
మేడిపల్లి సమీపంలో ముళ్లపొదల్లో దొరికిన పసిపాప
పసికందులు రోడ్డు పాలవుతున్న ఘటనలు తెలుగుగడ్డపై నానాటికీ పెరిగిపోతున్నాయి.
విజయవాడ: పసికందులు రోడ్డు పాలవుతున్న ఘటనలు తెలుగుగడ్డపై నానాటికీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆశశిశువులను వదిలించుకునేందుకు రోడ్డు పక్కన వదిలేస్తున్న ఉదంతాలు అధికమవుతున్నాయి.
తాజాగా కవల పిల్లలను మురుగు కాల్వలో పడేసిన విదారక ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన పాపలను గుర్తుతెలియని వ్యక్తులు ఏలూరు లాకులు సమీపంలో మురుగు కాల్వలో పారేశారు. శిశువుల మృతదేహాలను వెలికితీశారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్ లోని మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అప్పుడే పుట్టిన పాపను పీర్జాదిగూడ-బుద్ధానగర్ పరిసర ప్రాంతంలో ముళ్లపొదల్లో వదిలేశారు. పసికందు గుక్కపెట్టి ఏడుస్తుండగా గుర్తించిన ఓ మహిళ పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఆ పాపను నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో ఆదివారం స్నానాల గదిలో ఆడ శిశువు మృతదేహం లభించిన సంగతి తెలిసిందే.