ప్రచార స్పీడ్‌తో ఫ్యాన్ జోరు
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్ సీపీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థుల విజయం ఖాయమని తేలిపోయినా భారీ మెజార్టీ సాధన దిశగా ఆ పార్టీ అగ్రనేతలు ప్రచార రథాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇటీవల ఐదురోజుల పాటు జిల్లాలో నిర్వహించిన ప్రచారంతో నియోజవర్గాల ముఖచిత్రాలు మారిపోయాయి. ఆ తరువాత వైఎస్ విజయమ్మ విశాఖపట్నం లోక్‌సభ అభ్యర్థిగా బరిలో నిలవడం, ఆ పార్టీ మేనిఫెస్టో సామాన్యులకు చేరువకావడంతో ఫ్యాన్ మరింత స్పీడ్ అందుకుంది. ఆ గాలి అభిమానులకు, ఆపన్నులకు సుతారంగా తాకుతుండగా, ప్రత్యర్థుల పాలిట టోర్నడోగా మారుతోంది. ప్రచండమైన గాలుల వేగానికి ఆయా పార్టీలు కకావికలమవుతున్నాయి. ఈ దశలో వైఎస్‌ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం జిల్లాలో మరోసారి ప్రచారం నిర్వహించనున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలో వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఐదురోజుల పాటు నిర్వహించిన ప్రచారంతో నియోజకవర్గాల్లో పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. నాటి నుంచి వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా ఆ పార్టీ గాలే వీస్తోంది. ఇక, వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటనతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. శృంగవరపుకోట నియోజకవర్గంలో ఇటీవల రెండు రోజుల పాటు నిర్వహించిన పర్యటనతో కాంగ్రెస్, టీడీపీలు కుదేలయ్యాయి. ఆ పార్టీలకు చెందిన వేలాది మంది కార్యకర్తలు, నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. దీంతో ఆ రెండు పార్టీలు ఓటమి భయంతో మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు నెరుపుతున్నాయి.అగ్రనేతల ప్రచారంతో సమరోత్సాహంగత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 2వ తేదీన వరకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రచారం నిర్వహించగా, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఈ నెల 18, 27వ తేదీల్లో శృంగవరపుకోట నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. దీంతో రెట్టింపు ఉత్సాహంతో పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి.
నాలుగు నియోజకవర్గాల్లో రోడ్‌షో
కార్యకర్తల ఉత్సాహం మధ్య వైఎస్ విజయమ్మ బుధవారం జిల్లాలో సుడిగాలి ప్రచారం చేయనున్నారు. వైఎస్‌ఆర్ జనభేరి కార్యక్రమంలో భాగంగా నెల్లిమర్ల, చీపురుపల్లి, విజయనగరం, గజపతినగరం నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహించి పలుచోట్ల ప్రసంగించనున్నారు. ఆమె రాకకోసం ఇటు కార్యకర్తలు, అటు ప్రజలు ఎదురుచూస్తున్నారు.