వలసనేత పురందేశ్వరికి గుణపాఠం చెప్పండి
వలసనేత పురందేశ్వరికి ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సూట్‌కేసు పట్టుకుని రాష్ర్టమంతా వెతుక్కుంటూ రాజంపేట పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా వచ్చిన ఆమెను ఇంటికి సాగనంపాలని కోరారు.
పుంగనూరు, న్యూస్‌లైన్: ఎంపీ పదవి కోసం రాష్ర్టంలో పలు నియోజకవర్గాలను వెతుకులాడుతూ సూట్‌కేస్ లగేజీతో రాజంపేటకు వలస వచ్చిన పురందేశ్వరికి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. వలస నేతను ఇంటికి పంపాలని కోరారు. పుంగనూరులో మంగళవారం జెడ్పీటీసీ అభ్యర్థి వెంకటరెడ్డి యాదవ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్రమంత్రిగా ఉన్న పురందేశ్వరి రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు దోహదం చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నేడు ఎంపీ పదవి కోసం మతతత్వ బీజేపీలో చేరిన ఆమెకు రాజంపేట లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు సత్తా ఏమిటో చూపాలన్నారు. ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు కలసికట్టుగా ఉంటూ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురందేశ్వరిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
సమైక్యాంధ్రను విభజించినందుకు ఓట్లు వేయాలా? టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకున్నందుకు ఓట్లు వేయాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం కొత్త నాటకాలు ఆడుతున్నారని, ఈ నాటకాలకు తెరదించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. వలస నేతలతో దోస్తీ పెట్టుకుని టీడీపీ అభ్యర్థి వెంకటరమణరాజు ప్రజలను మోసగించేందుకు రెండోసారి వస్తున్నారని, ఆయనకు ప్రజలే గుణపాఠం చెప్పాలని కోరారు.
2009 ఎన్నికల్లో పోటీచేసిన వెంకటరమణరాజు ఆ తర్వాత ఐదేళ్లు నియోజకవర్గంలో ఎన్నిసార్లు తిరిగారంటూ ప్రజలు నిలదీయాలన్నారు. ఓట్ల కోసమే ప్రజల ముందుకు వచ్చే వారికి తగిన శాస్తి చేయాలని సూచించారు. పుంగనూరు నియోజకవర్గంలో గత ఐదేళ్లలో కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్టు ఆయన తెలిపారు. అయితే కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉంటూ తనపై వ్యక్తిగత కక్షతో పనులు ప్రారంభించకుండా ఆపివేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సమస్యలను గుర్తించి ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయిస్తామన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేందుకు సరైన నేతలను ఎన్నుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందన్నారు. మాయమాటలతో ఎన్నికల సమయంలో ఓట్లు దండుకునేందుకు వచ్చే వారికి ఓట్ల రూపంలోనే గుణపాఠం చెప్పాలన్నారు. మే 7వ తేదీ జరిగే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై ముద్రించి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డిని అఖండ మెజారిటీగెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో నేతలు అమరనాథరెడ్డి, గంగిరెడ్డి, మేలుపట్ల కృష్ణారెడ్డి, అక్కిసాని భాస్కర్‌రెడ్డి, చదళ్ల విజయభాస్కర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.