బొత్స అండ్ కో.. ఆలౌట్!!
తెలుగు మాట్లాడేవాళ్లకు రెండు రాష్ట్రాలుంటే తప్పేంటి అంటూ.. ఇష్టారాజ్యంగా మాట్లాడి సమైక్యవాదుల ఆగ్రహాన్ని ప్రత్యక్షంగా చవిచూసిన పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ కుటుంబంలో ప్రతి ఒక్కరినీ విజయనగరం జిల్లా వాసులు చిత్తుచిత్తుగా ఓడించారు. విజయనగరం జిల్లాను తమ సొంత సామ్రాజ్యంగా భావించిన బొత్స సత్యనారాయణ.. జిల్లా కేంద్రంలోని లోక్సభ నియోజకవర్గంతో పాటు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన కుటుంబ సభ్యులకు టికెట్లు ఇప్పించారు. అయితే ఒక్కళ్లు గెలిస్తే ఒట్టు!!
విజయనగరం పార్లమెంటు నియోజకవర్గంలో సత్తిబాబు సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ చేశారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన పూసపాటి అశోక్ గజపతి రాజు విజయం సాధించారు. చీపురుపల్లి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బొత్స సత్యనారాయణను టీడీపీ అభ్యర్థిని కిమిడి మృణాళిని 20,812 ఓట్ల తేడాతో ఓడించారు. గజపతినగరం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన సత్తిబాబు తమ్ముడు అప్పల నరసయ్య కూడా ఓటమి చవిచూడక తప్పలేదు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి కేఏ నాయుడు 19,421 మెజారిటీతో నెగ్గారు. నెల్లిమర్లలో పోటీ చేసిన బొత్స సమీప బంధువు బడుకొండ అప్పలనాయుడును టీడీపీ సీనియర్ నాయకుడు పతివాడ నారాయణ స్వామి నాయుడు 6,669 ఓట్ల తేడాతో ఓడించారు. ఇక బొత్స సత్యనారాయణకు అనుంగు అనుచరుడిగా మెలుగుతూ వచ్చిన యడ్ల రమణమూర్తి కూడా విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి రుచి చూశారు. మునిసిపాలిటీ మాజీ చైర్పర్సన్ మీసాల గీత ఇక్కడ విజయం సాధించారు.