కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామని కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. కౌంటింగ్ ఏర్పాట్లపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. స్ట్రాంగ్‌రూంలో ఉన్న ఈవీఎంలను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఉదయం ఏడు గంటలకు పరిశీలకులు, ఆర్వోల ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహిస్తామన్నారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ఏడు నియోజకవర్గాలు జేఎన్‌టీయూలో, రెండు నియోజకవర్గాలు ఎంవీజీఆర్ కళాశాలల్లో నిర్వహిస్తామన్నారు.
అభ్యర్థులు సహకరించాలి!
ఓట్ల లెక్కింపును ప్రశాంతంగా నిర్వహించేం దుకు పోటీలో ఉన్న అభ్యర్థులు సహకరించాలని కలెక్టర్ కోరారు. గురువారం ఆయన తన కార్యాలయంలో ఓట్ల లెక్కింపు, కొత్తగా అమర్చిన పాడ్ వివరాలను తెలియజెప్పేందుకు అభ్యర్థులతో సమావేశాన్ని నిర్వహించారు. కొత్త ఈవీఎంలకు ప్రింటర్ కం ఆక్సిలరీ డిస్‌ప్లే యూనిట్(పాడ్)ను ఏర్పాటు చేశామన్నారు. ఇది కొత్తగా ఈ ఎన్నికల కౌంటింగ్‌లోనే ప్రారంభించామని చెప్పారు. ఈ యూనిట్లు అమర్చడం వల్ల అభ్యర్థులకు పోలైన ఓట్ల వివరాలను ప్రింట్‌తీసుకునేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ను అమలు చేస్తున్నట్టు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, వాటర్‌బాటిళ్లు, ఇంక్ పెన్నులను నిషేధించామన్నారు. ఓట్ల లెక్కింపునకు ప్రతినియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేశామని, ప్రతి టేబుల్‌కు మైక్రో అబ్జర్వర్‌ను నియమించామని, వీరు ఓట్ల లెక్కింపును పర్యవేక్షిస్తారని తెలిపారు. పోస్టల్‌బ్యాలెట్ల కౌంటింగ్‌కు 8 టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు. వీటికి కూడా ఏజెంట్లను నియమించుకోవచ్చని అభ్యర్థులకు కలెక్టర్ సూచించారు. సమావేశంలో అన్ని పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
కౌంటింగ్‌కు గంట ముందే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు: భన్వర్‌లాల్
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు గంట ముందే పోస్టల్‌బ్యాలెట్ల లెక్కింపు జరగాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఆయన కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ ప్రతి టేబుల్‌కూ ఏజెంట్లను నియమించాలని ఆదేశించారు. టేబుల్ వారీగా వీడియో గ్రఫీకి అనుమతించకుండా మొత్తం కౌంటింగ్ హాలులో వీడియో తీయాలన్నారు. ఫలితాలు వెలువడి రిటర్నింగ్ అధికారులు ఇంక్‌సైన్‌చేసిన తరువాత మిగతా నివేదికలన్నీ పంపించాలన్నారు. పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన వారి అడ్రసు, పార్టీ పేరు, గుర్తుల వివరాలతో ఎన్నికల కమిషన్‌కు పంపించాలన్నారు. ఇద్దరు వ్యక్తులకు సమాన ఓట్లు వచ్చినపుడు ఎన్నికల కమిషన్ అనుమతి పొందిన తరువాతే లాటరీ పద్ధతిలో డ్రా తీయాలన్నారు.