ముళ్ల పొదలో ఆడ శిశువు
-
కాపాడిన గ్రామస్తులు
-
తీగారంలో కలకలం రేపిన ఘటన
జఫర్‌గఢ్/ఎంజీఎం : తల్లి వెచ్చని పొత్తిళ్లలో కునుకు తీయాల్సిన ఓ శిశువు ముళ్లపొద పాలైంది. ఆకలితో పాల కోసం గుక్క పెట్టి ఏడ్చింది. తెల్లవారుజామున ఆ పసికందు ఆక్రందనలు విన్న గ్రామస్తులు ‘అయ్యో బిడ్డా’ అని అక్కున చేర్చుకున్నారు. గుండెలకద్దుకొని ఊరడించారు. ఈ సంఘటన మండలంలోని తీగారం గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. తీగారం గ్రామంలో పాఠశాలకు వెళ్లే దారిలో రోడ్డు పక్కన ముళ్లపొదల నుంచి పసికందు ఏడుపు శబ్దాలు స్థానికులకు వినిపిం చాయి. దీంతో వారు ఆ ఏడుపు వినిపిస్తున్న ముళ్ల పొదల వైపు వెళ్లి చూడగా చిన్నచిన్న గాయాలతో ఓ శిశువు కనిపించింది. మహిళలు ఆ ఆడ శిశువుకు సపర్యలు చేసి, నెత్తికి కుల్ల కుట్టారు. శరీరానికి వెచ్చదనం కలిగేలా దుస్తులు తొడిగి తల్లి ప్రేమను చాటారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. గ్రామానికి చేరుకున్న ఎస్సై బండారి సంపత్ గ్రామస్తుల ద్వారా సంఘటన వివరాలను తెలుసుకున్నారు. అప్పటికే గాయాలతో ఉన్న శిశువుకు వైద్యం అందించేందుకుగాను వెంటనే పోలీస్ వాహనంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, మహిళల సాయంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలిం చారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు ఎస్సై సంపత్ తెలిపారు. కాగా పుట్టిన శిశువు ఆడ పిల్ల కావడం వల్లనే శిశువు తల్లిదండ్రులు తమకు ఎక్కడ భారమవుతుందోనని ముళ్లపొదల్లో పారేసినట్లుగా ఉందని స్థానికులు తెలిపారు. ఆ పసికందును చూసిన మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన గ్రామం లో కలకలం రేపింది.