బొత్సపై కొరడా!
బొత్సపై కొరడా!
Published Sun, Apr 20 2014 5:45 AM | Last Updated on Sat, Sep 2 2017 6:17 AM
సాక్షి ప్రతినిధి, విజయనగ రం : పదేళ్లు జిల్లాతో పాటు రాష్ట్రాన్ని శాసించిన బొత్స కు ఊహించిన ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎన్ని చేపట్టినా ఎవరేం చేయగలరని ధోరణితో వ్యవహరించిన బొత్స ఫ్యామిలీకి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. చేతిలో ఉన్న అధికారంతో రెచ్చిపోయిన వారికి ఇప్పుడు షాక్ మీద షాక్ తగులుతోంది. నాడు చిన్న చూపుతో చూసిన వారంతా ఇప్పుడు తిరగబడుతున్నారు. అధికా ర కార్పానికి చిన్నబోయిన అధికారులంతా ఎదురు తిరుగుతున్నారు. కనీసం గౌరవానికి నోచుకోని పోలీస్ అధికారులు అవకాశం చిక్కినప్పుడుల్లా నిబంధనల కొరడా ఝుళిపిస్తున్నారు.
చట్టం ముందు అం దరూ సమానులే అని చట్ట ప్రకారంగా బుద్ధి చెబుతున్నారు. బొత్స దౌర్జన్యానికి నూకలు చెల్లాయని చెప్పకనే చెబుతున్నారు. ఇప్పటికే ఆయన వెంట ఉండే నాయకులంతా గుడ్‌బై చెప్పేశారు. నమ్ముకున్న కార్యకర్తలు జారుకున్నారు. తన కుటుంబానికి చెందిన నాయకులు తప్ప మరెవ్వరూ లేరు. రాజకీయంగా ఒంటరైపోయిన బొత్సకు మింగుడు పడడం లేదు.‘ చేతిలో అధికారం పోయింది. అండగా ఉంటారనుకున్న నాయకులు ఝలక్ ఇచ్చారు. ఆశలు పెట్టుకున్న కార్యకర్తలు ఎదురెళ్లి టాటా చెప్పేస్తున్నారు’ ఈ పరిణామాలన్నీ బొత్సను కుంగదీసేస్తున్నాయి. ఒకప్పుడు ఆయన అవమానకర చర్యలతో క్షోభకు గురైన వారంతా ఇప్పుడు తిరగబడుతున్నారు. ముఖ్యంగా పోలీసులంటే ఏ మాత్రం గౌరవమివ్వని బొత్స ఫ్యామిలీకి ఇప్పుడు వారు కొరకరాని కొయ్యగా తయారయ్యారు.
ఏ వన్ నిందితులుగా నాడు చిన్న శ్రీను, నేడు బొత్స
మొన్నటికి మొన్న పరిషత్ ఎన్నికల్లో మెరకముడిదాం మండలంలో బొత్స మేనల్లుడు చిన్న శ్రీను నేతృత్వంలో డబ్బులు పంచుతుండగా పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో అనుచరులంతా పట్టుబడ్డా చిన్న శ్రీను మాత్రం తప్పించుకుని పరారయ్యాడు. దీంతో మెరకముడిదాం పోలీసులు కేసు నమోదు చేసి, చిన్న శ్రీనును ఏ వన్‌గా చూపించారు. ఆయనకోసం గాలించారు. అదేదో అయ్యిందనుకుంటే తాజాగా బొత్సపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో ఏ వన్ నిందితుడిగా ఎఫ్‌ఐఆర్‌లో నమోదైంది. చీపురుపల్లిలో నామినేషన్ వేసే కార్యక్రమానికి జనాలను వాహనాలతో తరలించారన్న అభియోగంతో కేసు నమోదు చేశారు. మెరకముడిదాం మండలం గర్బాం, బైరీపురం గ్రామాలకు జనాలు తరలిస్తున్న లారీలను గరివిడి పోలీసులు పట్టుకున్నారు. నియోజకవర్గంలో తమకు పట్టు సడల లేదని నిరూపించుకునేందుకు చేసే ప్రయత్నంలో బొత్స దొరికిపోయారు. నాలుగు లారీలను సీజ్ చేసి, అందుకు కారకులైన బొత్స సత్యనారాయణను ఏ వన్‌గా చూపించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక్క వాహనాలే కాదు పెద్ద ఎత్తున ముట్టజెప్పి జనాలను తీసుకొచ్చారని విమర్శలొచ్చాయి. మద్యంతో పాటు ఖరీదైన మాంసాహార భోజనాన్ని సరఫరా చేశారన్న ఆరోపణలు వెల్లువత్తాయి.
ఉక్కుపాదం మోపుతున్న ఓఎస్‌డీ ప్రవీణ్
తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదని ఓఎస్‌డీ ప్రవీణ్ నిరూపిస్తున్నారు. జిల్లాను శాసించి, పోలీస్ వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్న బొత్స ఫ్యామిలీపై అవకాశం దొరికినప్పుడల్లా ఉక్కుపాదం మోపుతున్నారు. డబ్బులు పంపిణీ చేస్తుండగా మొన్న చిన్న శ్రీనును పరుగెత్తించిన ఓఎస్‌డీ ఈరోజు బొత్స సత్యనారాయణ నామినేషన్ కోసం జనాల్ని తరలిస్తున్న వాహనాలను పట్టుకుని కేసు నమోదు చేశారు. దీంతో అంతలో ఎంత మార్పు వచ్చిందని పోలీసు వ్యవస్థపై చర్చించుకోవడం విన్పిస్తోంది.
Advertisement