అసలు తీర్పు రేపే!
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడికానున్నాయి. పార్లమెంటు, శాసన సభ స్థానాల ఓట్ల లెక్కింపును ఉదయం 8 గంటలకు ప్రారంభిస్తారు. జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒక పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపును జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కాంతిలాల్ దండే ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు 77 మంది అభ్యర్థులు, విజయనగరం పార్లమెంటు స్థానానికి తొమ్మిది మంది పోటీ చేశారు. మే 7న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల ను పరిశీలకుల సమక్షంలో స్ట్రాంగ్‌రూంలలో భద్రపరిచి వాటికి సీళ్లు వేశారు. కౌంటింగ్ సందర్భంగా రాజకీయ నాయకుల సమక్షంలో సీళ్లు తెరిచి లెక్కింపు కేంద్రాలకు తరలిస్తారు. లెక్కింపులో పాల్గొనే ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు ఇస్తారు. ఏడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కాలేజీలో, మిగతా రెండు అసెంబ్లీ స్థానాల లెక్కింపును డెంకాడలోని ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో చేపట్టనున్నారు. వాటి వివరాలను ఆయా కౌంటింగ్ ప్రదేశాలను, నియోజకవర్గాల వారీగా గదులనూ అధికారులు ఇప్పటికే ప్రకటించారు.
ఓట్ల లెక్కింపు కేంద్రాలివే...
బొబ్బిలి నియోజకవర్గం : విజయనగరం పట్టణంలోని జేఎన్‌టీయూకాలేజ్ నూతన బ్లాక్ సెంటర్ మొదటి అం తస్తు తూర్పుభాగంలో పార్లమెంటు ఓట్లలెక్కింపు, పశ్చి మ భాగంలో శాసన సభ ఓట్ల లెక్కింపు చేపడతారు.
గజపతినగరం: జేఎన్‌టీయూ నూతన బ్లాక్ సెంటర్ భవనంలోని మొదటి అంతస్తులో లెక్కిస్తారు.
నెల్లిమర్ల: జేఎన్‌టీయూకె నూతన బ్లాక్‌లో తూర్పువైపు భవనంలోని రెండో అంతస్తులో శాసన సభ ఓట్ల లెక్కింపు, పశ్చిమం వైపు లోక్ సభ ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.
విజయనగరం: జేఎన్‌టీయూ నూతన బ్లాక్ సెంటర్ భవనం రెండో అంతస్తు
కురుపాం: జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కాలేజ్‌లో బేసిక్ సెన్సైస్ మొదటి సంవత్సరం బ్లాక్‌లో చేపడతారు.
పార్వతీపురం: జేఎన్‌టీయూకేలో అకడమిక్ బ్లాక్ మొదటి అంతస్తు లైబ్రరీ హాలులో లెక్కిస్తారు.
సాలూరు: జేఎన్‌టీయూలో అకడమిక్ బ్లాక్ మొదటి అంతస్తు పశ్చిమ భాగంలో లోక్‌సభ ఓట్ల లెక్కింపు, రెండో అంతస్తు పశ్చిమ భాగంలో శాసన సభ ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.
చీపురుపల్లి: డెంకాడ మండలం, చింతలవలసలోని ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్‌లోని మొదటి అంతస్తు సెమినార్ హాల్‌లో చేపడతారు.
ఎస్.కోట: డెంకాడ మండలం చింతవలసలోని ఎంవీజీఆర్ కాలేజ్ రెండో అంతస్తులోని డ్రాయింగ్ హాలు-1లో లోక్ సభ ఓట్ల లెక్కింపు, అదే
కాలేజ్‌లో హాల్-2లో శాసనసభ ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.