ఓటు గుట్టు వీడేది నేడే
సాక్షి ప్రతినిధి, విజయనగరం : అందరిలో ఒక్కటే ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థులైతే నరాలు తెగేంత టెన్షన్‌తో ఉన్నారు. క్షణమొక యుగంగా గడుపుతున్నారు. గురువారం రాత్రి చాలామందికి కంటిమీద కునుకులేకుండా పోయింది. ఎంత వేగంగా తెల్లవారుతుందా అని ఎదురు చూశారు. మొత్తానికి తొమ్మిది రోజులు గా వేచి చూస్తున్న లెక్కింపు రోజు వచ్చేసింది. ఉత్కంఠకు తెరపడే సమయం ఆసన్నమయింది. మరికొన్ని గంటల్లో గెలిచేదేవరో, ఓడేదెవరో తేలిపోనుంది.
11.30 గంటలకు తొలి ఫలితం
ఉదయం 11.30 గంటలకు తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంది. కురుపాం నియోజకవర్గంలో పోలైన ఓట్లను 14 రౌండ్లలో లెక్కించనున్నారు. ఈ నియోజకవర్గ ఫలితం మొట్టమొదట వెల్లడి కానుంది. ఆ తర్వాత పార్వతీపురం ఫలితం రానుంది. మిగతా నియోజకవర్గాలకు సంబంధించి 16 నుంచి 17రౌండ్లలో లెక్కింపు జరగనుంది. మొత్తానికి మధ్యాహ్నం 12 గంటల కల్లా ఫలితాలన్నీ వచ్చే అవకాశం ఉంది. కాగా, ప్రతి నియోజకవర్గంలో 14 నుంచి 16 టేబుళ్లగా విభజించి లెక్కింపు చేపడుతున్నారు. వెన్నుపోటు రాజకీయాలు అభ్యర్థులను మరింత భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దాదాపు ప్రతి పార్టీలోను వెన్నుపోటు దారులుండడంతో ఆయా పార్టీలు మునుపెన్నడూలేని ఆందోళనతో ఉన్నాయి. కొంతమంది నాయకులైతే బహిరంగంగానే క్రాస్ ఓటింగ్‌కు పిలుపునిచ్చారు. ఒక ఓటు అటు, మరోటి ఇటు అంటూ ఓటు వేయడానికి వెళ్లే ముందు ఓటర్లను ప్రభావితం చేశారు. క్రాస్ ఓటింగ్ అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది. ఎవరికి వేయాలనుకుని ఎవరికి వేసేశారోనన్న బెంగ ప్రతి అభ్యర్థిలోనూ నెలకొంది. బయటొకటి చెప్పి లోపల ఇంకొకటి చేసిన వారు చాలామంది ఇప్పుడిప్పుడే బయటపడుతుండటంతో అభ్యర్థుల్లో మరింత టెన్షన్ చోటు చేసుకుంది. క్రాస్ ఓటింగ్ ప్రోత్సహించిన వారి గురించి ఆలస్యంగా తెలుసుకున్నా అంతా అయిన తరువాత ఇప్పుడేం చేయగలమన్న అభిప్రాయంతో అభ్యర్థులు నిస్సహాయులుగా ఉండిపోయారు.
ఒక వైపు కౌంటింగ్ సమయం ముంచుకొస్తుండడం, మరో వైపు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడటంతో ప్రతి ఒక్కరిలోనూ ఏదొక మూలన భయం వెంటాడుతోంది. తమకు వచ్చే ఓట్ల గురించి ఒకటికి రెండు సార్లు లెక్కలు వేసుకుంటున్నారు. బూత్‌ల వారీగా వచ్చే ఓట్లు విషయంలో మళ్లీ అంచనాలు వేసుకున్నారు. గెలుపోటములపై బేరీజు కట్టారు. నిశ్శబ్ద ఓటింగ్ ఎక్కువగా ఉండడంతో అంచనాలు అంతుచిక్కడం లేదు. జిల్లాలో హేమాహేమీలు పోటీచేశారు. జాతీయ స్థాయిలో పేరుగాంచిన వైరిచర్ల కిషోర్‌చంద్రదేవ్, విజయనగరం జిల్లాలో తొలి మహిళా ఎంపీగా పనిచేసిన బొత్స ఝాన్సీలక్షి్ష్మ, ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిైకైన పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించిన పతివాడ నారాయణస్వామినాయుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఇండిపెం డెంట్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో విజయం సాధించిన కోలగట్ల వీరభద్రస్వామి, హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్న సుజయ్‌కృష్ణరంగారావు, పీడిక రాజన్నదొర, తొలి ప్రయత్నంలో ఎంపీగా పోటీ చేసిన బేబినాయన, ఎమ్మెల్యేగా పోటీ చేస్తు న్న బెల్లాన చంద్రశేఖర్, పాముల పుష్పశ్రీవాణి, డాక్టర్ సురేష్‌బాబు, జమ్మాన ప్రసన్నకుమార్, కిమిడి మృణాళిని, రొంగలి జగన్నాథం తదితరుల భవితవ్యం తేలనుంది. జిల్లాలో టీడీపీ వృద్ధనేత కోళ్ల అప్పలనాయుడు కోడలు కోళ్ల లలితకుమారి, గజపతినగరం వంగపండు ఫ్యామిలీకి చెంది న కడుబండి శ్రీనివాసరావు తలరాత ఏంటో తేలబోతోంది.