 1 2015 3:14 AM | Last Updated on Tue, Oct 16 2018 6:40 PM
Advertisement
Advertisement