
గాంధీలో చిన్నారి అపహరణ
రంగంలోకి దిగిన పోలీస్ బృందాలు
చిలకలగూడ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో శనివారం వేకువజామున తొమ్మిది నెలల చిన్నారిని అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు 14 పోలీస్ బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు.. మెదక్‌జిల్లా చిన్నశంకరంపేట మండలం గౌలపల్లికి చెందిన గూడ రేణుక థైరాయిడ్ సమస్యలతో బాధపడుతుంది. చికిత్స కోసం తొమ్మిది నెలల కుమార్తె కావ్య, అత్త సిద్ధమ్మ, తండ్రి మల్లేష్‌తో కలిసి శుక్రవారం మధ్యాహ్నాం 12 గాంధీ ఆస్పత్రికి వచ్చింది. అప్పటికే అవుట్ పేషెంట్ విభాగం మూసివేయడంతో శనివారం వైద్యపరీక్షలు చేయించుకోవాలని ఆస్పత్రి ప్రాంగణంలోని విజిటర్స్ షెడ్‌లో బస చేశారు.
ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం సుమారు 45 ఏళ్లు ఉన్న వ్యక్తి తన పేరు విశ్వనాథం అని, 30 ఏళ్ల వయసుగల మహిళ తన కోడలు అని పరిచయం చేసుకున్నాడు. తన కోడలు కూడా థైరాయిడ్ సమస్యతో బాధపడుతుందని మాటలు కలిపి, తన కోడలు ఇక్కడే ఉంటుందని రాత్రి 8 గంటల సమయంలో అతడు వెళ్లిపోయాడు. అందరు కలిసి విజిటర్స్ షెడ్‌లో పడుకున్నారు. రాత్రి 2 గంటల సమయంలో రేణుక లేచి చూడగా కావ్యతోపాటు ఆ మహిళ కనిపించలేదు. ఆస్పత్రి ప్రాంగణమంతా వెతికినా ఫలితం లేకపోవడంతో రేణుక అవుట్‌పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిలకలగూడ ఇన్‌చార్జ్ సీఐ కావేటి శ్రీనివాసులు ఘటనాస్థలానికి వచ్చి వివరాలు సేకరించి, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సెల్‌నంబర్ ఆధారంగా..
విశ్వనాథం సెల్ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. గుర్తుతెలియని మహిళ రేణుక సెల్‌ఫోన్ నుంచి శుక్రవారం రాత్రి విశ్వనాథానికి ఫోన్ చేసింది. తర్వాత విశ్వనాథం రేణుక సెల్‌కు ఫోన్ చేసి సదరు మహిళతో మాట్లాడాడు. ఫొటోను సేకరించి బాధితురాలికి చూపించగా విశ్వనాథం అని గుర్తుపట్టింది. ఘట్‌కేసర్ ప్రాంతంలో విశ్వనాథాన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గజ్వేలు, కడప తదితర ప్రాంతాలకు వెళ్లిన పోలీస్ బృందాలు చిన్నారి ఆచూకీ కోసం గాలిస్తున్నాయి.
పనిచేయని సీసీ కెమెరా..
గాంధీ ఆస్పత్రిలోని విజిటర్స్ షెడ్ ఎదురుగా ఎమర్జెన్సీ విభాగం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా పనిచేయకపోవడంతో నిందితులకు సంబంధించిన సరైన ఆధారాలు లభించలేదు. దీంతో దర్యాప్తులో వేగం తగ్గింది.
కిడ్నాప్ కేంద్రంగా..
- గాంధీలో రెండేళ్లలో రెండో ఘటన
- రెండు ఆగస్టులోనే..
గాంధీ ఆస్పత్రి : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి చిన్నారుల అపహరణకు కేంద్రంగా మారింది. రెండేళ్లలో ఇద్దరు చిన్నారులు కిడ్నాప్‌లకు గురయ్యారు. రెండు ఘటనలు ఆగస్ట్ నెలలోనే జరగడం గమనార్హం. 2013 ఆగస్ట్ 18వ తేదీన బోరబండ శ్రీరాంనగర్‌కు చెందిన సుమిత్ర ప్రసవించిన మరునాడే బాబును పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన మేరీ, నవీన్ అపహరించారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి చిన్నారిని ఎత్తుకుని అనుమానాస్పదంగా సంచరించి నిందితులు మహిళ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఎక్కినట్లు గుర్తించారు. తెనాలి రైల్వేస్టేషన్‌లో నిందితులను అదుపులోకి తీసుకుని చిన్నారిని కన్నతల్లి చెంతకు చేర్చారు. కాగా శనివారం అపహరణకు గురైన చిన్నారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.