
అచ్చం 'బాహుబలి'లో లాగే..
చింతపల్లి: నాలుగు రోజుల నుంచి కుమార్తెకు తీవ్ర జ్వరం.. చికిత్స చేయించాలంటే కాలువ దాటాల్సిందే.. కానీ ఆ కాలువ ఇటీవలి వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎలాగైనా తన ఏడాది కుమార్తెను కాపాడుకునేందుకు ఆ కాలువను సైతం ఎదిరించడానికి సిద్ధపడ్డాడు ఓ తండ్రి. సరిగ్గా బాహుబలి సినిమాలో పసికందును చేతితో పైకెత్తి ప్రవాహానికి ఎదురునిలిచిన రమ్యకృష్ణను గుర్తుకు తెచ్చే ఈ ఘటన విశాఖ జిల్లా చింతపల్లి మండలం కుడుముసారిలో మంగళవారం చోటు చేసుకుంది. కుడుముసారి గ్రామానికి చెందిన పాంగి సత్తిబాబు ఏడాది కుమార్తెకు నాలుగు రోజులైనా జ్వరం తగ్గకపోగా తీవ్రమైంది.
చిన్నారిని చికిత్స కోసం తీసుకెళ్దామంటే వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కుడుమసారి కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. బంధువులంతా వద్దన్నా కుమార్తెకు వైద్యం చేయించేందుకు కాలువ దాటడానికే సత్తిబాబు సిద్ధమయ్యాడు. పసికందును చేతుల పెకైత్తుకొని అతికష్టమ్మీద కాలువ దాటాడు. తర్వాత సుమారు 5 కిలోమీటర్ల మేర నడిచి మెయిన్‌రోడ్‌కు చేరుకొని లోతుగెడ్డ పీహెచ్‌సీకి తీసుకెళ్లాడు. చికిత్స అనంతరం చిన్నారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యుడు చెప్పడంతో సత్తిబాబు ఊపిరి పీల్చుకున్నాడు.