
నాలుగు గంటలు నరకయాతన!
ముంబై: నగరంలో ఓ మహిళ లోకల్ రైళ్లో ప్రయాణిస్తుండగా మగశిశువుకు జన్మనిచ్చిన తరువాత నరకయాతన అనుభవించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గర్భిణిగా ఉన్న ప్రియాంక మిర్పాగేర్(24) ఆదివారం ముంబైలోని లోకల్ ట్రైన్ ల్లో ప్రయాణిస్తుండగా థానే స్టేషన్ కు చేరుకున్న సమయంలో ఆమె ఒక్కసారిగి ప్రసవ వేదనకు గురైంది. ఆ క్రమంలోనే ప్రియాంక ఓ మగ శిశువుకు జన్మినిచ్చింది. అనంతరం ఆమెకు రక్తస్రావం అధికావడంతో మహిళా ప్రయాణికుల సాయంతో ములుంద్ లోని ఓ బీఎంసీ ఆస్పత్రికి తరలించారు.
అయితే వారి నుంచి వచ్చిన సమాధానంతో ఆ మహిళ అక్కడ్నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. అటు తరువాత మరో బీఎంసీ ఆస్పత్రికి వెళ్లినా జాయిన్ చేసుకోమంటూ డాక్టర్ల వద్ద నుంచి సమాధానం. ఆస్పత్రిలో ఆమెను అడ్మిట్ చేసుకోవటం మాట పక్కన పెడితే .. కనీసం అప్పుడే పుట్టిన శిశువును శుభ్రం చేసే ప్రక్రియను కూడా ఆ డాక్టర్లు చేపట్టలేదు. తన ఆవేదనను పెడచె విన పెట్టిన ఆ ఆస్పత్రి డాక్టర్లు ఎట్టిపరిస్థితుల్లోనూ జాయిన్ చేసుకోమని తేల్చిచెప్పారని ఆ మహిళ బోరున విలపించింది.
తనకు తీవ్ర రక్తస్రావం అయినా బీఎంసీ డాక్టర్లు పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నాలుగు గంటల పాటు నరకయాతన అనుభవించిన తరువాత చివరకు ఘాట్ కోపార్ లోని రాజ్ వాదీ ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు ఆమె పేర్కొంది. తన తల్లి ములుంద్ లోని వీర శంకర్ ఆస్పత్రిలో పని చేస్తుందని.. దానిలో భాగంగానే అక్కడే చికిత్స చేయించుకోవాలని తొలుత భావించినట్లు స్పష్టం చేసింది. అయితే ఆ రోజు ఆ ఆస్పత్రిలో చెకప్ చేసుకుని ఇంటికి లోకల్ ట్రైన్ లో బయల్దేరిన క్రమంలో తనకు పురిటి నొప్పులు అధికమై ప్రసవం జరిగినట్లు పేర్కొంది.