సత్తిబాబుకు మా సెడ్డ కట్టమొచ్చింది
పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్తిబాబుకు మా సెడ్డ కట్టమొచ్చింది. చీపురు పల్లి నుంచి పోటీ చేయాలో లేక ఇజీనారం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలో అర్థం కాక ఆయన తన జుట్టుతో పాటు తన అనుచరుల జుట్టుకూడా పీకుతున్నారట. మొన్నటిదాకా చీపురు పల్లి కాపోతే ఎస్.కోటకు వెళ్దారి అనుకున్న సత్తిబాబుకు రెండు చోట్లా ఓటమి ఖాయమని క్లారిటీ వచ్చిందట. ఓడిపోయేదేదో లోక్ సభ స్థానం నుంచి ఓడిపోతే ...ఆనక సింపతీతో రాజ్యసభ సీటు ట్రై చేసుకోవచ్చునని బొత్స గడుసుగా ఆలోచిస్తున్నారట.
వాస్తవానికి రాష్ట్ర విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సీమాంధ్రలో అమాంతంగా పడిపోయిన కాంగ్రెస్ గ్రాఫ్తో పాటు తాను ప్రాతనిధ్యం వహిస్తున్న చీపురుపల్లిలో కూడా తన ప్రాభవం తగ్గిపోవడంతో ప్లేస్ మార్చాలని అప్పట్లోనే బొత్స నిర్ణయించారు. జిల్లా అంతా వెదికి చివరకు ఎస్ కోట నుంచి పోటీ చేయాలని భావించి.. ఆ మేరకు అక్కడో పెద్ద కర్చీఫ్ వేశారు.
అయితే ఈ నియోజకవర్గంలో మేజర్ కమ్యూనిటీ వెలమ సామాజిక వర్గం బొత్స వైఖరిపై ఉన్న అసంతృప్తితో ఎన్నికల్లో సహకరించరన్న సమచారాంతో బొత్స తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. తిరిగి చీపురుపల్లి నుంచే బరిలో దిగాలని భావించారు. ఆరు నూరైనా తాను చీపురుపల్లి నుంచే పోటీ చేస్తానని.... ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు తానే స్వయంగా వెళ్లి సమాధానం చెప్తానని కార్యకర్తలతో సెలవిచ్చారు.
తాను వ్యక్తిగతంగా సమైక్యవాదినేనని పీసీసీ మాజీ అయిన తర్వాత జిల్లాకు వచ్చిన తొలి సమావేశంలో గోడు వెళ్లబోసుకున్నారట. దీంతో బొత్స మూడోస్సారీ చీపురుపల్లి బరిలో ఖాయమని అంతా అనుకున్నారు. అయితే ఈ సమావేశం జరిగిన మరుసటి రోజే బొత్సకు కోలుకోలేని షాక్ తగిలింది. తన ప్రధాన అనుచరుడు జెడ్పీ మాజీ ఛైర్ పర్సన్ బెల్లాన చంద్రశేఖర్ వైఎస్సార్సీపీలో చేరడంతో పాటు సుమారు 40 మంది సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు వైఎస్సార్సీపీలో చేరడంతో బొత్స మరోసారి పునారాలోచనలో పడ్డారట.
మరోసారి తన అనుచరులతో సమావేశమై తాను విజయనగరం పార్లమెంటుకు, ఝాన్సీ చీపురుపల్లి అసెంబ్లీకి బరిలో దిగితే ఎలా ఉంటుందని అభిప్రాయసేకరణ చేస్తున్నారట. బొత్స ఒకవేళ ఎంపీగా పోటీ చేస్తే.... జిల్లా తెలుగుదేశం పార్టీలో కూడా అనూహ్య పరిణామాలు తప్పవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి బొత్స ఎన్నడూ పూసపాటి వంశీయులైన అశోక్ గజపతిరాజు కుటుంబంపై నేరుగా పోటీ చేసిన సందర్భాలు లేవు.
ఈ నేపధ్యంలో టిడిపి ఇప్పటికే అశోక్ ను టిడిపి విజయనగరం ఎంపీగా ఆయనకు ఇష్టం లేకపోయినా ప్రకటించిన పరిస్ధితుల్లో ఆయన తిరిగి అసెంబ్లీకి రావడం ఖాయమని అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్, టిడిపిల మధ్య అవగాహనేనని చెప్పుకుంటున్నారు. ఇందులో భాగంగా అసెంబ్లీకి అశోక్ గజపతికి, పార్లమెంటుకు సత్తిబాబుకు ఓటు వేసేలా గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తిరిగి సత్తిబాబు తెరపైకి తీసుకువస్తారని అంచనా వేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కష్టమని బొత్సకు క్లారిటీ ఉందట. అలాగని ఎంపీగా గెలిచేస్తారని కాదు. ఒకవేళ కాలం కలిసిరాక తాను ఎంపీగా ఓడినా... సానుభూతితో కాంగ్రెస్ అధిష్టానం తనకు రాజ్యసభ టిక్కెట్టైనా ఇస్తుందని ఆశతో ఉన్నారట సత్తిబాబు. ఇందులో భాగంగానే బొత్స అసెంబ్లీ నుంచి పార్లమెంటుకు రూటు మార్చినట్లు కాంగ్రెస్ శ్రేణులు సమాచారం.