జిల్లాలో ఓటర్లు : 17,19,461
పోలింగ్ కేంద్రాలు : 2,085 ఈవీఎంలు : 10,600
పోలింగ్ సిబ్బంది : 15,720
లైవ్ వెబ్‌కాస్టింగ్ కేంద్రాలు : 617
పారామిలిటరీ దళాలు : 20 కంపెనీలు
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్:సార్వత్రిక పోరుకు సర్వం సిద్ధమైంది. జిల్లా వ్యా ప్తంగా బుధవారం 2,085 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిం చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొమ్మిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గానికి ఈ ఎన్నిక లు జరగనున్నాయి. 15,720 మంది సిబ్బందిని ఎన్నికల విధులకు వినియోగిస్తున్నారు. ఇందులో పోలీసు, రెవె న్యూ తదితర శాఖల సిబ్బందితో పాటు అంగన్‌వాడీ, ఆశ వర్కర్లు కూడా ఉన్నారు. తొలిసారిగా ఎన్నికల్లో వినియోగించే ఇతర సిబ్బందికి (ఓపీఓ) కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని కల్పించారు. జిల్లా వ్యాప్తంగా నియమించిన 2,166 మంది ఓపీఓలకు పోస్టల్ బ్యాలె ట్లు ఏర్పాటు చేసి ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో డ్రాప్ బాక్స్‌లు ఏర్పాటు చేశారు. 2,085 పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించారు. ఇప్పటికే సిబ్బంది పోలింగ్‌స్టేషన్లకు తరలివెళ్లారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 200 నుంచి 1400 మంది వరకు ఓటర్లున్నారు.
విజయనగరం పట్టణంలో 1600కు పైగా ఉన్న ఓ పోలింగ్ కేంద్రాన్ని మూడు భాగాలుగా చేయడంతో జిల్లాలో ఉన్న 2,083 పోలింగ్ కేంద్రాల సంఖ్య 2085కు పెరిగింది. మొత్తం 617 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ లైవ్ టెలీ కాస్టింగ్, 687 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు. వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయలేని చోట్ల 355 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ను నిర్వహిస్తారు. మిగతా ఆరు నియోజకవర్గాల్లోనూ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ను నిర్వహిస్తారు. జిల్లాలో 17,19,461 మంది ఓటర్లున్నారు. ఏప్రిల్ 19 వరకు నిర్వహించిన ఓటరు నమోదు ప్రక్రియ ద్వారా ఈ కొత్త ఓటర్ల సంఖ్యను ప్రకటించారు. ఎన్నికలను ప్రశాంతం గా నిర్వహించేందుకు 20 కంపెనీల పారామిలిటరీ బల గాలను, అదనపు సిబ్బందిని వినియోగిస్తున్నారు. వీరే కాకుండా ఎన్నికలకు సంబంధించి 2,085 మంది వలంటీర్ల సేవలను కూడా వినియోగించనున్నారు. 250 మం దిని సెక్టార్ ఆఫీసర్లుగా నియమించారు.
వెబ్ కాస్టింగ్ కోసం 700 మంది విద్యార్థులు, యువకులను వినియోగిస్తున్నారు. వీరే కాకుండా 285 మంది ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, 1048 మంది వీఆర్‌ఏలు, 752 మంది అంగన్‌వాడీ వర్కర్లు ఈ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తారు. జిల్లాకు ఎనిమిది వేల బ్యాలెట్ యూనిట్లు రాగా వాటి లో 5500 బ్యాలెట్ యూనిట్లు వినియోగించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో కంట్రోల్ యూనిట్లతో కలిపి 10,600 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో 431 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించా రు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 519, సున్నిత పోలింగ్ కేంద్రాలుగా 158 ఉండగా మిగతా 977 కేంద్రాలను సాధారణ కేంద్రాలుగా గుర్తించారు.
నిర్భయంగా ఓటు వేయండి: కలెక్టర్ ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కల్టెర్ కాంతి లాల్ దండే సూచించారు. ప్రజలంతా తమకు నచ్చిన నాయకుడ్ని ఎన్నుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో కలెక్టర్ మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. పోలింగ్‌స్టేషన్ల ఏర్పాటు, సౌకర్యాలు ఉన్నాయా లేదా తదితర అంశాలను పరిశీ లించారు. ర్యాండమైజేషన్ ప్రకారం పంపించిన సిబ్బం ది ఆ ప్రకారమే వచ్చారా లేదానని ఆరా తీశారు. నియోజకవర్గాల్లో ఉన్న మోడల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
ఓటరు స్లిప్పుంటే చాలు
బీఎల్వోలు పంపిణీ చేసిన ఓటరు స్లిప్పులుంటే చాలని, వాటి ఆధారంగా ఓటువేయవచ్చని అధికారులు ప్రకటించారు. ఇప్పటికే పోలింగ్‌బూత్‌ల వారీగా ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు. సోమవారం నాటికే 81 శాతం స్లిప్పుల పంపిణీ పూర్తి చేయగా మరికొన్నింటిని మంగళవారం పంపిణీ చేశారు. మిగిలిన స్లిప్పులను పోలింగ్ కేంద్రాల వద్ద పంపిణీ చేస్తామని తెలిపారు.
మాక్ పోలింగ్ అనంతరం క్లియర్ చేసి
సీల్ వేయాలి:
జిల్లాలో 2085 పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్‌ను నిర్వహిస్తారు. అనంతరం వాటిని క్లియర్ చేసి సీళ్లు వేస్తారు. దీనికి సంబంధించి సర్టిఫికెట్ ఇచ్చాకే పోలింగ్ ప్రారంభిస్తారు.