
పురాతన శిల్పాలు, ఆనాటి కట్టడాలు గొప్పగొప్ప కథలెన్నో చెబుతుంటాయి. ఆనాటి రాజరికపు దర్పాన్ని, ప్రజా జీవన శైలిని కళ్లకు కడుతుంటాయి. అలాంటిదే కర్నూలు జిల్లా మండల కేంద్రం మద్దికెరలోని భోజరాజు బావి. ఇది సుమారు 5 వందల ఏళ్ల క్రితం పెద్దనగరి యాదవరాజులైన భోజరాజు తవ్వించారు. నాటి నుంచి నేటికీ గ్రామస్థులు, ఆ బావి నీటిని తమ అవసరాలకు వినియోగించుకుంటున్నారు.
దాదాపు 70 అడుగుల లోతు, 80 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఈ బావి ఎన్నో ప్రాచీన విగ్రహాలతో ఆకట్టుకుంటుంది. ఈ బావిని ఎలాంటి మట్టి, ఇతర సామగ్రిని వినియోగించకుండా రాతి మీద రాతిని పేర్చి, హెచ్చుతగ్గులు కనిపించకుండా కట్టిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ రాతి కట్టడంపై దేవతామూర్తులు, నర్తకుల నృత్యభంగిమలు, జలచర జీవుల రూపాలు, జలకన్యలు ఇలా వందలకొద్ది శిల్పాలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి.
పదేళ్ల క్రితం వరకు గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈ బావి నీటినే వినియోగించేవారు. కాలక్రమేణా నీళ్ల వ్యాపారం మొదలైననాటి నుంచి, ఎవరికి వారు, వాటర్‌క్యాన్స్ కొనుక్కుంటూ ఈ బావి నీటిని గృహ అవసరాలకు వాడటం మానేశారు. ప్రస్తుతం ఈ నీటిని వ్యవసాయానికి వినియోగిస్తున్నారు. ‘అప్పట్లో ఈ నీళ్లు తాగితే మోకాళ్ల నొప్పులు ఉండేవి కావు, ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తేవి కావు’ అని కొందరు గ్రామస్థులు చెబుతున్నారు.
కరువులోనూ ఆదుకుంది..
దాదాపు 30 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో కరువు ఏర్పడినప్పుడు మా వంశస్తులు నిర్మించిన భోజరాజు బావి ప్రజల దాహార్తిని తీర్చింది. ప్రస్తుతం 15 ఎకరాల వ్యవసాయ భూమికి ఈ బావి నీరే ఆధారమైంది
--విజయ రామరాజు జమేదార్ మద్దికెర
పి.ఎస్.శ్రీనివాసులు నాయుడు, కర్నూలు డెస్క్
టి.వెంకటేశ్వర్లు, మద్దికెర
(చదవండి: ఈ తిను 'బండారం' గురించి తెలుసుకోండి..! హెచ్చరిస్తున్న వైద్యులు)
Comments
Please login to add a commentAdd a comment