కర్నూలులోని ట్రిపుల్ ఐటీడీఎంలో విద్యార్థి ఆత్మహత్య
హాస్టల్‌పై నుంచి దూకిన సాయికార్తీక్
తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే మృతి
ఒంటరితనమే కారణం అంటూ సూసైడ్ నోట్!
కర్నూలు సిటీ: కర్నూలులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ (ట్రిపుల్ ఐటీడీఎం)లో చదువుతున్న నల్ల సాయి కార్తీక్ నాయుడు(20) ఒంటరితనం కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. పార్వతీపురం మన్యం జిల్లా, జియ్యమ్మవలస మండలం, కుదమ గ్రామానికి చెందిన నల్ల వెంకట నాయుడు కుమారుడైన సాయికార్తీక్ ట్రిపుల్‌ఐటీడీఎంలో ఈసీఈ బ్రాంచ్‌తో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
శనివారం క్యాంపస్‌లోని కలాం హాస్టల్ భవనం 9వ అంతస్తు నుంచి దూకడంతో కుడి కాలు విరిగి, తలకు తీవ్ర గాయమై తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే చనిపోయాడు. క్యాంపస్‌కు వేసవి సెలవులు ముగిసి ఈ నెల 22 నుంచి క్లాసులు తిరిగి ప్రారంభమయ్యాయి. సాయి కార్తీక్ క్యాంపస్‌కి వచ్చినప్పటి నుంచి ఒంటరిగానే ఉంటూ మానసికంగా ఇబ్బంది పడే వాడని, సమస్య ఏంటో ఎవరికీ చెప్పలేదని తోటి విద్యార్థులు చెబుతున్నారు.
చదువులో ఒత్తిడి ఉంటే కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సైకాలజిస్టులు అందుబాటులో ఉన్నారని సిబ్బంది చెప్పారు. విద్యార్థి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పరిశీలించి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒంటరితనం, తాను చెప్పినా ఎవరు వినిపించుకోలేదని సూసైడ్ నోటులో రాసినట్లు సమాచారం. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment