జూపాడు బంగ్లా (కర్నూలు) : ఆ వృద్ధుడి వయసు 90 ఏళ్లు. భార్య ఆరు నెలల క్రితమే మరణించింది. ఉండడానికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కానీ ఏం లాభం...! వృద్ధాప్యంలో తన ఆలనాపాలనా చూసేవారు కానరాకపోవడంతో మనస్తాపానికి గురైన ఆ వృద్ధుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా మండలం బన్నూరు గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన శీనయ్య (90) బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.