తల్లికి పాజిటివ్‌ ఉన్నా..  శిశువుకు పాలు ఇవ్వొచ్చా? | Should I breastfeed if I have Tested COVID19, Here is The Details | Sakshi
Sakshi News home page

తల్లికి పాజిటివ్‌ ఉన్నా..  శిశువుకు పాలు ఇవ్వొచ్చా?

Published Sun, May 9 2021 12:20 PM | Last Updated on Sun, May 9 2021 2:31 PM

Should I breastfeed if I have Tested COVID19, Here is The Details - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: ‘కరోనా పాజిటివ్‌ వచ్చిన తల్లి.. శిశువుకు పాలు ఇవ్వొచ్చు. కాకపోతే పాలు ఇచ్చే సమయంలో తల్లి రెండు మాస్కులు ధరించాలి.’ కేవలం పాలు ఇచ్చే సమయంలో మాత్రమే శిశువును దగ్గరకు తీసుకోవాలి, ఇతర ఆలనాపాలన మాత్రం నెగిటివ్‌ ఉన్న మహిళతో చేయించాలి. శిశువుకు లక్షణాలు ఉంటే కావాల్సిన మందులు వాడాలి. పరీక్షలు మాత్రం చేయించాల్సిన అవసరం లేదు. చిన్నారులకు మాస్కు పెట్టలేం కనుక అధిక లక్షణాలతో పాజిటివ్‌ ఉండే తల్లులు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. తరచూ శిశువు పట్టుకోకుండా పాలు ఇచ్చే సమయంలో కాకుండా ఇతర సమయాల్లో కొంత దూరం ఉండడం ఉత్తమం.’ అని ప్రముఖ చిన్న పిల్లల డాక్టర్‌ రాఘవేంద్రకుమార్‌ తెలిపారు. శనివారం సాక్షి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో ఆయన పలువురు కాలర్స్‌ అడిగిన సందేహాలను నివృత్తి చేయడంతో పలు సలహాలు, సూచనలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మొదటి వేవ్‌ కంటే సెకండ్‌ వేవ్‌లో 3 నుంచి 4శాతం చిన్నారులు అధికంగా కరోనా బారినపడుతున్నారు. కాకపోతే ఎవరూ కూడా తీవ్ర సమస్యలకు గురికాకుండా స్వల్ప లక్షణాలతో రికవరీ అవుతున్నారు. సెకండ్‌ వేవ్‌లో వందలో పదిశాతం చిన్నారులు కరోనా లక్షణాలతో ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఇందులో ప్రధానంగా జ్వరం, దగ్గు, విరేచనాలు వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం చిన్నారులలో ఎవరిలో కూడా ఆయాసం కన్పించడం లేదు.

పిల్లలకు ఒకటి లేదా రెండు రోజుల పాటు జ్వరం వస్తుంటే పారాసిటమాల్‌ ప్రతి ఆరు గంటలకు ఓసారి వేయాలి. మల్టీవిటమిన్, కొద్దిగా లక్షణాలు అధికంగా యాంటీబయోటిక్స్‌ వాడాలి. తల్లిదండ్రులకు పాజిటివ్‌ వచ్చి పిల్లలకు ఆ రోజు నెగిటివ్‌ వస్తే నిర్లక్ష్యం చేయవద్దు. మళ్లీ రెండు రోజుల తర్వాత వారిలో లక్షణాలు బయటపడుతాయి. వారిలో ఉండే టీకా, రోగనిరోధక శక్తివల్ల లక్షణాలు బయటపడటానికి కొంత సమయం పడుతుంది. 24గంటల నుంచి 48 గంటల పాటు పారాసిటమాల్‌ వేసిన కూడా జ్వరం తగ్గకపోతే అప్పుడు కరోనా పరీక్షలకు వెళ్లాలి.’ అని పేర్కొన్నారు.

 

ప్రశ్న: మా తల్లిదండ్రులతో పాటు నాకు పాజిటివ్‌ వచ్చింది. నాకు చిన్నారి ఉంది. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 
డాక్టర్‌: మీ పాపను కొంత దూరంగా పెట్టండి. ఏదైనా అత్యవసరం ఉండి, పాలు ఇవ్వాల్సిన సమయంలో చేతులకు గ్లౌజ్, రెండు మాస్కులు పెట్టుకొని శిశువును పట్టుకోవాలి. పాపకు ఏదైనా లక్షణాలు కనిపిస్తే మందులు వాడండి.  

ప్రశ్న: మా పాపకు 8 ఏళ్లు నా తల్లిదండ్రులతో ఉంటుంది. ఇటీవల వారికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. కానీ పాపకు నెగిటివ్‌ ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాపకు మళ్లీ పరీక్ష చేయించాలా? 
డాక్టర్‌: పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులకు పాపను కొంత దూరం పెట్టండి. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి లక్షణాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటే మళ్లీ పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. జ్వరం ఉంటే పారాసిటమాల్‌ వాడండి.

ప్రశ్న: మా ఇంట్లో నలుగురం ఉంటే మా చిన్న బాబుకు తప్పా అందరికీ పాజిటివ్‌ వచ్చింది. మాతో పాటు బాబు ఉండవచ్చా? 
డాక్టర్‌: మీ ముగ్గురు కూడా ఇంట్లో వేరువేరుగా ఉంటూ మాస్కులు వాడండి. నెగిటివ్‌ ఉన్న బాబును మాత్రం ప్రత్యేకంగా ఉంచండి. ఆ బాబుకు ఏదైనా లక్షణాలు  ఇతర సమస్య ఏదైనా ఉంటే పరిశీలించండి. లక్షణాలు లేకపోతే పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. 

ప్రశ్న: చిన్న పిల్లలలో కరోనా లక్షణాలు ఎలా గుర్తించాలి. తుమ్ములు రావడం కూడా కరోనా లక్షణమేనా? 
డాక్టర్‌: సాధారణంగా చిన్న పిల్లలలో ప్రస్తుతం జ్వరం, దగ్గు, విరేచనాలు వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి. ఈ మూడింటిలో రెండు లక్షణాలు రెండు కంటే ఎక్కువ రోజులు ఉంటే ఓసారి పరీక్ష చేసు కోవాలి. తుమ్ములు రావడం కరోనా లక్షణం కాదు.  

ప్రశ్న: మా తల్లిదండ్రులకు పాజిటివ్‌ వచ్చింది. మా 8 ఏళ్ల బాబు వారితో ఉండేవాడు. అతడికి పరీక్ష చేస్తే నెగిటివ్‌ వచ్చింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
డాక్టర్‌: కొందరి పిల్లల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వీరిలో వైరస్‌ పెద్దగా ప్రభావం చూపదు. మళ్లీమళ్లీ పరీక్షలు చేయకండి. ఏదైనా లక్షణాలు కన్పిస్తే  అవి కూడా మూడు రోజుల పాటు తగ్గకుండా ఉంటే అప్పుడు చూడండి. లక్షణాలు కనిపిస్తే మల్టీ విటమిన్‌ సిరఫ్, పారాసిటమాల్‌ వాడండి.

ప్రశ్న: మా ఇంట్లో నిమోనియా వచ్చిన వ్యక్తి ఉన్నాడు. కరోనా నేపథ్యంలో పిల్లలు అలాంటి వారికి దూరంగా ఉండాలా? 
డాక్టర్‌: సాధారణంగా నిమోనియా వచ్చిన వారికి పిల్లలను దూరంగా పెట్టడం చాలా ఉత్తమం. అతనికి దగ్గు కూడా ఉంటుంది కనుక ఎప్పుడూ మాస్కు పెట్టండి. ఇలాంటి వారికి వైరస్‌ తొందరగా సోకుతుంది.

ప్రశ్న: నాకు పాజిటివ్‌ ఉంది. నా పాప ప్రస్తుతం మూడు నెలల శిశువు. పాపకు పరీక్ష చేయలేదు. తల్లి పాలు ఇవ్వొచ్చా? 
డాక్టర్‌: శిశువుకు పాలు ఇచ్చే సమయంలో తల్లిగా మీరు రెండు మాస్కులు పెట్టుకోవాలి. కరోనా ఉన్నా..పాలు ఇవ్వొచ్చు. పాపకు రెండురోజుల పాటు జ్వరం లేదా ఇతర లక్షణాలు ఉంటే టానిక్స్‌తో పాటు ఇతర మందులు వాడండి.

మూడేళ్ల పైబడిన పిల్లలకు మాత్రమే మాస్కులు పెట్టవచ్చు. పిల్లల్లోజ్వరం, దగ్గు, కంట్లో నలత, గొంతు నొప్పి, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, 8 ఏళ్లు పైబడిన వారికి వాసన, రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు కన్పిస్తే అప్పుడుఅనుమానించాలి. ముఖ్యంగా కిడ్నీ, గుండె జబ్బులు, లివర్‌ సమస్య, ఎదుగుదల లోపం ఉన్న వారు హైరిస్క్‌లో ఉన్నట్లు. వీరికి వైరస్‌ కొంచెం త్వరగా సోకే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు పాజిటివ్‌ ఉన్న సమయంలో ఆహారం విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి.
 - డాక్టర్‌ రాఘవేంద్రకుమార్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement