
టైమ్ పడద్ది
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: ఎప్పుడెప్పుడు కుర్చీ ఎక్కుదామా అని ఆతృతతో ఎదు రు చూస్తున్న వారికి మరి కొంత కాలం నిరీక్షించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. గత ప్రభుత్వ అలసత్వం కారణంగా మున్సిపల్ ప్రజలకు ఇంకా ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ఏడాది హఠాత్తుగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ చేపట్టి ఆ ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ ప్రజలకు ప్రయోజనం లేకపోతోంది. మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల ఎన్నిక పూర్తయినప్పటికీ పాలకవర్గాలు కొలువుదీరేందుకు మరికొంత సమయం పట్టనుంది. మున్సిపాలిటీల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవికి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించేందుకు అవకాశం ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో అధికారులు చెబుతున్న దాని ప్రకారం జూన్ 2 తరువాతే కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నట్లు స్పష్టమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలుపొందిన వారు ప్రమాణ స్వీకారం చేసిన తరువాతనే కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నట్లు సమాచారం.
మూడున్నరేళ్లుగా...
జిల్లాలోని విజయనగరం, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీల పాలకవర్గాలు 2010 సెప్టెంబర్‌తో ముగిశాయి. అనంతరం ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పరిస్థితులు అనుకూలించకపోవడంతో నిర్వహించలేదు. దీంతో అప్పటి నుంచి నాలుగు మున్సిపాలిటీల్లో ప్రజలు కనీస మౌలిక వసతులకు నోచుకోని పరిస్థితి ఉంది. పేరుకు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగించినప్పటికీ ఏ రోజు కూడా అధికారులు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన దాఖలాలు లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా తమ బాధలను చెప్పుకునేందుకు అధికారుల వద్దకు వెళ్లినా కనీసం పట్టించుకున్న సందర్భాలు లేవని ఆయా పట్టణాల ప్రజలు వాపోతున్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 30న మున్సిపల్ పాలకవర్గాలను ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించి... ఈ నెల 12న అధికారులు కౌంటిం గ్ జరిపి విజేతలను ప్రకటించారు. ఎన్నికైన అభ్యర్థులు కొత్తపాలకవర్గం ద్వారా సేవలందిస్తారని భావించినప్పటికీ సార్వత్రిక ఎన్నికల లెక్కింపు వరకు అది కాస్తా బ్రేక్‌పడింది. అయితే ఆ ఎన్నికల కౌంటిం గ్ కూడా పూర్తయినప్పటికీ ప్రజలకు ఇంకొన్ని రోజులు సమస్యలతో సహవాసం తప్పని పరిస్థితి ఏర్పడింది.
‘ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి’
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్ : ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పట్టణంలోని వీటీ అగ్రహారానికి చెందిన డి.చిరంజీవి అన్నా రు. ఆపదలో ఉన్న మహిళ కు రక్తదానం చేసి ఆయన పలువురికి ఆదర్శంగా నిలి చాడు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని కాళీఘాట్ కాలనీకి చెందిన కృష్ణవేణి కొంత కాలంగా గర్భాశయ వ్యాధితో స్థానిక పీవీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈమెకు శస్త్రచికిత్స కోసం ఎ పాజిటివ్ గ్రూపు రక్తం అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో వీరి బంధువులు గాంధీ బ్లడ్ డోనర్స్ క్లబ్ అధ్యక్షుడు అబ్దుల్ రవూఫ్‌ను ఆశ్రయించారు. రవూఫ్ అభ్యర్థన మేరకు చిరంజీవి స్థానిక రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయంలో రక్తదానం చేశారు. ఆపదలో ఆదుకున్న చిరంజీవిని ఈ సందర్భంగా పలువురు అభినందించారు.