హై స్పీడ్‌లో ఫ్యాన్ గాలి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో ఫ్యాన్ గాలి ప్రభంజనంలా వీస్తోంది. వైఎస్సార్ సీపీ విజయం ఖాయమైపోయిందని భావిం చిన టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు తెరలేపాయి. వైఎస్సార్ సీపీని ఒంటరిగా ఎదుర్కోలేక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న ఆ రెండు పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు ప్రజలు కూడా సిద్ధమయ్యారు. ఆ పార్టీల బరితెగింపు రాజకీయాలను గమనించి కార్మిక సంఘాలు, కుల సంఘాలు, వ్యాపార, ఉద్యోగ వర్గాలు వైఎస్సార్ సీపీకి మద్దతిచ్చేందుకు ముందుకొచ్చాయి. కుటిల రాజకీయాలు చేస్తున్న ఆ పార్టీలకు తగిన శాస్తి చెప్పాలని నిర్ణయించాయి. దీంతో ఎటూ చూసినా ఫ్యాన్ హవాయే కన్పిస్తోంది. దీంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. ఎన్నికల వేళ కాంగ్రెస్, టీడీపీలు లోపాయికారీగా ఒకరికొకరు మద్దతు పలికేందుకు సిద్ధమయ్యాయి. చివరి నిమిషంలో కుమ్మక్కు రాజకీయాలు బట్టబయలవడంతో ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. డబ్బు, మద్యం, మ్యాచ్‌ఫిక్సింగ్‌తో ఎన్నికల్లో గట్టెక్కొచ్చని లోపాయికారీగా కుయుక్తులు పన్నినా ప్రజలు వాటన్నింటినీ తిప్పికొట్టారు. ప్రజల మధ్య నిత్యం ఉంటూ, కష్టనష్టాలు ఓర్చుతూ ప్రజాసమస్యలపై పోరాడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేక నీచ రాజకీయాలకు దిగుతున్నారన్న విషయాన్ని ప్రజలు గుర్తించారు.
కక్షపూరిత రాజకీయాలతో జైల్లో పెట్టింది చాలక ఎన్నికల వేళ కుమ్మక్కు రాజకీయాలతో లబ్ధిపొందాలని వేసిన ఎత్తుగడలను పసిగట్టిన ప్రజలు రాజన్న కుటుంబానికి అండగా ఉండాలని, ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో లబ్ధి చేకూర్చిన మహానేత తనయుడికి మద్దతు ఇవ్వాలని నిర్ణయానికొచ్చేశాయి. దీంతో ఆ రెండు పార్టీలకు కోలుకోలేని పరిస్థితిని ఎదుర్కొన్నట్టు అయ్యింది. ప్రజలను మసిపూసి మారేడు కాయ చేసి చివరి క్షణంలో డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసి గెలుచేద్దామనుకున్న టీడీపీ నాయకులకు తమ పార్టీది బలుపు కాదు వాపు అని అర్థమయ్యింది. ఇక అభ్యర్థుల గుణగణాలు కూడా ఆ పార్టీకి ప్రతికూలంగా పరిణమించాయి. గజపతినగరం టిక్కెట్ వచ్చిందన్న సంతోషంలో దౌర్జన్యానికి దిగిన టీడీపీ నేతలు గెలిస్తే ఏమైనా ఉందా అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకు పోయింది. ఆ పార్టీ అభ్యర్థి కొండపల్లి అప్పలనాయుడిపై తీవ్ర వ్యతిరేకతను నెలకొల్పింది.
అలాగే, ఒక అభ్యర్థి దొరికిన కాడికల్లా అప్పులు చేసేసి ఆనక నెత్తిన టోపీ పెట్టడం, మరో అభ్యర్థి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు నెరపడం, ఇంకో అభ్యర్థి నిజమైన గిరిజనుడు కాకపోవడం, స్థానికేతరునిగా మరో అభ్యర్థి...ఇలా అనేక ప్రతికూల పరిస్థితులను టీడీపీ ఎదుర్కొంటోంది. ఇలాంటి నేతలను ఎన్నుకుంటే ఏమైనా ఉందా అనే భావనకు ప్రజలొచ్చేశారు. ఇవన్నీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు అనుకూలంగా మారాయి. కాగా, వైఎస్సార్‌సీపీ ప్రభంజనాన్ని చూసి బెట్టింగ్ రాయుళ్లు కూడా రంగంలోకి దిగారు. పార్టీకొచ్చే మెజార్టీపై పందాలు కాస్తున్నారు. కురుపాం నియోజకవర్గంలోనైతే గెలుపుపై కాకుండా రెండో స్థానంలో ఉండబోయే పార్టీపై పందాలు జరుగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ విజయం ఖాయమైపోయిందన్న భావనతో రెండో స్థానంలో టీడీపీ ఉంటుందని కొంద రు, టీడీపీ రెబల్ అభ్యర్థి ఉంటారని మరికొందరు పం దాలు కాస్తున్నారంటే పరిస్థితేంటో అర్థంచేసుకోవచ్చు.