infant
-
USA: చిన్నారిని ఓవెన్‌కు బలి చేసుకుంది...
కాన్సాస్ సిటీ: నిద్ర పుచ్చేందుకు ఉయ్యాలలో ఉంచాల్సిన శిశువును పొరపాటున ఓవెన్లో పెట్టింది ఓ తల్లి. తప్పు గ్రహించేలోగానే ఆ శిశువు తీవ్రంగా కాలిన గాయాలతో తనువు చాలించింది. ఈ విషాద ఘటన అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం కాన్సాస్ సిటీలో చోటుచేసుకుంది. నగరానికి చెందిన మరియా థామస్ శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో తన శిశువును ఉయ్యాల తొట్టిలో పడుకోబెట్టి నిద్ర పుచ్చాలనుకుంది. అయితే, చిన్నారిని పొరపాటున ఓవెన్లో ఉంచి, ఆన్ చేసింది. తప్పు తెలుసుకునే సరికే చిన్నారి ఒళ్లు తీవ్రంగా కాలిపోయింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే శిశువు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
శిశువు రక్షణ అందరి బాధ్యత! కానీ ఇప్పటికీ..
పుట్టిన బిడ్డ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలని తల్లితో పాటు ఆ కుటుంబం కూడా తపిస్తుంటుంది. అయితే, ఈ విషయంలో సరైన అవగాహన ఉండటం లేదనేది వైద్యుల మాట. ఎందుకంటే, ఇప్పటికీ భారతదేశంలో నవజాత శిశు మరణాల రేటు ఆందోళనకరంగానే ఉంది. యూరప్‌లో 1990ల మొదట్లో శిశు మరణాల రేటును తగ్గించడానికి చర్యలు తీసుకోవడంలో, అవగాహన కల్పించేందుకు నవంబర్ 7ను శిశు రక్షణ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించాయి. ఆ తర్వాత అమెరికా, మిగతా దేశాలు కూడా ఈరోజు శిశు రక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. నవజాత శిశువులలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, శిశు మరణాల రేటును తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ విషయంలో నిపుణుల అభిప్రాయాలు తీసుకోవడం తప్పనిసరి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి ప్రెగ్నెన్సీ అని తెలియగానే కాబోయే తల్లితోపాటు, ఆ కటుంబం కూడా జాగ్రత్త పడాలి. మన దగ్గర రక్తహీనత సమస్య, పోషకాహార లేమి ఎక్కువ. దీనివల్ల బేబీ గ్రోత్ మందగిస్తుంది. గర్భిణుల్లో హైపో థైరాయిడ్ సమస్య ఎక్కువ చూస్తున్నాం. ఐరన్ లోపం, రసాయనాల ఆహారం తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంటుంది. తల్లి ఆరోగ్యం సరిగాలేకపోతే లోపల బేబీ శరీర, మానసిక ఎదుగుదలపైన ప్రభావం చూపుతుంది. బీపీ, షుగర్.. వంటి సమస్యలు ఉన్నప్పుడు వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేవారు ముందునుంచే వైద్యులు చెప్పిన టైమ్‌కి వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. తల్లి మానసిక ఆరోగ్యం కూడా బాగుండాలి. అందుకు, సైకలాజికల్ కౌన్సెలింగ్ కూడా తీసుకోవడం ముఖ్యం. వైద్యులు చెప్పిన సూచనలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే కుటుంబం అంతా భవిష్యత్తులో రాబోయే సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. – డాక్టర్ శిరీషా రెడ్డి, గైనకాలజిస్ట్, తార్నాక, హైదరాబాద్ ప్రమాదాలను ముందే పసిగట్టాలి నెలలు నిండకుండా పుట్టడం, బరువు తక్కువుండి పుట్టడం, ఇన్ఫెక్షన్స్, పోషకాహార లోపం వల్ల శిశు మరణాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. ఏడాదిలోపు పిల్లలను నవజాత శిశువులు అంటారు. ఈ సమయంలో సులువుగా ఇన్ఫెక్షన్స్ సోకుతుంటాయి. అందుకే, వీరిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. ఏడాదిలోపు వచ్చే ఆరోగ్య సమస్యలను నివారించగలిగితే ఆ తర్వాత వచ్చే సమస్యలను సులువుగా అధిగమించవచ్చు. మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే పట్టడం అవసరం, ఆరోగ్యం కూడా. ఆ తర్వాత వారికి ఇచ్చే పోషకాహారం చాలా ముఖ్యం. దీంతోపాటు వ్యాక్సినేషన్ చేయించడం ముఖ్యం. ఎందుకంటే, నిమోనియా, డయేరియా వల్ల మరణాలు ఎక్కువ. అందుకే, ప్రభుత్వం కూడా డయేరియా, న్యూమోనియా.. వ్యాక్సినేషన్ జాబితాలో చేర్చింది. పిల్లల వైద్యనిపుణుల పర్యవేక్షణ చాలా అవసరం. కొన్ని గ్రామీణ ప్రాంతాల వారికి ఈ సౌకర్యం అందుబాటులో లేకపోవచ్చు. కానీ, రెగ్యులర్ హెల్త్ చెకప్ అనేది ముఖ్యం అని తెలుసుకోవాలి. ఇక నవజాత శిశువులకు దెబ్బలు తగిలే అవకాశం కూడా ఉంది. మంచంపై నుంచి కింద పడటం వంటివి. చిన్న దెబ్బలు కూడా పెద్దవి కావచ్చు. మదర్ పోస్ట్ ప్యాటర్న్ డిప్రెషన్లో ఉన్నప్పుడు బిడ్డను చూసుకునేవారుండరు. ఇలాంటప్పుడు కూడా శిశువు సంరక్షణ ప్రమాదంలో పడుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కుటుంబం జాగ్రత్త వహించాలి. – ప్రియాంకరెడ్డి, పిడియాట్రిషియన్, మాదాపూర్, హైదరాబాద్ ఒకరి ద్వారా మరొకరికి సూచనలు మేం గర్భిణులపై ఎక్కువ ఫోకస్ పెడుతుంటాం. ఎందుకంటే, వారి ఆరోగ్యం బాగుంటేనే పుట్టబోయే బిడ్డ బాగుంటుంది. ఆరోగ్యం, పౌష్టికాహారంతో పాటు ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్లేవరకు ఎలా చూసుకోవాలో ఆమెకే కాదు, ఇంటిల్లిపాదికీ కౌన్సెలింగ్ ఇస్తాం. ఎంత చెప్పినా వినిపించుకోని వారు కొందరుంటారు. అయినా వారిని వదలకుండా తల్లి అయిన వారితో కౌన్సెలింగ్ ఇప్పిస్తాం. చార్ట్ ప్రకారం వాళ్లు తీసుకోవాల్సిన పోషకాహారం, మందులు కూడా అంగన్వాడీ నుంచి ఇస్తుంటాం. చంటిపిల్లల విషయంలో మేం తగు జాగ్రత్తలు చెప్పడంతో పాటు, ఏ సమయానికి వ్యాక్సిన్లు వేయించాలి, ఎలా చూసుకోవాలి అనే విషయాలపైన తల్లులకు ఒకరి ద్వారా మరొకరు సూచనలు చేసుకునేలా కౌన్సెలింగ్ చేస్తుంటాం. దీనివల్ల నవజాత శిశు మరణాల రేటు తగ్గడమే కాకుండా శిశువులు ఆరోగ్యంగా పెరిగేందుకు దోహదం చేస్తుంది. – వెంకటరమణ, అంగన్వాడీ టీచర్, ఖాసింపేట, సూర్యపేట జిల్లా (చదవండి: మత్తు కోసం పాము విషమా?..అందుకోసం పార్టీల్లో..) -
అక్కడ శిశువులు ఎలా చనిపోతున్నారనేది?..అంతుపట్టని మిస్టరీ!
ఆ ఊరిలోని కుటుంబాలు పిల్లల్ని కనడానికే భయపడతున్నారు. అక్కడ శిశువులంతా కేవలం పుట్టిన మూడు నెలలకే చనిపోవడం. చనిపోయిన శిశువులంతా సడెన్‌గా కాళ్లు చేతులు వెనక్కి వాలేసి.. గుక్కపెట్టి ఏడ్చి చనిపోతున్నారు. శిశువుల మరణాలన్నీ ఒకే తీరు. పోనీ ధైర్యం చేసి వేరే ఊరు వెళ్లి పురుడు పోసుకుని వచ్చినా.. అదే పరిస్థితి. అక్కడ ప్రజలకు బిడ్డలను కనే యోగం లేదో మరేదైనా కారణం ఉందా!.. అనేది వైద్యులకు సైతం అంతుపట్టకపోవడం ఆశ్చర్యాన్ని రేకెత్తించే అంశం. అసలేం జరిగిందంటే..రెండేళ్ల కిందట 2021 ఆగస్ట్ నెలలో అశోక్, మత్స్యమ్మ దంపతులకు పుట్టిన మొదటి బిడ్డకు రెండు నిండి, మూడో నెల నడుస్తున్న సమయంలో...ఒక రోజు తల్లి మత్స్యమ్మ పాలు ఇచ్చిన కాసేపటికే పిడికిలి బిగిపెట్టి ఏడుస్తూ ప్రాణాలు వదిలేసింది ఆ శిశువు. పిల్లలకు ఏ పేర్లు పెట్టాలా అని అశోక్, మత్స్యమ్మల కుటుంబాల్లో చర్చలు జరుగుతున్న సమయానికే పిల్లల ప్రాణాలు పోయాయి. మత్స్యమ్మ, అశోక్ ఇంట్లో జరిగినట్లుగానే ఆ రూఢకోట గ్రామంలోని అన్ని కుటుంబాల్లోనూ ఇలాంటి విషాదాలే చోటు చేసుకున్నాయి. గత మూడేళ్లలో 20 మంది శిశువులు మరణించారు. వారి మరణాలకు కారణమేంటో తెలుసుకునేందుకు వైద్య బృందాలు పరిశోధనలు చేసినా నిర్దిష్టమైన కారణం ఇంతవరకు తెలియలేదు. చనిపోయిన చిన్నారులంతా మూడు నుంచి ఆరు నెలల లోపు వయసు వారే. మా చేతుల్లో చనిపోడానికే అయితే పిల్లల్ని కనడం ఎందుకు? మాకు పిల్లలు వద్దు, ఊరులో పరిస్థితులు బాగుపడితేనే పిల్లల్ని కంటాం. లేదంటే పిల్లలు వద్దు అని మూడు నెలల వయసున్న ఇద్దరు శిశువుల్ని పొగొట్టుకున్న బాలు, సంధ్యారాణి దంపతులు ఆవేదనగా చెబుతున్నారు. అశోక్, మత్స్యమ్మ దంపతులు కూడా ఇలాగే వాపోయారు. ఇప్పటికే ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్నాను. కారణాలేంటో తెలియడం లేదు. చనిపోయే క్షణం వరకు పిల్లలు ఆరోగ్యంగానే ఉంటున్నారు. మాతో చక్కగా ఆడుకున్నారు. కానీ ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఒక్కసారిగా పిడికిలి బిగబట్టి, తల వాల్చేసి క్షణాల్లో చనిపోతున్నారు. పీహెచ్ సీ కూడా పక్కనే ఉంది. కానీ అక్కడకు తీసుకెళ్లేంత సమయం కూడా దొరకడం లేదు. ఇంకేం చేయాలి?” అని సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి గర్భం దాల్చినా కూడా ఈ గ్రామంలో ఉండను. వేరే గ్రామానికి వెళ్లిపోయి, అక్కడే శిశువుకి జన్మనిచ్చి, కొంచెం పెద్దయ్యాకే గ్రామంలోకి అడుగు పెడదామనుకుంటున్నాను అని చెప్పారామె. పోనీ వేరే చోట పురుడు పోసుకున్నా.. రూఢకోటకు కోడలిగా వచ్చిన ఓ మహిళ గర్భం దాల్చగానే తన పుట్టినిల్లయిన హుకుంపేటకు వెళ్లిపోయారు. అక్కడే బిడ్డకు జన్మనిచ్చారు. అయితే, ఆ బిడ్డ కూడా మూడు నెలలకే ఈ ఏడాది మేలో మరణించాడు. ఈ విషయాన్ని రూఢకోట పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ నిర్థారించారు. రూఢకోటకు హుకుంపేటకు మధ్య దూరం 35 కిలోమీటర్లు. ఆరు నెలలు ఊరిలో ఎవరు గర్భం దాల్చలేదు! 2019 నుంచి 2022 మే వరకు 17 మంది శిశువులు మరణించారు. ఆ తర్వాత ఆరు నెలలు ఏ విధమైన మరణాలు సంభవించలేదు. మళ్లీ ఈ ఏడాది జనవరి, మే, ఆగస్ట్ నెలల్లో ముగ్గురు శిశువులు మరణించారు. ఇప్పటి వరకు 20 మంది శిశువులు రూఢకోట గ్రామంలో మరణించారని రూఢకోట పీహెచ్ సీ మెడికల్ ఆఫీసర్ సత్యారావు చెప్పారు. రూఢకోటలో గర్భం దాల్చిన మహిళలు గ్రామంలో ఉన్నా, బయటకు వెళ్లినా, ఇంటి దగ్గరే ప్రసవమైనా లేదా ఆసుపత్రిలో ప్రసవమైన వారిలోని కొందరు శిశువులు మరణిస్తున్నారు. కారణాలపై మాత్రం స్పష్టత రాలేదని డాక్టర్ సత్యారావు చెప్పారు. వరుసగా శిశువులు మరణిస్తుండటంతో ఆ ఊర్లో మహిళలు పిల్లలను కనేందుకు భయపడుతున్నారు. అందుకనే 2022 మే, జూన్ తర్వాత ఊరిలో ఎవరు గర్భం దాల్చలేదు. ఆరు నెలలు పాటు ఊరిలో ఎటువంటి మరణాలు సంభవించకపోవడంతో సంతోషపడ్డాం. కానీ మళ్లీ 2023 జనవరిలో ఒక శిశువు మరణిచడంతో మళ్లీ పిల్లల మరణాలు మొదలయ్యాయి. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని రూఢకోట ప్రజలు ఆవేదనగా చెబుతున్నారు. వైద్య బృందాలు అధ్యయనం చేయగా.. వైద్య బృందాలు అధ్యయనం చేసినప్పుడు.. ప్రసవాలన్నీ ఆసుపత్రుల్లోనే జరిగాయని గుర్తించారు. శిశువుల బరువు సాధారణ స్థాయిలో ఉంది. తల్లుల ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులూ లేవు. వీరిలో ఒక మహిళ డిప్లొమా వరకు చదివింది. ఈ గ్రామంలో 138 గృహాలు ఉండగా 247 మంది పురుషులు, 244 మంది మహిళలు. ఇక్కడ ఉన్నవారంతా చదువుకున్నవారే. గుర్తించిన అంశాలు.. శిశువుల మరణాలు అత్యధికంగా అర్ధరాత్రి పూట సంభవించాయి. తీవ్రస్థాయిలో ఏడుస్తూ.. వాంతులు చేసుకుంటూ 6 నుంచి 12 గంటల వ్యవధిలోనే ప్రాణాలు విడిచారు. శ్వాస పీల్చుకోవడంలో శిశువులు బాగా ఇబ్బందులు పడ్డారు. ఒక శిశువులో ఫిట్స్ లక్షణాలు కనిపించాయి. స్థానికులు తాగే మంచినీటి నాణ్యత కూడా బాగానే ఉంది. ఎందువల్ల శిశువులు చనిపోతున్నారనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరిలా మిగిలిపోయింది. (చదవండి: అత్యంత అరుదైన పాము! వీడియో వైరల్) -
ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్‌కు మించి సౌకర్యాలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా లేని అత్యాధునిక వైద్య సదుపాయాలను ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులోకి తెస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలోని మాతా శిశు విభాగంలో రూ.5.53 కోట్లతో ఏర్పాటు చేసిన నవజాత శిశు వైద్య విభాగాలు ఎస్ఎన్సీయూ(స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్), ఎన్ఐసీయూ (నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లను గురువారం మంత్రి ప్రారంభించారు. ప్రసూతి విభాగంలో ఇప్పటికే 250 పడకలు అందుబాటులో ఉండగా.. అదనంగా 40 పడకలను నవజాత శిశు వైద్యం కోసం అందుబాటులోకి తెచ్చినట్టు మంత్రి తెలిపారు. తక్కువ బరువు, కామెర్లు వంటి అనారోగ్య కారణాలతో అప్పుడే పుట్టిన శిశువులకు అత్యవసర విభాగ అవసరాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.5.53 కోట్లతో ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 61 ఎస్ఎన్సీయూలు, ఎన్ఐసీయూలు అందుబాటులో ఉన్నాయని, వాటికి అదనంగా రూ.31.51 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా మరో 12 అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇక్కడి ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణ పనులను సైతం త్వరలో ప్రారంభిస్తామని రజిని తెలిపారు. కాగా, రాజీవ్‌నగర్‌లోని ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, వైఎస్సార్ సీపీ తూర్పు ఇన్చార్జి దేవినేని అవినాశ్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ తదితరులు పాల్గొన్నారు. -
తల్లి పరీక్ష రాస్తుండగా.. శిశువును ఆడించిన కానిస్టేబుల్..
అహ్మదాబాద్: పరీక్షా కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ గొప్ప మనుసు చాటుకుంది. పరీక్ష రాయడానికి వచ్చిన ఓ అభ్యర్థి బిడ్డను సొంత కూతురిలా అక్కున చేర్చుకుంది. తల్లి పరీక్ష రాస్తుండగా.. శిశువును కానిస్టేబుల్ ఒడిలోకి తీసుకుని ఆడించింది. గుజరాత్‌లోని ఓదావ్‌లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఆ మహిళా కానిస్టేబుల్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు. గుజరాత్లో హైకోర్టు ప్యూన్ రిక్రూట్మెంట్ పరీక్ష ఆదివారం జరిగింది. వేల సంఖ్యలో అభ్యర్థులు ఉద్యోగం కోసం పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఓదావ్‌లో జరిగిన సెంటర్ వద్దకు ఓ అభ్యర్థి తన బిడ్డతో పరీక్ష కేంద్రానికి హజరైంది. శిశువును సెంటర్ బయట వదిలి లోపలికి వెళ్లింది తల్లి. ఇంతలో ఆ శిశువును ఏడుపు ఆరంభించింది. పరిస్థితిని గమనించిన మహిళా కానిస్టేబుల్ దయా బెన్ ఆ చంటిబిడ్డను ఒడిలోకి తీసుకుని లాలించింది. దీంతో ఆ మహిళా అభ్యర్థి సౌకర్యంగా పరీక్ష పూర్తి చేసింది. ఈ వీడియోను గుజరాత్ పోలీసులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా.. వైరల్‌గా మారింది. మహిళా కానిస్టేబుల్ దయా బెన్‌పై ప్రశంసలు కురిపించారు నెటిజన్లు. విధుల్లోనూ మాతృత్వాన్ని చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. దయా బెన్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఇదీ చదవండి: హరిద్వార్‌లో రాకాసి మేఘం.. చూస్తే..! -
షాకింగ్.. తల్లితో నిద్రిస్తున్న పసికందును ఈడ్చుకెళ్లిన వీధి కుక్క..
జైపూర్: హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటన మరువకముందే అలాంటి దారుణం మరొకటి వెలుగుచూసింది. రాజస్థాన్ సిరోహి జిల్లాలోని ఓ ఆస్పత్రిలో అమ్మపక్కన నిద్రిస్తున్న నెల రోజుల పసికందును వీధికుక్క ఈడ్చుకెళ్లింది. అనంతరం అతనిపై దాడి చేసింది. దీంతో తీవ్రగాయాలపాలై శిశువు చనిపోయాడు. హాస్పిటల్ వార్డు బయట మృతదేహం లభించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ రికార్డులను పరిశీలించారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వత రెండు వీధి కుక్కలు ఆస్పత్రిలోని టీబీ వార్డులోకి ప్రవేశించాయి. అనంతరం వీటిలో ఓ శునకం పసికందును బయటకు ఈడ్చుకెళ్లినట్లు అందులో రికార్డయింది. ఈ శిశువు తండ్రి టీబీ వార్డులో చికిత్స పొందుతున్నాడు. అతనితో పాటు భార్య, పిల్లలు కూడా ఇదే వార్డులో ఉన్నారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత అందరూ నిద్రపోయారు. అదే సమయంలో వీధికుక్క వార్డులోకి వచ్చి చిన్నారిని ఎత్తుకెళ్లింది. ఈ సమయంలో వార్డు సెక్యూరిటీ గార్డు కూడా అక్కడ లేరని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, శిశువు మృతదేహానికి పోస్టుమార్టం కూడా నిర్వహించామని పేర్కొన్నారు. మరోవైపు ఆస్పత్రి నిర్వాహకులు కూడా ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. రోగితో పాటు ఉన్న కుటంబసభ్యులు అందరూ నిద్రలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని, ఆ సమయంలో వార్డు గార్డు వేరే వార్డుకు వెళ్లాడని పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కాగా.. ఇటీవల హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో వీధికుక్కల దాడిలో ప్రదీప్ అనే బాలుడు మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో కక్కుల బెడద నివారణకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. చదవండి: ముంబైలోకి ప్రవేశించిన 'డేంజర్ మ్యాన్'.. చైనా, పాకిస్తాన్, హాంకాంగ్‌లో శిక్షణ.. పోలీసుల హై అలర్ట్.. -
చేతిలో చంటి బిడ్డతో ఆ ఎమ్మెల్యే! ఎందుకంటే..
సాక్షి, నాగ్‌పూర్: కొందరు పనిని దైవంలా భావిస్తున్నారు. ఏమీ ఆశించకుండా.. తమ వంతు ప్రయత్నం చేసుకుంటూ పోతారు. ఈ క్రమంలో వ్యక్తిగత జీవితాలను సైతం పక్కన పెడుతుంటారు. గతంలో ఇలాంటి సందర్భాలు అనేకం వెలుగు చూశాయి. తాజాగా.. ఓ మహిళా ఎమ్మెల్యే సైతం అలాంటి నిబద్ధతను కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించారు. చేతిలో రెండు నెలల చంటి బిడ్డతో సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైంది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సరోజ్ అహిరే. చంటి బిడ్డను బ్లాంకెట్‌లో చుట్టుకుని ఆమె అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఇది అతి చర్యగా అనుకుంటారని ఏమో.. ఆమె తన వివరణ సైతం ఇచ్చుకుంది. నేను ఇప్పుడు ఒక తల్లిని. కానీ, ఇంతకు ముందు నుంచే ప్రజల ప్రతినిధిని. గత రెండున్నరేళ్లుగా కరోనా వల్ల అసెంబ్లీ సెషన్ నాగ్‌పూర్‌లో నిర్వహించలేదు. ఇప్పుడు నిర్వహిస్తున్నారు. తల్లిని అయినప్పటికీ.. నా విధిని నేను నిర్వహించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు సమాధానాలు చెప్పాలి కదా అని వివరణ ఇచ్చారామె. దియోలాలి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన సరోజ్ అహిరే.. సెప్టెంబర్ 30వ తేదీన ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ఆమెకు పలువురు అభినందనలు తెలపడంతో పాటు.. బాధ్యతకు పెద్ద పీట వేస్తూ ఆమె చేసిన పనిని అభినందించారు కూడా. అందులో సీఎం ఏక్నాథ్ షిండే కూడా ఉన్నాడు. -
ప్రకాశం: పసికందును బలిగొన్న వానరం
సాక్షి, ప్రకాశం: జిల్లాలో శుక్రవారం ఘోరం జరిగింది. పసిబిడ్డను ఓ కోతి బలి తీసుకుంది. ఆరుబయట నిద్రపోతున్న ఓ చిన్నారిని ఈడ్చుకెళ్లి కిందపడేసింది వానరం. ఈ క్రమంలో తలకు తీవ్రగాయం కావడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. పెదచర్లోపల్లి మండలం మురుగుమ్మిలో ఈ ఘటన జరిగింది. రవీంద్ర-సుమతీ దంపతులు స్థానికంగా పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు. రెండు నెలల కిందటే బిడ్డకు జన్మనిచ్చింది సుమతీ. ఈ క్రమంలో ఎప్పటిలాగే.. పసికందును ఆరుబయట మంచం మీద పడుకోబెట్టి ఇంటి పనులు చేసుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ కోతి.. పసికందును మంచం మీద నుంచి ఈడ్చుకెళ్లింది. గట్టిగా కిందపడేయడం.. అదే సమయంలో అక్కడే ఉన్న వ్యవసాయ సామాగ్రి ఆ పసికందుపై పడడంతో అక్కడికక్కడే కన్నుమూసింది. అలికిడికి అక్కడికి వచ్చిన తల్లి.. రక్తపు మడుగులో ఉన్న బిడ్డను చూసి కన్నీరుమున్నీరు అయ్యింది. పసికందు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
Police Ramya: అమ్మా.. నీకు వందనం
ఆకలితో అలమటిస్తున్న పసికందుకు పాలిచ్చి రక్షించినందుకు పోలీసు అధికారిణిని హైకోర్టు న్యాయమూర్తితో సహా పలువురు అధికారులు ప్రశసించారు. ఈ ఘటన కోజికోడ్ చెవాయూర్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కోజికోడ్ చెవాయూర్ పోలీస్టేషన్లో సివిల్ పోలీస్ ఆఫీసర్‌గా ఎంఆర్ రమ్య విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం ఉదయం 22 ఏళ్ల మహిళ తన నవజాత శిశువు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. కుటుంబ కలహాల కారణంగా పసికందుని తల్లి వద్ద నుంచి ఎత్తుకెళ్లి ఉండవచ్చిన అనుమానించి.. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. పని నిమిత్తం బెంగుళూరు వెళ్లిన తండ్రితోనే ఆ పసికందు ఉండవచ్చనే అనుమానంతో వాయనాడ్ సరిహద్దులోని పోలీస్టేషన్లకు సమాచారం అందించారు. దీంతో సుల్తాన్బతేరి పోలీసులు సరిహద్దు వెంబడి వాహనాలను తనిఖీ చేస్తుండగా శిశువుతో ఉన్న తండ్రిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని వద్ద ఉన్న శిశువు ఆకలితో అలమటించి సొమ్మసిల్లింది. దీంతో పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఐతే బిడ్డ షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు వైద్యులు గుర్తించారు. ఆస్పత్రికి చేరు పోలీస్ అధికారి రమ్య తాను పాలిచ్చే తల్లినని చెప్పి వెంటనే ఆ పసిబిడ్డను అక్కున చేర్చుకుని పాలిచ్చారు. ఆ తర్వాత ఆ శిశువును తల్లి ఒడికి చేర్చారు. ఆ సమయంలో ఆమె చూపించిన ఉదార సేవకు ముగ్ధుడై హైకోర్టు న్యాయమూర్తి దేవన్ రామచంద్రన్ ఆమె చేసిన పనిని మెచ్చుకుంటూ పోలీసు ఉన్నతాధికారులకు లేఖ కూడా రాశారు. ఈ మేరకు పోలీస్ అధికారి రమ్యకు జడ్జి సర్టిఫికేట్‌ను పోలీస్ చీఫ్ అనిల్ అందించడమే ఆమె కుటుంబసభ్యులను పోలీసు ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించి ప్రశంసా పత్రంతో సత్కరించారు. అంతేకాదు ఆకలితో అలమటించిన పసికందు పట్ల సానుభూతితో రమ్య వ్యవహరించిన తీనే పోలీసు శాఖ ప్రతిష్టను పెంచిందని ఉన్నతాధికారులు అన్నారు. (చదవండి: చాక్లెట్ల దొంగతనం వైరల్ కావడంతో... విద్యార్థిని ఆత్మహత్య) -
10 నెలల చిన్నారికి అరుదైన వ్యాధి.. సాయం చేసి ఆదుకోరూ..
పైన ఫోటోలో కనిపిస్తున్న పాప పేరు హన్విక. ఆమె వయసు కేవలం 10 నెలలు. ఇంత చిన్న వయసులోనే పాప అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ప్రస్తుతం ఈ చిన్నారి డెంగ్యూ షాక్ సిండ్రోమ్, మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్తో పోరాడుతోంది. పసిపాప పరిస్థితి అత్యంత దీనస్థితికి చేరుకుంది. ఆ పాప తల్లిదండ్రులు దీప్తి, రవి కిరణ్ హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. కూతురు వైద్యం కోసం ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు చేశారు. అయినా పాప ఆరోగ్యం కుదుట పడకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తమ కూతురు తీవ్రమైన ఇన్ఫనైట్ డెంగ్యూ, హైపర్ ఫెరిటినిమా, ట్రాన్స్మినిట్స్, కోగులోపతితో బాధపడుతోందని, దాతలు తోచిన సాయం చేసి, ఆదుకోవాలని ఆమె తండ్రి రవి కిరణ్ అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం తనకు ఎలాంటి ఉద్యోగం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాప పేరు: ఆర్ హన్విక తండ్రి పేరు: రవి కిరణ్ తల్లి: దీప్తి గూగుల్ పే నంబర్: 8019872446 బ్యాంక్ అకౌంట్ వివరాలు అకౌంట్ నంబర్: 403901502892 బ్యాంక్ - ఐసీఐసీఐ, సేవింగ్స్ ఖాతా ఖాతాదారుని పేరు: ముసిలమ్మోళ్ల దీప్తి సాయి ఐఎఫ్ఎస్ఈ కోడ్: ICIC0000008 -
ప్రేమ పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి, ప్రాణాలతో బయటపడిన చిన్నారి
సాక్షి, మెదక్: వారిది ప్రేమ వివాహం. ఆనందంగా సాగుతున్న వారి కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. ప్రమాదంలో తల్లి చనిపోవడంతో, చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ సంఘటన కొల్చారం మండల కేంద్రంలోని మెదక్– నర్సాపూర్ జాతీయ రహదారిలో మంగళవారం జరిగింది. కొల్చారం ఏఎస్ఐ తారాసింగ్, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామానికి చెౌదిన చండూరి ప్రకాశ్ రెండో కూతురు మృతురాలు వంకిడి ప్రవల్లికకు(23) అదే మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన వంకిడి విజయ్ కుమార్‌తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగుంది. వీరిది ప్రేమ వివాహం. వీరికి 7 నెలల పాప అక్షిత సిందూర ఉంది. పాపకు సోమవారం రాత్రి నుంచి జ్వరంతో బాధపడుతోంది. భార్యాభర్తలిద్దరూ మెదక్ పట్టణంలోని ఆస్పత్రిలో వైద్యం చేయించేందుకు ధర్మసాగర్ నుంచి బైక్‌పై బయలుదేరారు. మండల కేంద్రం కొల్చారం లోని సత్యసాయి పారా బాయిల్డ్ వద్ద వీరు ప్రయాణిస్తున్న బైకును కొల్చారం గ్రామానికి చెందిన గుండు రామకృష్ణయ్య తన బైకుతో వెనుక నుంచి ఢీ కొట్టాడు. దీంతో ప్రవల్లిక, పాప ఎగిరి కింద పడ్డారు. ప్రవల్లిక తీవ్రంగా గాయపడగా, పాప అక్షిత స్వల్పంగా గాయపడింది. వారిని చికిత్స నిమిత్తం ప్రైవేటు వాహనంలో మెదక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రవల్లిక మృతి చెందింది. ఈ ప్రమాదంలో రామకృష్ణయ్యకు స్వల్పగాయాలయ్యాయి. రామకృష్ణయ్య అజాగ్రత్తగా బైకు నడపడంవల్లే ప్రమాదం జరిగిందని, మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. చదవండి: అసభ్యకర మెసేజ్‌లతో నటికి వేధింపులు.. సహజీవనం చేయాలని ఒత్తిడి -
710 గ్రాముల బరువుతో 27 వారాలకే చిన్నారి జననం.. 112 రోజులు ఎన్‌ఐసీయూలోనే
సాక్షి, హైదరాబాద్: ఏడు వరుస అబార్షన్ల తరువాత ఎనిమిదో సారి పుట్టిన పాప లోకాన్ని చూడగలిగింది. కానీ, కేవలం 710 గ్రాముల బరువు మాత్రమే ఉండడంతో పాటు 38 వారాలకు జరగాల్సిన ప్రసవం 27 వారాలకే జరగడం..పాప శరీరాకృతి పూర్తిగా లేకపోవడం వంటి పరిణామాలను సవాల్‌గా తీసుకున్న సనత్‌నగర్ ఈఎస్ఐసీ వైద్యులు ఆ చిన్నారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించారు. 112 రోజుల పాటు ఎన్ఐసీయూలో అత్యుత్తమ వైద్య సేవలందించి పునర్జన్మను ప్రసాదించారు. బుధవారం సనత్‌నగర్ ఈఎస్ఐసీ పీడియాట్రిక్స్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ కోదండపాణి, పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ జీవీఎస్ సుబ్రహ్మణ్యం అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ అపరాజిత డిసౌజా వివరాలు వెల్లడించారు. మేడ్చల్‌కు చెందిన వినోద్‌కుమార్ భార్య రూబీదేవి వరుసగా ఏడు సార్లు గర్భస్రావం కావడంతో పాటు ఎనిమిదోసారి గర్భం దాల్చిన తరువాత తీవ్రమైన గైనిక్ సమస్యలతో 18వ వారంలోనే ఆస్పత్రికి చేరింది. 27వ వారంలో పాపకు జన్మనిచ్చింది. అయితే పాప కేవలం 710 గ్రాములు మాత్రమే ఉండడంతో అవయవాలు పూర్తిగా ఆకారం దాల్చలేదు. దీంతో చిన్నారిని ఎన్ఐసీయూలో ఉంచి పీడియాట్రిక్స్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ కోదండపాణి, ప్రొఫెసర్ డాక్టర్ జీవీఎస్ సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో చికిత్స అందించారు. పాపను 112 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడి బరువును 1.95 కిలోలకు తీసుకువచ్చి ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దారు. సనత్‌నగర్ ఈఎస్ఐసీ వైద్యులు తమ పాప ప్రాణాలను నిలిపేందుకు చేసిన కృషిని తాము దగ్గరుండి చూశామని, వారి రుణం తీర్చుకోలేదని పాప తల్లిదండ్రులు వినోద్‌కుమార్, రూబీదేవి పేర్కొన్నారు. బుధవారం డిశ్చార్జి అవుతున్న సందర్భంగా పాప తల్లిదండ్రులు వైద్య సేవలందించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పైసా ఖర్చు లేకుండా ఈఎస్ఐసీలో అత్యుత్తమ వైద్యం అందించారన్నారు. -
Baby Massage: ఆవనూనె.. లేదంటే వెన్న, మీగడతో మసాజ్ చేస్తే..
Winter Care Tips In Telugu: Massage For Babies Helpful: శీతాకాలం ప్రతిఒక్కరికీ పరీక్ష పెడుతుంది. ఏడాదిలోపు చంటిపిల్లలను సంరక్షించడం అంటే తల్లికి చిన్న పరీక్ష కాదు. అనుక్షణం బిడ్డ ధ్యాసలోనే గడపాల్సి ఉంటుంది. పాపాయికి తినిపించే ఆహారం నుంచి స్నానం చేయించడం, దుస్తులు, ఒంటికి నూనెలు పట్టించి మసాజ్ చేయడం ప్రతిదీ అత్యంత జాగ్రత్తగా చేయాలి. ముఖ్యంగా మసాజ్ చేసేటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు పాటించి తీరాలి. ►శీతాకాలంలో మసాజ్‌కు ఆవనూనె అయితే మంచిది. ఇది ఒంటికి సహజంగా వేడినివ్వడంతోపాటు ర్యాష్ వంటి చర్మ సమస్యలను దూరంగా ఉంచుతుంది. ఒకవేళ న్యాపీ ర్యాష్ వంటి సమస్యలు ఉన్నా కూడా తగ్గిస్తుంది. ఆవనూనె సాధ్యం కానప్పుడు వెన్న, మీగడలతో మసాజ్ చేయవచ్చు. ఇవి అన్ని కాలాల్లోనూ వాడదగినవే. ►మసాజ్ కోసం బిడ్డను చేతుల్లోకి తీసుకునే ముందు తల్లి తన చేతులను వేడి నీటితో కడుక్కోవాలి. ఈ కాలంలో చేతులు చల్లగా ఉంటాయి. చల్లటి చేయి ఒంటికి తగలగానే పాపాయి భయంతో ఉలిక్కిపడుతుంది. అందుకే ఈ జాగ్రత్త. ►మసాజ్‌కు వాడే నూనెను చిన్న స్టీలు గిన్నెలో తీసుకుని గోరువెచ్చగా చేసిన తర్వాతనే పాపాయి ఒంటికి పట్టించాలి. వేడి చేయడం వీలుకాకపోతే నూనెను రెండు చేతుల్లో వేసుకుని రుద్దుకుంటే చల్లదనం తగ్గుతుంది. పాపాయి చర్మానికి సౌకర్యంగా ఉంటుంది. గదిని వెచ్చబరచాలి.. ►నూనె పట్ల తీసుకునే జాగ్రత్తలతోపాటు మసాజ్ చేయడానికి ముందు దుస్తులు తొలగించడంలోనూ జాగ్రత్త తీసుకోవాలి. వేసవిలో చేసినట్లు ఒకేసారి దుస్తులన్నీ తీసేయరాదు. ముందు సాక్స్, ప్యాంటు తీసి కాళ్లకు మసాజ్ చేయాలి. అప్పుడు కాళ్ల మీద మందపాటి టవల్ కప్పి ఆ తర్వాత చేతులకున్న మిటెన్స్, స్కార్ఫ్, చొక్కా తీసి పై భాగానికి మసాజ్ చేయాలి. ►వీటన్నింటికంటే ముందు గదిని వెచ్చబరచాలి. రూమ్ హీటర్లు అందుబాటు ధరల్లోనే దొరుకుతున్నాయి. కాబట్టి చంటిబిడ్డ ఉన్న ఇంట్లో రూమ్ హీటర్ తప్పకుండా ఉండాలి. మసాజ్ మొదలు పెట్టడానికి పది నిమిషాల ముందు రూమ్ హీటర్ ఆన్ చేయాలి. హీటర్ నుంచి వచ్చే గాలిని నేరుగా పాపాయికి తగలనివ్వకూడదు. హీటర్ సాధ్యం కానప్పుడు సాంబ్రాణి పొగ లేదా ధూప్ స్టిక్‌తో గదిని వెచ్చబరచవచ్చు. నిజానికి జలుబుకు కారణం మసాజ్ కాదు ►సాధారణంగా చేసే పొరపాటు ఏమిటంటే... పక్క దుస్తులకు నూనె జిడ్డు అంటకుండా ఉండడానికి మసాజ్ చేసేటప్పుడు పాపాయిని ప్లాస్టిక్ షీట్ మీద పడుకోబెడుతుంటారు. ఈ సీజన్లో మాత్రం ఆ పని చేయనే చేయకూడదు. ప్లాస్టిక్ షీట్ చల్లగా ఉంటుంది. పాపాయికి జలుబు చేసే ప్రమాదం ఉంది. అందుకే పాతబడిన దుప్పటిని హీటర్ ముందు పెట్టి గోరువెచ్చగా చేసిన తర్వాత పాపాయిని పడుకోబెట్టాలి. ►పాపాయి చర్మ సంరక్షణకు, కండరాల వ్యాయామానికి మసాజ్‌ను మించిన ఔషధం మరొకటి ఉండదు. కాబట్టి శీతాకాలంలో కూడా చక్కగా మసాజ్ చేయవచ్చు. ఈ కాలంలో మసాజ్ చేస్తే జలుబు చేస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. పైన చెప్పుకున్న జాగ్రత్తలు పాటించకుండా వేసవిలో మసాజ్ చేసినట్లే పాపాయిని దుస్తులు లేకుండా ఎక్కువ సేపు చలిగాలికి ఉంచినప్పుడు జలుబు చేస్తుంది. ఈ జలుబుకి కారణం మసాజ్ కాదు. తగిన జాగ్రత్తలు పాటించకపోవడమే. -
అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన పసిబిడ్డ రైలు పట్టాలపై..
సాక్షి, విజయనగరం/ఒడిశా: అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన ఆ పసిబిడ్డ రైలు పట్టాలపై అచేతనంగా పడి ఉన్నాడు. ఏ తల్లి కన్నబిడ్డో... ఆ తల్లిదండ్రులకు ఏం కష్టం వచ్చిందోగాని ఇలా పట్టాలపై పడేశారు. ఈ ఘటన చూపరులను కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. రైలు పట్టాలపై రెండు నెలల పసికందు మృతదేహం ఆదివారం లభ్యమైంది. దీనికి సంబంధించి రైల్వే జీఆర్పీ పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. కంట కాపల్లి – కొత్త వలస రైల్వేస్టేషన్ల మధ్య రైలు పట్టాలపై రెండు నెలల మగ పసికందు మృతదేహాన్ని రైల్వే పోలీసులు ఆదివారం గుర్తించారు. బిడ్డ శరీరంపై లేత నీలిరంగు టీషర్ట్ ధరించి ఉంది. గుర్తు తెలియని రైల్లోంచి జారి పడిపోయిందా? లేక ఎవరైనా తెచ్చి పడేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని జీఆర్పీ ఎస్ఐ రవివర్మ తెలిపారు. పసికందు ఆచూకీ తెలిసిన వారు విజయనగరం రైల్వే జీఆర్పీ పోలీసుల నుగానీ 9490617089, 9666555214 నంబర్లకు సంప్రదించాలన్నారు. మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రి మార్చురీకి తరలించినట్టు తెలిపారు. రైలు పట్టాలపై గుర్తు తెలియని పసికందు మృతదేహం -
తల్లికి పాజిటివ్ ఉన్నా.. శిశువుకు పాలు ఇవ్వొచ్చా?
సాక్షి, మహబూబ్‌నగర్: ‘కరోనా పాజిటివ్ వచ్చిన తల్లి.. శిశువుకు పాలు ఇవ్వొచ్చు. కాకపోతే పాలు ఇచ్చే సమయంలో తల్లి రెండు మాస్కులు ధరించాలి.’ కేవలం పాలు ఇచ్చే సమయంలో మాత్రమే శిశువును దగ్గరకు తీసుకోవాలి, ఇతర ఆలనాపాలన మాత్రం నెగిటివ్ ఉన్న మహిళతో చేయించాలి. శిశువుకు లక్షణాలు ఉంటే కావాల్సిన మందులు వాడాలి. పరీక్షలు మాత్రం చేయించాల్సిన అవసరం లేదు. చిన్నారులకు మాస్కు పెట్టలేం కనుక అధిక లక్షణాలతో పాజిటివ్ ఉండే తల్లులు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. తరచూ శిశువు పట్టుకోకుండా పాలు ఇచ్చే సమయంలో కాకుండా ఇతర సమయాల్లో కొంత దూరం ఉండడం ఉత్తమం.’ అని ప్రముఖ చిన్న పిల్లల డాక్టర్ రాఘవేంద్రకుమార్ తెలిపారు. శనివారం సాక్షి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఆయన పలువురు కాలర్స్ అడిగిన సందేహాలను నివృత్తి చేయడంతో పలు సలహాలు, సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్‌లో 3 నుంచి 4శాతం చిన్నారులు అధికంగా కరోనా బారినపడుతున్నారు. కాకపోతే ఎవరూ కూడా తీవ్ర సమస్యలకు గురికాకుండా స్వల్ప లక్షణాలతో రికవరీ అవుతున్నారు. సెకండ్ వేవ్‌లో వందలో పదిశాతం చిన్నారులు కరోనా లక్షణాలతో ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఇందులో ప్రధానంగా జ్వరం, దగ్గు, విరేచనాలు వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం చిన్నారులలో ఎవరిలో కూడా ఆయాసం కన్పించడం లేదు. పిల్లలకు ఒకటి లేదా రెండు రోజుల పాటు జ్వరం వస్తుంటే పారాసిటమాల్ ప్రతి ఆరు గంటలకు ఓసారి వేయాలి. మల్టీవిటమిన్, కొద్దిగా లక్షణాలు అధికంగా యాంటీబయోటిక్స్ వాడాలి. తల్లిదండ్రులకు పాజిటివ్ వచ్చి పిల్లలకు ఆ రోజు నెగిటివ్ వస్తే నిర్లక్ష్యం చేయవద్దు. మళ్లీ రెండు రోజుల తర్వాత వారిలో లక్షణాలు బయటపడుతాయి. వారిలో ఉండే టీకా, రోగనిరోధక శక్తివల్ల లక్షణాలు బయటపడటానికి కొంత సమయం పడుతుంది. 24గంటల నుంచి 48 గంటల పాటు పారాసిటమాల్ వేసిన కూడా జ్వరం తగ్గకపోతే అప్పుడు కరోనా పరీక్షలకు వెళ్లాలి.’ అని పేర్కొన్నారు. ప్రశ్న: మా తల్లిదండ్రులతో పాటు నాకు పాజిటివ్ వచ్చింది. నాకు చిన్నారి ఉంది. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డాక్టర్: మీ పాపను కొంత దూరంగా పెట్టండి. ఏదైనా అత్యవసరం ఉండి, పాలు ఇవ్వాల్సిన సమయంలో చేతులకు గ్లౌజ్, రెండు మాస్కులు పెట్టుకొని శిశువును పట్టుకోవాలి. పాపకు ఏదైనా లక్షణాలు కనిపిస్తే మందులు వాడండి. ప్రశ్న: మా పాపకు 8 ఏళ్లు నా తల్లిదండ్రులతో ఉంటుంది. ఇటీవల వారికి కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ పాపకు నెగిటివ్ ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాపకు మళ్లీ పరీక్ష చేయించాలా? డాక్టర్: పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు పాపను కొంత దూరం పెట్టండి. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి లక్షణాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటే మళ్లీ పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. జ్వరం ఉంటే పారాసిటమాల్ వాడండి. ప్రశ్న: మా ఇంట్లో నలుగురం ఉంటే మా చిన్న బాబుకు తప్పా అందరికీ పాజిటివ్ వచ్చింది. మాతో పాటు బాబు ఉండవచ్చా? డాక్టర్: మీ ముగ్గురు కూడా ఇంట్లో వేరువేరుగా ఉంటూ మాస్కులు వాడండి. నెగిటివ్ ఉన్న బాబును మాత్రం ప్రత్యేకంగా ఉంచండి. ఆ బాబుకు ఏదైనా లక్షణాలు ఇతర సమస్య ఏదైనా ఉంటే పరిశీలించండి. లక్షణాలు లేకపోతే పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. ప్రశ్న: చిన్న పిల్లలలో కరోనా లక్షణాలు ఎలా గుర్తించాలి. తుమ్ములు రావడం కూడా కరోనా లక్షణమేనా? డాక్టర్: సాధారణంగా చిన్న పిల్లలలో ప్రస్తుతం జ్వరం, దగ్గు, విరేచనాలు వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి. ఈ మూడింటిలో రెండు లక్షణాలు రెండు కంటే ఎక్కువ రోజులు ఉంటే ఓసారి పరీక్ష చేసు కోవాలి. తుమ్ములు రావడం కరోనా లక్షణం కాదు. ప్రశ్న: మా తల్లిదండ్రులకు పాజిటివ్ వచ్చింది. మా 8 ఏళ్ల బాబు వారితో ఉండేవాడు. అతడికి పరీక్ష చేస్తే నెగిటివ్ వచ్చింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్: కొందరి పిల్లల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వీరిలో వైరస్ పెద్దగా ప్రభావం చూపదు. మళ్లీమళ్లీ పరీక్షలు చేయకండి. ఏదైనా లక్షణాలు కన్పిస్తే అవి కూడా మూడు రోజుల పాటు తగ్గకుండా ఉంటే అప్పుడు చూడండి. లక్షణాలు కనిపిస్తే మల్టీ విటమిన్ సిరఫ్, పారాసిటమాల్ వాడండి. ప్రశ్న: మా ఇంట్లో నిమోనియా వచ్చిన వ్యక్తి ఉన్నాడు. కరోనా నేపథ్యంలో పిల్లలు అలాంటి వారికి దూరంగా ఉండాలా? డాక్టర్: సాధారణంగా నిమోనియా వచ్చిన వారికి పిల్లలను దూరంగా పెట్టడం చాలా ఉత్తమం. అతనికి దగ్గు కూడా ఉంటుంది కనుక ఎప్పుడూ మాస్కు పెట్టండి. ఇలాంటి వారికి వైరస్ తొందరగా సోకుతుంది. ప్రశ్న: నాకు పాజిటివ్ ఉంది. నా పాప ప్రస్తుతం మూడు నెలల శిశువు. పాపకు పరీక్ష చేయలేదు. తల్లి పాలు ఇవ్వొచ్చా? డాక్టర్: శిశువుకు పాలు ఇచ్చే సమయంలో తల్లిగా మీరు రెండు మాస్కులు పెట్టుకోవాలి. కరోనా ఉన్నా..పాలు ఇవ్వొచ్చు. పాపకు రెండురోజుల పాటు జ్వరం లేదా ఇతర లక్షణాలు ఉంటే టానిక్స్‌తో పాటు ఇతర మందులు వాడండి. మూడేళ్ల పైబడిన పిల్లలకు మాత్రమే మాస్కులు పెట్టవచ్చు. పిల్లల్లోజ్వరం, దగ్గు, కంట్లో నలత, గొంతు నొప్పి, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, 8 ఏళ్లు పైబడిన వారికి వాసన, రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు కన్పిస్తే అప్పుడుఅనుమానించాలి. ముఖ్యంగా కిడ్నీ, గుండె జబ్బులు, లివర్ సమస్య, ఎదుగుదల లోపం ఉన్న వారు హైరిస్క్‌లో ఉన్నట్లు. వీరికి వైరస్ కొంచెం త్వరగా సోకే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు పాజిటివ్ ఉన్న సమయంలో ఆహారం విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. - డాక్టర్ రాఘవేంద్రకుమార్ -
సోనూసూద్ ఔదార్యం.. పసిబిడ్డకు ప్రాణం పోశాడు!
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాయం కోసం తన వద్దకు వచ్చినవారందరికీ అండగా నిలుస్తూ కలియుగ కర్ణుడిగా ముద్ర వేసుకున్నాడు సోనూసూద్. కరోనా లాక్డౌన్ సమయంలో వేలాది కార్మికులకు అండగా నిలిచి రియల్ హీరోగా మారాడు. ఎంతో మందికి సాయం చేసి అందరి మన్ననలు పొందాడు. నష్టాల్లో ఉన్నవారి కోసం ఆయన వేసిన ముందడుగు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. వలస కూలీలను, విదేశాల్లో చిక్కుకున్న పేద భారతీయులను, విద్యార్థులను ఇండియాలోని వారి వారి స్వస్థలాలకు చేర్చడంలో సోనూ సూద్ కృషి మరువలేనిది. సోనూ సేవలకు దేశం మొత్తం ఆయన్ని కొనియాడింది. ఆదుకోవాలని అడిగిన వారందరికి నేనున్నానంటూ అండగా నిలుస్తున్న నటుడు సోనూసూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెంకట్రావుపేటకు చెందిన పోతు మహేశ్, లక్ష్మీప్రియ దంపతులకు రెండు నెలల కిందట నెలలు నిండకముందే కొడుకు పుట్టాడు. అయితే బాబు 900 గ్రాముల బరువుతో జన్మించాడు. అవయవాలు ఎదగలేదని, స్టమక్ ఇన్ఫెక్షన్ వల్ల బిడ్డ బతకడం కష్టమని డాక్టర్లు చెప్పారు. పదిహేను రోజుల తర్వాత బాబును హైదరాబాద్‌లోని రెయిన్బో హాస్పిటల్‌కు తరలించగా.. అక్కడ నాలుగు వారాలకు కొంత కోలుకున్నాడు. అయితే బిల్లు రోజురోజుకు పెరుగుతూ రూ.7లక్షలు దాటింది. అప్పటి నుంచి మహేశ్ డబ్బులు లేకపోవడంతో తెలిసినవారిని సాయం అడిగాడు. చదవండి: సలాం సోనూ సూద్...మీరో గొప్ప వరం! కరీంనగర్‌లోని ఒక వ్యక్తి బాబు పరిస్థితిని సోనూసూద్ దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన వెంటనే స్పందించి 7 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఎంత ఖర్చయినా భరిస్తానని, బాబుకు మెరుగైన ట్రీట్మెంట్ చేయించాలని చెప్పారు. ప్రస్తుతం కరీంనగర్‌లోని ప్రైవేట్ హాస్పిటల్లో బాబుకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. చిన్నారి మరో 300 గ్రాముల బరువు పెరిగాడు. ఇన్ఫెక్షన్ తగ్గుతూ తల్లిపాలు తాగుతున్నాడు. చదవండి: హీరో ఔదార్యం.. 1000 పడకల ఆస్పత్రి నిర్మాణం -
మాయదారి కరోనా.. పసిపిల్లలనూ వదలడం లేదు!
కరోనా మహమ్మారి ఎవరిని వదిలిపెట్టడం లేదు. పసిగుడ్డు నుంచి పండు ముదుసలి వరకు అందరినీ కాటేస్తోంది. కరోనా బారిన మహిళకు జన్మించిన శిశువు మృతి చెందిన సంఘటన ఆందోళన రేకిత్తిస్తోంది. అహ్మదాబాద్/సూరత్: కోవిడ్‌తో బాధపడుతున్న తల్లికి జన్మించిన బిడ్డ కరోనాతో మృత్యువాత పడిన ఘటన గుజరాత్‌లోని సూరత్ నగరంలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి శిశువు మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. ఈ నెల 1న సూరత్ నగరంలోని డైమండ్ ఆస్పత్రిలో జన్మించిన శిశువును మరో ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం చేశామని వైద్యులు తెలిపారు. బిడ్డ ప్రాణాలు రక్షించేందుకు తమకు తెలిసిన అన్ని రకాల వైద్య పద్ధతులను ఉపయోగించామని, అయితే ప్రయోజనం లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఇటీవలే కోవిడ్ నుంచి కోలుకున్న వైద్యుడి సీరాన్ని తీసి బిడ్డకు ఎక్కించామని, రెమిడిసివిర్ ఇంజెక్షన్ సైతం ఇచ్చి చూశామని అయితే బిడ్డ ప్రాణాలను రక్షించలేకపోయామని పేర్కొన్నారు. ‘నవజాత శిశువును కాపాడటానికి మా వైద్యులు తమ వంతు ప్రయత్నం చేశారు. నాకు తెలిసినంత వరకు గుజరాత్ కరోనావైరస్ బాధితులలో ఈ నవజాత శిశువు అతి పిన్న వయస్కులలో ఒకర’ని కోవిడ్ నుంచి ఇటీవల కోలుకున్న సూరత్ మాజీ మేయర్ డాక్టర్ జగదీష్ పటేల్ అన్నారు. శిశువు చికిత్స కోసం తన రక్త ప్లాస్మాను ఆయన దానం చేశారు. కాగా, తాపి జిల్లాకు చెందిన 14 రోజుల పసిబాలుడు కరోనా బారిన పడి సూరత్ కొత్త సివిల్ ఆసుపత్రిలో బుధవారం మరణించాడు. గతేడాది మొదటివేవ్ కంటే ఈసారి ఎక్కువ మంది పిల్లలు కరోనావైరస్ బారిన పడుతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందుతో పోలిస్తే కొత్త స్ట్రెయిన్ సంక్రమణ రేటు ఎక్కువగా ఉందని అభిప్రాయపడుతున్నారు. కరోనా సోకిన కుటుంబ సభ్యుల నుంచే పిల్లలకు కోవిడ్ వ్యాపిస్తోందని అహ్మదాబాద్‌కు చెందిన శిశువైద్యుడు డాక్టర్ నిశ్చల్ భట్ చెప్పారు. ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం గుజరాత్లో శనివారం నాటికి 49,737 యాక్టివ్ కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ చదవండి: లాన్సెట్ సంచలన నివేదిక: గాలి ద్వారానే కోవిడ్ అధిక వ్యాప్తి సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరం.. గంటల వ్యవధిలో వైరస్ లోడ్ కమ్యూనిటీ స్ప్రెడ్ -
ఉస్మానియా ఆసుపత్రిలో పాపం పసిపాప!
సాక్షి, అఫ్జల్‌గంజ్: పసిపాపను ఓతల్లి ఉస్మానియా ఆసుపత్రిలో వదిలి వెళ్లిన ఘటన అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, ఆసుపత్రి వర్గాల వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి ఓ తల్లి వెన్నుముక సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పసిపాపను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి తీసుకు వచ్చింది. వైద్యులు పాపను మెరుగైన చికిత్స నిమిత్తం ఏఎంసీ వార్డుకు తరలించారు. వార్డుకు చేరుకున్న కొద్ది సేపటి తర్వాత ఇప్పుడే వస్తాను, పాపను చూడండి అని ప్రక్క బెడ్‌పై ఉన్న పేషంట్‌కు చెప్పి సదరు మహిళ బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆసుపత్రి సిబ్బంది అవుట్ పోస్టు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ద్వారా మహిళను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. పాపకు ఉన్న వ్యాధి కారణంగా వదిలి వెళ్లారా? ఆడపిల్ల అని వదిలి వెళ్లారా? అనే కోణంలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స అనంతరం పాపను శిశు విహార్‌కు తరలిస్తామని తెలిపారు. చదవండి: అమానుషం: ఒకే ఆటోలో వచ్చారని.. అమానవీయం: ప్రాణం లేదని.. చెత్తకుప్పలోకి -
25 మంది మరణించారు.. 6 నెలల బాలుడు బ్రతికాడు!
కైరో : ఈజిప్టులోని కైరోలో శనివారం అపార్ట్మెంట్ బిల్డింగ్ కూలిన ఘటనలో 25 మంది మృత్యువాత పడగా.. మరో 26 మంది గాయాలపాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంఘటనా ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం శిథిలాల కిందనుంచి 6 నెలల బాలుడ్ని సహాయక సిబ్బంది ప్రాణాలతో వెలికి తీశారు. ఈ ఘటనలో బాలుడి తల్లి,తండ్రి, అక్క మృత్యువాత పడ్డారు. అతడి అన్న ఆచూకీ లభించలేదు. దీంతో సహాయకసిబ్బంది అతడి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉంది. కాగా, బిల్డింగ్ కూలటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. నాణ్యతలో లోపం కారణంగానే బిల్డింగ్ కూలిపోయినట్లు ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. దీనిపై దర్యాప్తు చేయటానికి ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. చదవండి, చదివించండి : ఒబామా కుటుంబంలో విషాదం -
బీరు తాగిన తల్లి, మరణించిన పసికందు
మేరీల్యాండ్: ఒక మహిళ బీర్ తాగి తన పాప పక్కన పడుకుంది. ఆమెకు పసికందుతో పాటు 4 యేళ్ల కూతురు కూడా ఉంది. తాగి వచ్చిన ఆ మహిళ పసిపాపకు పాలుపట్టింది, డైపర్ మార్చింది, తలుపులు అన్ని లాక్ చేసి జాగ్రత్తగానే పడుకుంది. కానీ తెల్లారి లేచేసరికి ఆ పసికందు కదలడం లేదు. ఆమె పెదాలన్ని నీలం రంగులోకి మారిపోయి కదలకుండా బెడ్ మీద ఉంది. ఆమెను పరీక్షించిన డాక్టర్లు పాప మరణించినట్లు తెలిపారు. ఈ ఘటన మేరీ ల్యాండ్‌లో జరిగింది. మేరీ ల్యాండ్‌కు చెందిన మురియెల్ మోరిసన్ అనే మహిళ వర్చువల్ పార్టీలో 2 బీర్లు, కొంచెం మద్యం సేవించింది. తరువాత వెళ్లి తన నాలుగేళ్ల చిన్నారితో పాటు నిదురిస్తున్న మరో పాప వద్ద పడుకుంది. అయితే బీర్ వాసన వలన ఆ పసికందు మరణించిందని, ఆ తల్లి మద్యం సేవించడం కారణంగా పాపకు ఊపిరాడక మృతి చెందినట్లు ఆమె పై కేసు నమోదయ్యింది. అయితే ఈ కేసును విచారించిన న్యాయస్థానం తల్లి నిర్లక్ష్యం కారణంగా బిడ్డ చనిపోయిందనడానికి ఏం ఆధారాలు లేవని పేర్కొంది. అంతే కాకుండా బీర్ వాసన వల్ల ఊపిరాడక మరణిస్తారు అని ఎక్కడ లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీంతో మోరిసన్‌ను విడుదల చేశారు. అమెరికాలో ఈ ఒక్కటే కాదు ప్రతి యేడాది కలిసి పడుకోవడం వలన 3,500 మందికి పైగా చిన్నారులు మరణిస్తున్నారు. చిన్నారులతో కలిసి పడుకోవడం కాకుండా వారికి వేరే ఊయల లేదా బెడ్‌ను ఏర్పాటు చేయాలని అమెరికా ఆరోగ్య భద్రత నిపుణులు సూచిస్తున్నారు. కానీ 64 శాతం మందికి పైగా మహిళలు వారి పిల్లలతో కలిసి ఒకే బెడ్ పై నిదురిస్తున్నారు. చదవండి: ఈతకని వచ్చి గుహలో చిక్కుకుపోయాడు -
54 రోజుల చిన్నారిపై తండ్రి కర్కశత్వం
తిరువనంతపురం : మద్యం మత్తులో ముక్కు పచ్చలారని శిశువుపై కన్నతండ్రి దాడికి తెగబడ్డాడు. తండ్రి దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆ చిన్నారి ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన కేరళలో ఆదివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జూన్ 19వ తేదీన కేరళకు చెందిన 40 ఏళ్ల షైజు థామస్ అనే వ్యక్తి మద్యం మత్తులో 54 రోజుల సొంతబిడ్డపై దాడికి పాల్పడ్డాడు. విపరీతంగా కొట్టి, మంచంపై పడేశాడు. దీంతో చిన్నారి తీవ్రగాయాలపాలైంది. ( భర్తకు తెలియకుండా అప్పులు.. ఆపై సొంతింట్లోనే..) ఆ తర్వాత తన కూతురు ప్రమాదవశాత్తు మంచంపైనుంచి కింద పడిపోయిందని చెప్పి ఆసుపత్రిలో చేర్పించాడు. అయితే అతడి మాటలను వైద్యులు విశ్వసించలేదు. వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు థామస్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. -
చిన్నారి ఏడుపు.. పాలు అందించిన పోలీస్
రాంచీ : కరోనా ఓ వైపు మానవాళిపై మృత్యు ఘంటికలు మోగిస్తుంటే.. మరోవైపు ప్రజల నుంచి మానవత్వం పరిమళిస్తోంది. లాక్డౌన్లో అష్టకష్టాలు ఎదుర్కొంటున్న వారికి ఎంతో మంది అండగా ఉంటూ తనదైన సాయం అందిస్తున్నారు. ఇలాంటి ఎన్నో అపురూప దృశ్యాలు మన కంటికి తారసపడతునే ఉన్నాయి. తాజాగా అలాటి ఓ సన్నివేశం మరోసారి కంటపడింది. ఈ సంఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుందిది. నాలుగు నెలల పిల్లవాడితో మెహరున్నీసా అనే మహిళ బెంగుళూరు నుంచి గోరఖ్‌పూర్‌కు శ్రామిక్ రైల్లో ప్రయాణం చేస్తోంది. రైలు హటియా రైల్వే స్టేషన్లో ఆగడంతో శిశువు పాల కోసం ఏడవడంతో తల్లి తన పిల్లవాడి కోసం పాలు కావాలని స్థానికంగా ఉన్న అధికారులను కోరింది. (‘సెల్యూట్ పోలీస్.. మీపై గౌరవం పెరిగింది’) మెహరున్నీసా దీన స్థితిని స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సుశీల అనే మహిళా పోలీస్ అధికారి(ఏఎస్సై) తెలుసుకుంది. ఆమె ఇల్లు స్టేషన్‌కు సమీపంలో ఉండటంతో తన ఇంటికి వెళ్లి శిశువు కోసం సీసాలో పాలు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని రాంచీ పోలీస్ అధికారులు ట్విటర్లో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. రైల్వే స్టేషన్లో పోలీసు అధికారి పాల సీసాను మెహరున్నీసాకు అందించిన ఫోటోను కూడా రాంచీ అధికారులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా గత నెలలో ఇలాంటి ఘటనే భోపాల్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. రైలులో గుక్కపట్టి ఏడుస్తున్న నాలుగేళ్ల చిన్నారికి ఆర్పీఎఫ్ జవాన్ పాల ప్యాకెట్ కొని తెచ్చి రియల్ హీరో అనిపించుకున్నాడు. (చైనాతో దౌత్య యుద్ధం చేయాల్సిందే! ) दिनांक 14 जून 2020 को हटिया रेलवे स्टेशन पर ट्रेन संख्या 06563 बेंगलुरु से गोरखपुर जाने वाली श्रमिक स्पेशल ट्रेन का सुबह 06:00 बजे आगमन हुआ. इस ट्रेन से यात्रा कर रही एक महिला यात्री (नाम- मेहरून्निसा )ने स्टेशन पर कार्यरत रेल सुरक्षा बल की महिला कर्मचारी ASI, श्रीमती 1/2 pic.twitter.com/KVj52XEYZp — DRM Ranchi (@drmrnc) June 14, 2020 -
‘సెల్యూట్ పోలీస్.. మీపై గౌరవం పెరిగింది’
ముంబై : ముంబై పోలీస్ అధికారి చేసిన ఓ పని సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇంతకీ ఏం చేశాడని అనుకుంటున్నారా. నెలలు నిండని ఓ పసి ప్రాణాన్ని కాపాడాడు. వివరాల్లోకి వెళితే.. ఎస్ కోలేకర్ అనే వ్యక్తి ముంబైలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఓ రోజు విధులకు వెళ్తుండగా.. 14 రోజుల శిశువు ప్రమాదవశాస్తు సేప్టీ పిన్ను మింగేసింది. రోడ్డుపై ఆందోళన చెందుతున్న తల్లిదండ్రుల నుంచి విషయం తెలుసుకున్న కోలేకర్ చిన్నారిని ముంబైలోని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబానికి సహాయం చేశాడు. తన సొంత వాహనంలో చిన్నారిని సమయానికి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు శిశువుకు చికిత్స అందిచి సేఫ్టీ పిన్ను బయటకు తీశారు. (టీచర్‌గా మారిన మాజీ ఎమ్మెల్యే ) ఈ విషయాన్ని ముంబై పోలీసులు గురువారం ఉదయం ట్విటర్లో వెల్లడించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారడంతో కానిస్టేబుల్ చేసిన పనికి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్పందించి చిన్నారి ప్రాణాలు కాపాడినందుకు అభినందనలు తెలుపుతున్నారు. ‘సెల్యూట్ ముంబై పోలీస్...మీ మీద మాకున్న గౌరవం మరింత పెరిగింది’ అంటూ కామెంట్ చేస్తున్నారు. (గుడ్‌న్యూస్: నెలాఖరుకు కోవిడ్-19 డ్రగ్ ) When in doubt, find your nearest cop! A 14 day old baby was choking on a safety pin he had accidentally swallowed. PC S.Kolekar spotted the worried parents on the road & rushed the kid to KEM using his own vehicle, where the child received timely treatment.#MumbaiFirst pic.twitter.com/yCVNxFQKvW — Mumbai Police (@MumbaiPolice) June 18, 2020 -
ఆసుపత్రి నిర్లక్ష్యం: తల్లీబిడ్డలకు కరోనా
ముంబై : ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోజుల పసిబిడ్డకు, బిడ్డ తల్లికి కరోనా వైరస్ సోకింది. ఈ విషాద ఘటన ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన 26 ఏళ్ల యువతి ఈ నెల 26న ఇంటివద్ద ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పసిబిడ్డ పరిస్థితి బాగోలేకపోవటంతో ఆమె భర్త తల్లీబిడ్డలను చెంబూర్ ఆసుపత్రిలో చేర్చాడు. అక్కడ సరైన చికిత్స అందటం లేదన్న కారణంతో కుర్లా బాబా ఆసుపత్రికి మార్చాడు. ఆ ఆసుపత్రిలోనూ అదే పరిస్థితి ఎదురుకావటంతో అక్కడినుంచి కస్తూర్భా ఆసుపత్రికి వారిని తీసుకెళ్లాడు. అక్కడి వైద్యులు తల్లీబిడ్డలలో కరోనా లక్షణాలను గుర్తించి పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో వారికి కరోనా సోకినట్లు తేలింది. కాగా, చెంబూర్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తల్లీబిడ్డలకు వైరస్ సోకిందని, వారిని కరోనా పేషంట్ బెడ్ మీద ఉంచటమే ఇందుకు కారణమని బాధితుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చదవండి : కరోనా : పెంగ్విన్ ఫీల్డ్ ట్రిప్ !! -
9 నెలల చిన్నారిపై మేనమామ అఘాయిత్యం
కోల్‌కతా : చిన్నా, పెద్ద తేడా లేకుండా మహిళలపై రోజురోజుకి అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. తన మన తేడా లేకుండా మనుషులు మృగాళ్లుగా మారి అరాచాకాలకు తెగబడుతున్నారు. వీటిని అరికట్టడానికి ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు పోలీసులు కృషి చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. దిశ కేసులోని నిందితులను శుక్రవారం పోలీసులు ఎన్కౌంటర్ చేసి మట్టుబెట్టిన విషయం తెలిసిందే. తాజగా నెలలు నిండని ఓ పసిపాపపై కామాంధుడైన మేనమామ అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో వెలుగు చూసింది. వివరాలు.. శ్యాంపూర్ పరిధిలోని బార్గావ్ ప్రాంతంలో తొమ్మిది నెలల చిన్నారితో కలిసి ఓ కుటుంబం జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటి పక్కనే ఉంటున్న మేనమామ బుధవారం పాపకు బొమ్మలు కొనిస్తానని మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లాడు. తిరిగి చిన్నారిని తల్లిదండ్రులకు అప్పజెప్పిన అనంతరం శిశువుకు రక్తస్రావం కావడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు అనుమానంతో శ్యాంపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అనుప్ ప్రమానిక్‌గా గుర్తించారు.కాగా లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం( పోక్సో) యాక్ట్ కింద నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చదవండి : దిశ నిందితుల ఎన్కౌంటర్ సోదరి వరస యువతిపై మృగాడి దాష్టీకం స్నేహితుడితో కలిసి భార్యపై లైంగికదాడి