నిజంగా... ఇది డబుల్ ధమాకా!
‘‘రెండున్నర గంటల పాటు ప్రేక్షకులు హాయిగా నవ్వుకునే సినిమా ఇది. మొత్తం 72 సన్నివేశాల్లోనూ కావాల్సినంత కామెడీ ఉంది’’ అని దర్శకుడు ఇ. సత్తిబాబు చెప్పారు. అల్లరి నరేశ్ ద్విపాత్రాభినయంలో అంబికా రాజా నిర్మించిన చిత్రం ‘జంప్ జిలానీ’. అంబికా కృష్ణ సమర్పణలో వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్-రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఇ. సత్తిబాబు దర్శకుడు. అంబికా రామచంద్రరావు నిర్మాణ నిర్వాహకుడు. ఈ 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం సత్తిబాబు పాత్రికేయులతో మాట్లాడుతూ -‘‘తాతల కాలం నాటి హోటల్‌ని కాపాడుకోవాలనుకునే ఓ మనవడు, ఆ హోటల్‌ని అమ్మేసి వేరే ఏదైనా వ్యాపారం చేసుకోవాలని తపన పడే మరో మనవడి నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది.
ఈ రెండు పాత్రలనూ అల్లరి నరేశే చేశారు. మామూలుగా ఒక్క నరేశ్ ఉంటేనే కడుపుబ్బా నవ్వుకుంటాం. ఇక, ఇద్దరు నరేశ్‌లంటే డబుల్ ధమాకానే. ద్విపాత్రాభినయం నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో రెండు పాత్రలూ తెరపై కనిపించే సన్నివేశాలు తక్కువ ఉంటాయి. కానీ, ఈ సినిమాలో దాదాపు పాతిక సన్నివేశాల్లో ఇద్దరు నరేశ్‌లూ కనిపిస్తారు. మూడు పాటల్లో కూడా ఈ రెండు పాత్రలూ కనిపిస్తాయి. పంచ్ డైలాగ్‌లతో సినిమా పసందుగా ఉంటుంది. నా ‘యముడికి మొగుడు’ సినిమాకి మంచి సంభాషణలు ఇచ్చిన క్రాంతిరెడ్డి సకినాల ఈ చిత్రానికి కూడా మంచి డైలాగులు రాశాడు. పాత్రలు విసిరే పంచ్ డైలాగ్‌లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. మరో హైలైట్ పోసాని పాత్ర. ఒక పాటకు పోసాని స్టెప్స్ కూడా వేశారు. తమిళ చిత్రం ‘కలగలప్పు’ ఆధారంగా తీసిన సినిమా అయినప్పటికీ, మాతృకకు చాలా మార్పులు చేశాం’’ అని చెప్పారు.