భద్రత వలయం
కాకినాడ క్రైం, న్యూస్‌లైన్ :అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిమిత్తం కాకినాడలో భారీ భద్రత చర్యలు తీసుకున్నారు. ఎస్పీ జి. విజయ్ కుమార్ నేతృత్వంలో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలతో పాటు పోలీసు సిబ్బంది, ప్రత్యేక బలగాలతో బందోబస్తు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 144 సెక్షన్ విధించారు. అభ్యర్ధులు, ఏజెంట్లు, మీడియా ప్రతినిధులను ఫొటో గుర్తింపు ఉంటేనే అనుమతిస్తారు. మూడు పార్లమెంట్ స్థానాలకుగాను వేర్వేరు కేంద్రాలలో కౌంటింగ్ నిర్వహిస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు.
పార్కింగ్ స్థలాలు ఇవే..
కాకినాడ పార్లమెంట్, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ జేఎన్‌టీయూకేలో జరుగుతుంది. అభ్యర్థులు, ఏజెంట్లు వాహనాలను జేఎన్‌టీయూకే క్రీడా మైదానంలో పార్క్ చేసి యూనివర్సిటీ నార్త్‌గేటు నుంచి కౌంటింగ్ కేంద్రానికి రావాలి. రాజమండ్రి పార్లమెంట్, దాని పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ రంగరాయ వైద్య కళాశాలలో జరుగుతుంది. వాహనాలను ప్రభుత్వ ఐటీఐలో పార్క్ చేసి కేంద్రానికి వెళ్లాలి. అమలాపురం పార్లమెంట్, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల కౌంటింగ్ విద్యుత్‌నగర్ ఐడియల్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. ఇక్కడి వాహనాలకు నాన్సీ స్ట్రీట్ మామిడితోటలో పార్కింగ్ ఏర్పాటు చేశారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా...
భానుగుడి నుంచి సర్పవరం జంక్షన్‌కు వచ్చే వాహనాకు మళ్లింపు మార్గం నిర్దేశించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్ నుంచి పిఠాపురం, తుని వెళ్లే వాహనాలు భానుగుడి, కొండయ్యపాలెం, మిలటరీ రోడ్డు, కరణంగారి జంక్షన్, విద్యుత్ నగర్, గైగోలుపాడు, సర్పవరం జంక్షన్ మీదుగా ఏడీబీ రోడ్డు చేరుకోవాలని సూచించారు. పిఠాపురం నుంచి నగరంలోకి వచ్చే వాహనాలు సర్పవరం జంక్షన్ నుంచి రమణయ్యపేట మార్కెట్, గంగరాజునగర్, గొడారిగుంట, వెంకట్‌నగర్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌కు రావాలి. కౌంటింగ్ కేంద్రాలన్నీ కాకినాడలోనే ఏర్పాటు చేసినందున ట్రాఫిక్ మళ్లింపుతో సహా నిబంధనలను పాటించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ జి.విజయ్‌కుమార్ కోరారు.
సబ్ డివిజన్‌లో సెక్షన్ 30
ఓట్ల లెక్కింపు సందర్భంగా మంగళవారం సాయంత్రం నుంచి సెక్షన్ 30 అమలులోకి వస్తుందని కాకినాడ డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కర రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాకినాడ సబ్ డివిజన్ పరిధిలో సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా ఉండవద్దని సూచించారు. అభ్యర్థులు, ఏజెంట్లు, నాయకులు నిబంధనలను పాటించాలని డీఎస్పీ కోరారు.