sattibabu
-
ఆయనకిద్దరితో పెళ్లి.. ఆరు ముళ్లు.. పద్నాలుగు అడుగులు!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘‘మూడే ముళ్లు... ఏడే అడుగులు.. మొత్తం కలిపి నూరేళ్లు...’’ ఓ సినీ గేయ రచయిత అన్న మాటలను ఈయన సరిగ్గా డబుల్ చేశాడు. ఒకే రోజు ఇద్దరికీ.. ఒక్కొక్కరికి మూడు ముళ్లు.. వెరసి ఆరు ముళ్లు వేసి పద్నాలుగు అడుగులు నడిచాడు. ఇక కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే పిల్లలు.. చందంగా పెళ్లి సమయానికే ఇద్దరు వధువులూ ఒకరు మగ బిడ్డతో.. ఒకరు ఆడ బిడ్డతో పెళ్లి పీటలపై కూర్చొని సదరు పెళ్లి కొడుకుతో తాళి కట్టించుకున్నారు. ఈ చిత్రమైన పెళ్లి’ళ్లు’భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామంలో జరిగాయి. పూర్వాపరాలిలా.. గ్రామానికి చెందిన సత్తిబాబు దోశిళ్లపల్లికి చెందిన స్వప్నకుమారితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ శారీరకంగా ఒకటి కావడంతో స్వప్నకుమారి గర్భం దాల్చింది. విషయం ఆమె ఇంట్లో తెలియడంతో పెళ్లి చేసుకునేందుకు సత్తిబాబు ఓకే అన్నాడు. కానీ స్వప్నకి తెలియకుండా సత్తిబాబు కుర్నపల్లికి చెందిన సునీతతోనూ మరో ప్రేమ కథ నడిపాడు. ఈమెనూ గర్భవతిని చేశాడు. ఇరువురు యువతుల తల్లిదండ్రులతో పాటు కుల పెద్దలూ రంగంలోకి దిగారు. తాను ఇద్దరినీ ప్రేమించానని, ఇరువురినీ పెళ్లి చేసుకుంటానని సత్తిబాబు చెప్పగా, యువతులూ అంగీకరించడంతో పరస్పర అంగీకారంతో ఒకే చోట కాపురం పెట్టాడు. గతేడాది జూలైలో స్వప్నకుమారి పాపకు జన్మనివ్వగా, సెప్టెంబర్‌లో సునీతకు బాబు పుట్టాడు. కాగా తన పెళ్లి ఘనంగా జరగలేదని భావించిన సత్తిబాబు..ఈనెల 9న గురువారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక వరుడు, ఇద్దరు వధువుల పేర్లతో పెళ్లి పత్రిక అచ్చు వేయించి బంధుమిత్రులందరికీ పంచాడు. సోషల్ మీడియాలో ఈ పెళ్లికార్డు వైరల్‌గా మారింది. సత్తిబాబు పెళ్లి ముచ్చట ఆరు ముళ్లు, పద్నాలుగు అడుగులతో ముగిసింది. -
ఆయనకు ఇద్దరితో పెళ్లి.. ఒకే ముహూర్తానికి.. వైరల్‌గా శుభలేఖ
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఓ గిరిజన గ్రామానికి చెందిన వ్యక్తి ఒకే ముహూర్తానికి ఇద్దరు వధువుల మెడలో తాళిబొట్టు కట్టనున్నాడు. కుర్నపల్లి గ్రామపంచాయతీకి చెందిన కోయ గిరిజనుడు, వ్యవసాయ కూలీ మడివి సత్తిబాబు అదే గ్రామానికి చెందిన సునీతతో పాటు దోశిళ్లపల్లికి చెందిన స్వప్నకుమారిని ప్రేమించాడు. ఈ క్రమంలో స్వప్నతో వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించగా.. విషయం తెలుసుకున్న సునీత నిలదీసింది. ఇరువురికీ సర్దిచెప్పేందుకు పెద్దలు ప్రయత్నించినా ఫలించలేదు. దీంతో సత్తిబాబు ఇద్దరితోనూ ఎర్రబోరులో ఏడాది క్రితం కాపురాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం సునీత, స్వప్నకు ఒక్కో సంతానం ఉన్నారు. కోయ గిరిజనుల్లో కొన్ని తెగల వారు కొంత కాలం కలిసి కాపురం చేశాక వివాహం చేసుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో వివాహ విషయాన్ని నలుగురికి తెలిసేలా విందు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు, పెద్దలు సూచించారు. దీంతో సత్తిబాబు గురువారం ఉదయం 7.04 గంటలకు ఇద్దరితో కల్యాణ ముహూర్తమని శుభలేఖలు అచ్చు వేయించి బంధువులకు పంచాడు. దీంతో ఈ కార్డు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. -
విశ్వాసం కోల్పోయిన కాకినాడ మేయర్
కాకినాడ: కాకినాడ మేయర్ సుంకర పావని, డిప్యూటీ మేయర్ కె.సత్తిబాబు విశ్వాసం కోల్పోయారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వారిపై అవిశ్వాసానికి మద్దతుగా 36 మంది ఓట్లు వేశారు. అవిశ్వాసానికి వ్యతిరేకంగా.. మేయర్‌కు మద్దతుగా ఒక్కరు కూడా ఓటు వేయలేదు. చివరకు మేయర్ కూడా తన ఓటు వేసుకోలేదు. సొంత టీడీపీలో అసమ్మతి కార్పొరేటర్లు విప్‌ను ధిక్కరించి మరీ మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసానికి మద్దతుగా ఓటేశారు. టీడీపీకి చెందిన మేయర్, డిప్యూటీ మేయర్లపై మొత్తం 33 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. వీరిలో టీడీపీకి చెందిన 21 మంది, వైఎస్సార్సీపీకి చెందిన 8 మంది, బీజేపీకి చెందిన ఇద్దరు, ఇండిపెండెంట్లు ఇద్దరు ఉన్నారు. మంగళవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ప్రిసైడింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ పర్యవేక్షణలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి 43 మంది కార్పొరేటర్లు, ఓటు హక్కు కలిగిన మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి.. మొత్తం 46 మంది హాజరయ్యారు. బీజేపీ కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న సమావేశానికి హాజరుకాలేదు. చేతులెత్తే పద్ధతిన ఓటింగ్ ఉదయం 11 గంటలకు మేయర్ సుంకర పావనిపై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉండే ఓటర్లు చేతులెత్తి సమ్మతి తెలియజేయాలని జేసీ సూచించారు. టీడీపీకి చెందిన 21 మంది, వైఎస్సార్సీపీకి చెందిన 8 మంది, బీజేపీకి చెందిన ఇద్దరు, ఇండిపెండెంట్లు ఇద్దరు, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే.. మొత్తం 36 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా చేతులెత్తారు. తీర్మానాన్ని వ్యతిరేకించే సభ్యులు చేతులెత్తి ఓటింగ్‌లో పాల్గొనాలని జేసీ సూచించగా ఎవరూ చేతులు ఎత్తలేదు. మేయర్, టీడీపీకి చెందిన 8 మంది, ఒక ఇండిపెండెంట్ సభ్యుడు కూడా స్తబ్ధుగా ఉండిపోయారు. దీంతో మేయర్‌కు ఒక్క కార్పొరేటర్ మద్దతు కూడా లేదని నిర్ధారణ అయ్యింది. అనంతరం 12 గంటలకు డిప్యూటీ మేయర్ కాలా సత్తిబాబుపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. ఆ తీర్మానానికి అనుకూలంగా 36 మంది ఓటు వేశారు. అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ మేయర్, టీడీపీకి చెందిన 8 మంది, ఒక ఇండిపెండెంట్ సభ్యుడు వేశారు. దీంతో డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లయింది. ఓటింగ్ ఫలితాన్ని కలెక్టర్ రవికిరణ్ ద్వారా ప్రభుత్వానికి పంపిస్తామని జేసీ చెప్పారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు కోల్పోయినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించిన అనంతరం కొత్త మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు తేదీని ఖరారు చేయనున్నారు. చంద్రబాబును ధిక్కరించిన తెలుగుదేశం కార్పొరేటర్లు టీడీపీ అధినేత చంద్రబాబు మాటను, పార్టీ విప్‌ను కూడా టీడీపీ కార్పొరేటర్లు ధిక్కరించారు. అసమ్మతి కార్పొరేటర్లతోపాటు పార్టీకి అనుకూలంగా ఉన్న కార్పొరేటర్లు కూడా విప్‌ను పట్టించుకోకపోవడంతో టీడీపీ నేతలు షాక్ అయ్యా రు. విప్ జారీ చేసినా మేయర్‌కు మద్దతుగా ఒక్కరు కూడా ఓటు వేయకపోవడం చర్చకు దారితీసింది. టీడీపీలో అసమ్మతితో ఉన్నవారు>క మిగిలిన కార్పొరేటర్లు మాజీ ఎమ్మెల్యే కొండబాబు వర్గంగా చలామణి అవుతున్నారు. ఆయన కూడా తన వర్గం కార్పొరేటర్లు విప్‌ను ధిక్కరించేలా చూసినట్లు తెలిసింది. -
అల్లి ‘పిల్లి’ ఆర్భాటం దేనికీ...
అది టీడీపీ జిల్లా కార్యాలయం... సమయం: శుక్రవారం ఉదయం 11 గంటలు లైట్‌గా చినుకులు పడుతున్నాయ్... ఏపీ 5DA నంబర్‌తో తెలుగురంగు స్కార్పియో వాహనం ఎమ్మెల్యే కాకినాడ రూరల్ అనే స్టిక్కర్‌తో దూసుకొచ్చింది. అంతా ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి వచ్చారనుకున్నారు.. తీరా డోర్ తెరిచి వైట్ అండ్ వైట్ డ్రెస్‌తో ఆమె భర్త పిల్లి సత్తిబాబు దిగారు. వెంటనే ఆయనకు పక్కన ఉన్న గన్‌మెన్ గొడుగు పట్టాడు. ఇది చూసినవారంతా ‘ఓర్ని...ఎమ్మెల్యే ‘పతి’ గారు ఏం బిల్డప్ ఇచ్చార్రా బాబూ! అని ఆశ్చర్యపోయారు. ఆలిది అధికారం... పెనిమిటి పెత్తంన అనే మాట కాకినాడ రూరల్ మండలంలో విస్తృతంగా వినిపిస్తున్నా... ఎమ్మెల్యే భర్త హడావుడి ఏ మాత్రం తగ్గడం లేదు. అంతేకాకుండా ఎమ్మెల్యే అయిన భార్యను ఇంటికి పరిమితం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అచ్చం 'బాహుబలి'లో లాగే..
-
అచ్చం 'బాహుబలి'లో లాగే..
చింతపల్లి: నాలుగు రోజుల నుంచి కుమార్తెకు తీవ్ర జ్వరం.. చికిత్స చేయించాలంటే కాలువ దాటాల్సిందే.. కానీ ఆ కాలువ ఇటీవలి వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎలాగైనా తన ఏడాది కుమార్తెను కాపాడుకునేందుకు ఆ కాలువను సైతం ఎదిరించడానికి సిద్ధపడ్డాడు ఓ తండ్రి. సరిగ్గా బాహుబలి సినిమాలో పసికందును చేతితో పైకెత్తి ప్రవాహానికి ఎదురునిలిచిన రమ్యకృష్ణను గుర్తుకు తెచ్చే ఈ ఘటన విశాఖ జిల్లా చింతపల్లి మండలం కుడుముసారిలో మంగళవారం చోటు చేసుకుంది. కుడుముసారి గ్రామానికి చెందిన పాంగి సత్తిబాబు ఏడాది కుమార్తెకు నాలుగు రోజులైనా జ్వరం తగ్గకపోగా తీవ్రమైంది. చిన్నారిని చికిత్స కోసం తీసుకెళ్దామంటే వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కుడుమసారి కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. బంధువులంతా వద్దన్నా కుమార్తెకు వైద్యం చేయించేందుకు కాలువ దాటడానికే సత్తిబాబు సిద్ధమయ్యాడు. పసికందును చేతుల పెకైత్తుకొని అతికష్టమ్మీద కాలువ దాటాడు. తర్వాత సుమారు 5 కిలోమీటర్ల మేర నడిచి మెయిన్‌రోడ్‌కు చేరుకొని లోతుగెడ్డ పీహెచ్‌సీకి తీసుకెళ్లాడు. చికిత్స అనంతరం చిన్నారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యుడు చెప్పడంతో సత్తిబాబు ఊపిరి పీల్చుకున్నాడు. -
తమ్ముణ్ణి కత్తితో పొడిచిన అన్న
విశాఖపట్టణం జిల్లా చోడవరంలో భూమి తగాదా కారణంగా అన్నదమ్ములు గొడవపడ్డారు. సత్తిబాబు అనే వ్యక్తి తన తమ్ముడు బాబూరావును గురువారం ఉదయం కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన బాబూరావును చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చోడవరం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మీకు పుణ్యం ఉంటుంది!
అనారోగ్యంతో మృతి చెందిన భర్త క్యాన్సర్ వ్యాధితో భార్య మంచంపట్టి ఉన్న పెద్దకుమార్తె మగ దిక్కులేని కుటుంబం తల్లడిల్లుతున్న పిల్లలు మరో జన్మ లేకపోవడమే మోక్షం.అలాంటి మోక్షం కోసం మనిషి తపిస్తాడు. ఏదీ... మనలాగా కొద్దోగొప్పో మంచి జీవితం ఉన్నవాళ్లే తపిస్తారు. ఓ రకంగా మనం మోక్షం కోరుకోవడం అత్యాశేనేమో! కానీ... చిట్టెమ్మలాంటి వాళ్లు మళ్లీ మనిషి పుట్టుక వద్దు అని కోరుకోవడం ఆశ కాదు... అవసరం అనిపిస్తుంది. మూట కట్టుకున్న పుణ్యం వల్ల మోక్షం కలుగుతుందో లేదో తెలియదు కానీ... చిట్టెమ్మకు ఇవాళ్టి కష్టాల నుండి మోక్షం కలిగించగలిగితే మనం తప్పకుండా పుణ్యం మూటకట్టుకుంటాం. పేదరికంలో మగ్గుతున్న ఆ కుటుంబానికి వ్యాధులు ఆవేదనను మిగిల్చాయి. పెద్ద కుమార్తె మతిస్థిమితం లేకుండా, అవయవాలు పనిచేయకుండా మంచానికే పరిమితమైంది. అంతుచిక్కని వ్యాధితో నాలుగేళ్ళ క్రితం భర్త మరణించాడు. గర్భసంచి క్యాన్సర్ సోకి ఆమె తల్లడిల్లుతోంది. వైద్యం చేయించుకునేందుకు చేతులో చిల్లిగవ్వ లేక సమాజం వైపు నీరింకిన కళ్ళతో చూస్తోంది. పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టలేని దీనస్థితిలో ఆ తల్లి కుమిలిపోతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో విలీనమైన ఖమ్మం జిల్లా వేలేరుపాడు మండల కేంద్రంలో సంతపాకలకు చెందిన ముర్తిపేట చిట్టెమ్మ కన్నీటి గాథ ఇది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముర్తిపేట సత్తిబాబు, చిట్టెమ్మలు పొట్టకూటి కోసం పాతికేళ్ళ క్రితం వేలేరుపాడులో ఓ రైస్‌మిల్లులో పనిచేయడానికి వచ్చారు. అప్పటి నుండి ఇక్కడే స్థిరపడిపోయారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. అంతుచిక్కని రోగాలు... పెద్ద కుమార్తె దుర్గ. ఇప్పుడు ఆమె వయసు 17 ఏళ్లు. మతిస్థిమితం లేదు. నడుము, కాళ్లు పనిచేయవు. దీంతో లేవలేని స్థితిలో ఉన్న ఆమెకు తల్లి వెంటే ఉండే సపర్యలు చేయాలి. అయినా భర్త ఉన్నన్నాళ్లూ పిల్లల పోషణ చిట్టెమ్మకు భారం కాలేదు. కానీ, నాలుగేళ్ళ క్రితం అంతుచిక్కని వ్యాధితో భర్త సత్తిబాబు మృతి చెందాడు. పుట్టెడు శోకంతో బతుకుబండి లాగుతున్న చిట్టెమ్మకు ఆ తర్వాతి ఏడాదే గర్భసంచి క్యాన్సర్ వచ్చిందని తెల్సింది. ముగ్గురు ఆడపిల్లలను ఎలా పోషించాలో, తనకు వైద్యం ఎలా చేయించుకోవాలో... దిక్కుతోచలేదు చిట్టెమ్మకు. అయినప్పటికీ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతి మూడునెలలకోసారి వెళ్లి, వైద్యం చేయించుకునేది. చార్జీలకు డబ్బుల్లేక... ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం ఉచితమే అయినా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడ ఆసుపత్రికి వెళ్లాలంటే ఆమెకు పోను పోను భారంగా మారింది. మూడునెలలకొకసారి కోబాల్ట్ కీమోథెరపీ చేయించుకోవాలి. బస్సుచార్జీలకు కూడా డబ్బుల్లేక వైద్యం మానుకొని ఇంటి వద్దనే ఉంటోంది. సరైన వైద్యం అందక ఆరునెలల నుంచి ఒంటి నిండా కురుపులు వచ్చాయి. నీరసించి నడవలేకపోతోంది. గతంలో కుటుంబ పోషణ కోసం కూలి పనికె ళ్లేది. ఇప్పుడు కూలిపనులకు వెళ్లలేని పరిస్థితిలో పెద్దకూతురు దుర్గకు కాపలాగా ఉంటోంది. వారంలో నాలుగు రోజులు పస్తులే... ఈ కుటుంబానికి తెల్లరేషన్ కార్డు ఉండటంతో నెలకు 20 కేజీల బియ్యం వస్తున్నాయి. పెద్ద కుమార్తె దుర్గకు వికలాంగుల పెన్షన్ కింద నెలకు 15 వందల రూపాయలు వస్తాయి. వేలేరేపాడు మండలం ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైనప్పటి నుంచి ఇక్కడ వితంతు పెన్షన్లు అందడం లేదు. ఆ విధంగా చిట్టెమ్మకు ఆ ఆసరా కూడా లేకపోయింది. కేవలం 1500 రూపాయలతోనే ఇల్లు గడవాలి. ఉన్న కాసిన్ని డబ్బులు దేనికీ సరిపోవడం లేదని మందులూ కొనడంలేదు. ఇవే నెలంతటికీ సరిపోక వారంలో నాలుగురోజులు పస్తులుంటున్నారు. మధ్యాహ్న భోజనానికే పాఠశాలకు... చిట్టెమ్మ రెండవ కుమార్తె పరిమళ. స్థానిక ప్రభుత్వ హైస్కూల్లో 6వ తరగతి, చిన్నకూతురు మరియమ్మ నాలుగవ తరగతి చదువుతూ తల్లికి అండగా ఉంటున్నారు. మధ్యాహ్న భోజనం దొరుకుతుందనే ఆశతో పరిమళ, దుర్గ పాఠశాలకు వెళ్తున్నారు. వారిద్దరికీ ఒక పూట భోజనం అక్కడే గడిచిపోతోంది. కానీ, రాత్రులు పస్తులు ఉన్న రోజులు ఎన్నో. అక్క దుర్గకు కూడా భోజనం పాఠశాల నుంచే తీసుకెళ్తారు. సంతలో కుళ్లిన కూరగాయలు... ప్రతీ శుక్రవారం వీరి ఇంటికి దగ్గరలో వారాంతపు సంత జరుగుతుంది. ఈ సంతలో కూరగాయలు అమ్మే వ్యాపారులు సంతలో అమ్మగా, అందులో కుళ్ళిన కూరగాయలను అక్కడే పడేస్తారు. వీటిని పరిమళ, మరియమ్మలు సేకరించుకొని ఇంటికి తీసుకెళ్తారు. వాటినే వండుకొని తింటున్నారు. - ఎం.ఏ.సమీర్, సాక్షి, వేలేరుపాడు ఎవరూ లేరు... నాకు అయినవారు ఎవరూ లేరయ్యా! నా భర్త బతికి ఉన్నంతకాలం బాగానే గడిచింది. అంతుచిక్కని జబ్బుతో మంచం పట్టాడు. ఆయన్ను బతికించుకోవడం కోసం కూలి పనులు చేసి, ఎంతో కష్టించా. అయినా బతికించుకోలేకపోయాను. ఆయన చనిపోయాక, నాకు క్యాన్సర్ వచ్చింది. ఎప్పుడు పోతానో తెలియదు. నా పిల్లల కడుపుకింత తిండిపెట్టలేక నరకయాతన పడుతున్నా. నా బాధను ఆ దేవుడే తీర్చాలి...!! (కన్నీళ్లతో చెప్పింది చిట్టెమ్మ) - చిట్టెమ్మ చేయూతనందించాలనుకునే వారికోసం... చిట్టెమ్మ ముత్తుపేట - A.C.No.: 73054816819 IFSC Code: SBIN0RRAPGB ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్‌బ్యాంక్ (NGB), వేలేరుపాడు బ్రాంచ్. ఫోన్ నెం: 9666368979 చూసి చలించా... ఈ కుటుంబానికి వచ్చిన కష్టం పగవారికి కూడా రావద్దని మొక్కనివారు లేరు ఇక్కడ. మూడేళ్ళుగా ఈ కుటుంబం పడుతున్న కష్టాలను కళ్ళారా చూస్తున్నా. పస్తులున్న రోజున బియ్యం, కూరగాయలు ఇస్తూ వచ్చాను. చిట్టెమ్మకు వైద్యం అందేలా, ఆ పిల్లలకు ఇంత అండ దొరికేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. - కొండేపూడి విజయ్‌కుమార్, వేలేరుపాడు వాస్తవ్యుడు -
నిజంగా... ఇది డబుల్ ధమాకా!
‘‘రెండున్నర గంటల పాటు ప్రేక్షకులు హాయిగా నవ్వుకునే సినిమా ఇది. మొత్తం 72 సన్నివేశాల్లోనూ కావాల్సినంత కామెడీ ఉంది’’ అని దర్శకుడు ఇ. సత్తిబాబు చెప్పారు. అల్లరి నరేశ్ ద్విపాత్రాభినయంలో అంబికా రాజా నిర్మించిన చిత్రం ‘జంప్ జిలానీ’. అంబికా కృష్ణ సమర్పణలో వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్-రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఇ. సత్తిబాబు దర్శకుడు. అంబికా రామచంద్రరావు నిర్మాణ నిర్వాహకుడు. ఈ 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం సత్తిబాబు పాత్రికేయులతో మాట్లాడుతూ -‘‘తాతల కాలం నాటి హోటల్ని కాపాడుకోవాలనుకునే ఓ మనవడు, ఆ హోటల్ని అమ్మేసి వేరే ఏదైనా వ్యాపారం చేసుకోవాలని తపన పడే మరో మనవడి నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఈ రెండు పాత్రలనూ అల్లరి నరేశే చేశారు. మామూలుగా ఒక్క నరేశ్ ఉంటేనే కడుపుబ్బా నవ్వుకుంటాం. ఇక, ఇద్దరు నరేశ్లంటే డబుల్ ధమాకానే. ద్విపాత్రాభినయం నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో రెండు పాత్రలూ తెరపై కనిపించే సన్నివేశాలు తక్కువ ఉంటాయి. కానీ, ఈ సినిమాలో దాదాపు పాతిక సన్నివేశాల్లో ఇద్దరు నరేశ్లూ కనిపిస్తారు. మూడు పాటల్లో కూడా ఈ రెండు పాత్రలూ కనిపిస్తాయి. పంచ్ డైలాగ్‌లతో సినిమా పసందుగా ఉంటుంది. నా ‘యముడికి మొగుడు’ సినిమాకి మంచి సంభాషణలు ఇచ్చిన క్రాంతిరెడ్డి సకినాల ఈ చిత్రానికి కూడా మంచి డైలాగులు రాశాడు. పాత్రలు విసిరే పంచ్ డైలాగ్‌లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. మరో హైలైట్ పోసాని పాత్ర. ఒక పాటకు పోసాని స్టెప్స్ కూడా వేశారు. తమిళ చిత్రం ‘కలగలప్పు’ ఆధారంగా తీసిన సినిమా అయినప్పటికీ, మాతృకకు చాలా మార్పులు చేశాం’’ అని చెప్పారు. -
సత్తిబాబు గల్లా ఖాళీ.....
చీపురుపల్లి : పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఎదురీత తప్పదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో హవా కొనసాగించిన బొత్స గల్లా ఖాళీ అయిందని ఓటర్లు చెప్పుకుంటున్నారు. రాష్ట్ర విభజనలో ఆయన కీలక పాత్ర పోషించారని ప్రజలు బలంగా విశ్వసించడంతో కాంగ్రెస్ పార్టీపై బాగా వ్యతిరేకత పెరిగింది. దీనికి తోడు నియోజకవర్గంలో పలు హామీలు మరిచిపోవడంతో కూడా వ్యతిరేకత ఉంది. జిల్లాను బొత్స సత్యనారాయణ మద్యం సిండికేట్ల పేరుతో దోచుకున్నారని విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దాంతో ఈసారి సత్తిబాబుకు ఓటు ద్వారా తగిన బుద్ధి చెబుతామని చెబుతున్నారు. -
సత్తిబాబుకు మా సెడ్డ కట్టమొచ్చింది
పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్తిబాబుకు మా సెడ్డ కట్టమొచ్చింది. చీపురు పల్లి నుంచి పోటీ చేయాలో లేక ఇజీనారం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలో అర్థం కాక ఆయన తన జుట్టుతో పాటు తన అనుచరుల జుట్టుకూడా పీకుతున్నారట. మొన్నటిదాకా చీపురు పల్లి కాపోతే ఎస్.కోటకు వెళ్దారి అనుకున్న సత్తిబాబుకు రెండు చోట్లా ఓటమి ఖాయమని క్లారిటీ వచ్చిందట. ఓడిపోయేదేదో లోక్ సభ స్థానం నుంచి ఓడిపోతే ...ఆనక సింపతీతో రాజ్యసభ సీటు ట్రై చేసుకోవచ్చునని బొత్స గడుసుగా ఆలోచిస్తున్నారట. వాస్తవానికి రాష్ట్ర విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సీమాంధ్రలో అమాంతంగా పడిపోయిన కాంగ్రెస్ గ్రాఫ్‌తో పాటు తాను ప్రాతనిధ్యం వహిస్తున్న చీపురుపల్లిలో కూడా తన ప్రాభవం తగ్గిపోవడంతో ప్లేస్ మార్చాలని అప్పట్లోనే బొత్స నిర్ణయించారు. జిల్లా అంతా వెదికి చివరకు ఎస్ కోట నుంచి పోటీ చేయాలని భావించి.. ఆ మేరకు అక్కడో పెద్ద కర్చీఫ్ వేశారు. అయితే ఈ నియోజకవర్గంలో మేజర్ కమ్యూనిటీ వెలమ సామాజిక వర్గం బొత్స వైఖరిపై ఉన్న అసంతృప్తితో ఎన్నికల్లో సహకరించరన్న సమచారాంతో బొత్స తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. తిరిగి చీపురుపల్లి నుంచే బరిలో దిగాలని భావించారు. ఆరు నూరైనా తాను చీపురుపల్లి నుంచే పోటీ చేస్తానని.... ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు తానే స్వయంగా వెళ్లి సమాధానం చెప్తానని కార్యకర్తలతో సెలవిచ్చారు. తాను వ్యక్తిగతంగా సమైక్యవాదినేనని పీసీసీ మాజీ అయిన తర్వాత జిల్లాకు వచ్చిన తొలి సమావేశంలో గోడు వెళ్లబోసుకున్నారట. దీంతో బొత్స మూడోస్సారీ చీపురుపల్లి బరిలో ఖాయమని అంతా అనుకున్నారు. అయితే ఈ సమావేశం జరిగిన మరుసటి రోజే బొత్సకు కోలుకోలేని షాక్ తగిలింది. తన ప్రధాన అనుచరుడు జెడ్పీ మాజీ ఛైర్ పర్సన్ బెల్లాన చంద్రశేఖర్ వైఎస్సార్సీపీలో చేరడంతో పాటు సుమారు 40 మంది సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు వైఎస్సార్సీపీలో చేరడంతో బొత్స మరోసారి పునారాలోచనలో పడ్డారట. మరోసారి తన అనుచరులతో సమావేశమై తాను విజయనగరం పార్లమెంటుకు, ఝాన్సీ చీపురుపల్లి అసెంబ్లీకి బరిలో దిగితే ఎలా ఉంటుందని అభిప్రాయసేకరణ చేస్తున్నారట. బొత్స ఒకవేళ ఎంపీగా పోటీ చేస్తే.... జిల్లా తెలుగుదేశం పార్టీలో కూడా అనూహ్య పరిణామాలు తప్పవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి బొత్స ఎన్నడూ పూసపాటి వంశీయులైన అశోక్ గజపతిరాజు కుటుంబంపై నేరుగా పోటీ చేసిన సందర్భాలు లేవు. ఈ నేపధ్యంలో టిడిపి ఇప్పటికే అశోక్ ను టిడిపి విజయనగరం ఎంపీగా ఆయనకు ఇష్టం లేకపోయినా ప్రకటించిన పరిస్ధితుల్లో ఆయన తిరిగి అసెంబ్లీకి రావడం ఖాయమని అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్, టిడిపిల మధ్య అవగాహనేనని చెప్పుకుంటున్నారు. ఇందులో భాగంగా అసెంబ్లీకి అశోక్ గజపతికి, పార్లమెంటుకు సత్తిబాబుకు ఓటు వేసేలా గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తిరిగి సత్తిబాబు తెరపైకి తీసుకువస్తారని అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కష్టమని బొత్సకు క్లారిటీ ఉందట. అలాగని ఎంపీగా గెలిచేస్తారని కాదు. ఒకవేళ కాలం కలిసిరాక తాను ఎంపీగా ఓడినా... సానుభూతితో కాంగ్రెస్ అధిష్టానం తనకు రాజ్యసభ టిక్కెట్టైనా ఇస్తుందని ఆశతో ఉన్నారట సత్తిబాబు. ఇందులో భాగంగానే బొత్స అసెంబ్లీ నుంచి పార్లమెంటుకు రూటు మార్చినట్లు కాంగ్రెస్ శ్రేణులు సమాచారం. -
గ్యాస్ కనెక్షన్ వచ్చిందంటూ మోసం
పిఠాపురం, న్యూస్‌లైన్ : కొత్తపల్లి మండలం వాకతిప్పలో మంగళవారం సాయంత్రం ఓ కారులో వచ్చిన ముగ్గురు అగంతకులు గ్యాస్ కనెక్షన్లు వచ్చాయంటూ స్థానికులను నమ్మించి డబ్బు, బంగారంతో ఉడాయించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం వాకతిప్పకు చెందిన పి.దుర్గ సెల్‌కు ఫోన్ చేసి ‘మీకు గ్యాస్ కనెక్షన్ వచ్చింది.. వెంటనే డబ్బుకట్టి తీసుకుంటే బహుమతులు కూడా ఉన్నాయ’ని నమ్మబలికి కారులో ఆమె ఇంటికి వెళ్లారు. రూ.8 వేలు చెల్లిస్తే కనెక్షన్‌తో పాటు మిక్సర్ కమ్ గ్రైండర్ ఉచితంగా ఇస్తామని చెప్పడంతో ఆమె రూ.8వేలు తెచ్చి వారికిచ్చింది. ఇంకా ఎవరికైనా కనెక్షన్ కావాలంటే ఇస్తామని వారు చెప్పారు. తన అత్తగారికి గ్యాస్ కనెక్షన్ కావాలని, తన పుస్తెలతాడు తాకట్టు పెట్టి డబ్బు తెస్తానని చెప్పి బయటకు వెళ్లింది. ఎవరూ డబ్బు ఇవ్వకపోవడంతో వచ్చేసింది. ‘ఆ పుస్తెలతాడు ఇచ్చి మీ భర్తను మాతో పంపితే పిఠాపురంలో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటాం. గ్యాస్ కనెక్షన్, బహుమతులు ఇచ్చి పంపిస్తామ’ని నమ్మించారు. బంగారు తాడును భర్త సత్తిబాబుకు ఇచ్చి వారి కూడా పంపించింది. కొంత దూరం వెళ్లాక కారులో చోటు సరిపోవడం లేదని, ఆటోలో రావాలంటూ సత్తిబాబుకు రూ.100 ఇచ్చి దింపేశారు. తాము ముందువెళ్లి పుస్తెలతాడు తాకట్టు పెడతామని నమ్మి ంచారు. పిఠాపురం వెళ్లిన సత్తిబాబుకు అక్కడ ఎవ్వరూ కనిపించకపోవడంతో మోసపోయామని గుర్తించిన సత్తిబాబు లబోదిబోమంటూ కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాగే నెల కిందట మూలపేటలో 10 మంది వద్ద నుంచి కొందరు రూ.60 వేలు దండుకుని ఉడాయించారని చెబుతున్నారు. -
విద్యుత్ తీగ తెగిపడి చెరకు తోట దగ్ధం
మురమండ (కడియం), న్యూస్‌లైన్ : చెరకు తోటపై విద్యుత్ తీగ తెగిపడ్డ సంఘటనలో సుమారు రూ.మూడు లక్షల నష్టం వాటిల్లింది. స్థానిక కల్యాణ మండపం సమీపంలోని పుంత రోడ్డులో మంగళవారం ఈ సంఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఈ ప్రమాదంలో గారపాటి సత్తిబాబుకు చెందిన సుమారు ఐదెకరాల చెరకు తోట పూర్తిగా కాలిపోయింది. తెగిపడిన తీగ మిగిలిన వాటిని తాకుతూ కిందపడింది. దీంతో రెండు స్తంభాల మధ్యనున్న తీగల వెంబడి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లో తోటంతా మంటలు వ్యాపించాయి. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తీగలు తెగిపడుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రమాద సమయంలో సమీపంలోనే చెరకు తోటలు కొట్టే కూలీలు ఉన్నారు. వారు కొంతమేర చెరకును నరికివేయడంతో మంటలు పక్కనున్న తోటలకు వ్యాపించలేదు. చేతికొచ్చిన తోట ఇలా కాలిపోవడంతో రైతు సత్తిబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. దిగుబడులు అంతంత మాత్రంగా ఉన్నాయని, ప్రమాదం కారణంగా కనీసం పెట్టుబడి కూడా రాదని చెప్పాడు. మండపేటకు చెందిన అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, మంటలను అదుపుచేశారు.