సైకిల్ పరుగు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. జిల్లాలో తొలిసారిగా పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ మూడు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. జిల్లాలో 2004 నుంచి ప్రతికూల ఫలితాలను చవిచూస్తున్న టీడీపీ పదేళ్ల తరువాత మెరుగైన ఫలితాల ను సాధించింది. వైఎస్సార్‌సీపీ మూడు స్థానాల్లో గెలిచి రెండో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ ఒక్కస్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీయే కారణమని నమ్మిన ప్రజలు ఆ పార్టీపై ఇలా ఆగ్రహాన్ని తీర్చుకున్నారు. దీంతో ఆ పార్టీకి చెందిన హేమాహేమీలు మట్టికరిచారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పిన వైరి చర్ల కిషోర్‌చంద్రదేవ్‌కు డిపాజిట్లు కూడా రాలేదు. పీసీసీ అధ్యక్షునిగా, సీనియర్ మంత్రిగా ఓ వెలుగు వెలిగిన బొత్స సత్యనారాయణ ఘోర పరాజయం పొందారు. ఈ జిల్లాకు చెందిన సీనియర్ నేత శత్రుచర్ల విజయరామరాజు, ఆయన మేనల్లుడు వి.టి.జనార్దన్ థాట్రాజ్ టీడీపీలోకి కుప్పిగంతులేసి పోటీ చేసినా ప్రజలు ఓడించారు.
ఆరు స్థానాల్లో టీడీపీ- మూడు చోట్ల వైఎస్సార్‌సీపీ
1999 నాటి ఫలితాలు టీడీపీకి లభించాయి. అప్పటిలాగే ఆరు స్థానాల్లో విజయం సాధించింది. విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం, పార్వతీపురం, ఎస్.కోట నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపొందింది. ఇకతొలి ప్రయత్నంలో వైఎస్సార్‌సీపీ మూడు స్థానాల్లో గెలుపొందింది. బొబ్బిలి, సాలూరు, కురుపాం నియోజకవర్గాల్లో విజయబావుటా ఎగురవేసింది. నెల్లిమర్లలో టీడీపీ తరఫున పోటీ చేసిన పతివాడ నారాయణస్వామినాయుడు ఏడోసారి విజయం సాధించారు. ఇప్పుడున్న వారిలో ఆయనే రాజకీయ కురువృద్ధుడు. వైఎస్సార్ సీపీ తరఫున గెలిచిన సుజయ్‌కృష్ణరంగారావు, పీడిక రాజన్నదొర హ్యాట్రిక్ విక్టరీ సాధించారు. తాత వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న కోళ్ల లలితకుమారి రెండో సారి గెలుపొందారు. ఇక, రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్ కె.ఎ.నాయుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కురుపాం నియోజకవర్గం నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన వైఎస్‌ఆర్ సీపీ నేత శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు కోడలు, పరీక్షిత్ రాజ్ భార్య పాముల పుష్ప శ్రీవాణి గెలుపొందారు.
తొలి ప్రయత్నంలోనే కిమిడి మృణాళిని కూడా విజయం సాధించారు. ఇక, ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చి, తక్కువ వ్యవధిలో టిక్కెట్ దక్కించుకుని మీసాల గీత విజయం సాధించారు. గత ఎన్నికల్లో పార్వతీపురం నుంచి ఓటమి పాలైన బొబ్బిలి చిరంజీవులు తన రెండో ప్రయత్నంలో విజయం సాధించారు. టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు భారీ మెజార్టీతో ఎంపీగా విజయం సాధించారు. తొలిసారిగా కేంద్ర రాజకీయాల్లో అడుగు పెడుగుతున్నారు. ఎమ్మెల్యేకొచ్చేసరికి కోళ్ల లలితకుమారి 28,652 ఓట్లతో అత్యధిక మెజార్టీ సాధించిన నేతగా నిలిచారు. ఆమె తర్వాత కిమిడి మృణాళి -20,842, ఆ తర్వాత స్థానంలో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన పాముల పుష్ప శ్రీ వాణి -19,037 ఓట్ల మెజార్టీతో నిలిచారు. మిగతా వారి విషయానికొస్తే గజపతినగరంలో గెలిచిన కె.ఎ.నాయుడు- 19,423, విజయనగరంలో విజయం సాధించిన మీసాల గీత -15,404, హ్యాట్రిక్ విక్టరీ కొట్టిన సుజయ్‌కృష్ణరంగారావు-6,958, నెల్లిమర్లలో గెలిచిన పతివాడ నారాయణస్వామినాయుడు -6,669, పార్వతీపురంలో విజేతగా నిలిచిన బొబ్బిలి చిరంజీవులు -6,129, మూడోసారి విజయం సాధించిన పీడిక రాజన్నదొర 5,068 ఓట్ల మెజార్టీని సాధించారు.