అప్పుడే పుట్టిన ఓ పసికందును గుర్తుతెలియని వ్యక్తులు పాడుబడ్డ బావిలో పడేశారు. ఈ హృదయ విదారక ఘటన రంగారెడ్డి జిల్లా ధరూరు మండలం అల్లిపూర్ గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.
ధరూరు (రంగారెడ్డి) : అప్పుడే పుట్టిన ఓ పసికందును గుర్తుతెలియని వ్యక్తులు పాడుబడ్డ బావిలో పడేశారు. ఈ హృదయ విదారక ఘటన రంగారెడ్డి జిల్లా ధరూరు మండలం అల్లిపూర్ గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అల్లిపూర్ గ్రామానికి చెందిన ఎం.శ్రీనివాస్ తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోని గంధం అనంతయ్య పొలంలోని పాడుబడిన బావిలో నుంచి పసికందు ఏడుపు ఆయనకు వినిపించింది. వెళ్లి చూడగా.. బావి మధ్యలో చెట్ల పొదల్లో నల్లని పాలిథిన్ కవర్ లో మగశిశువు కనిపించడంతో ఆయన బయటకు తీసుకొచ్చాడు.
ఒళ్లంతా రక్తపు మరకలు ఉండడంతో అప్పుడే పుట్టిన శిశువు అని గుర్తించి శుభ్రం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శిశువును వికారాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. కాగా గ్రామానికి చెందిన ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. అయితే పసికందు తన బిడ్డ కాదని ఆమె స్పష్టం చేసింది. అధికారులు అంగన్‌వాడీ సిబ్బందిని పిలిపించి గర్భవతుల వివరాలు సేకరించారు. అనుమానితురాలి పేరు రికార్డులో లేకపోవడంతో చేసేది లేక ఆమెను వదిలేశారు. అనంతరం శిశువును తాండూరులోని శిశు విహార్‌కు తరలించారు.