నేనేమి చేశాను పాపం..!
విజయనగరం: మీరు కోరుకుంటేనే కడుపులో పడ్డాను. అమ్మ జోలపాట వినాలని, చేతి ముద్ద రుచి చూడాలని, నాన్న చేతిని పట్టుకుని నడవాలని ఆశ పడ్డాను. అమ్మ కడుపులోంచి ఎప్పుడు బయటకు వస్తానా అని ఎదురు చూశాను. నేనేమి చేశాను ప్రాపం..! నెలలు నిండక ముందే ఆయువు తుంచేశారు... ఆశలన్నీ చిదిమేశారు. బాహ్య ప్రపంచాన్ని చూపకుండానే అనంతలోకాలకు పంపించేశారు. అమ్మతనం.. నాన్న కమ్మదనాన్ని పంటి బిగువున నలిపేశారంటూ ఓ శిశువు మృత్యుఘోష చూపరులను కలచివేసింది.
విజయనగరంలోని ఓరిగంటివారి వీధి ఎస్సీ బాలికల హాస్టల్‌కు ఆనుకుని ఉన్న ప్రహారీ పక్కన ముళ్ల పొదల మాటున శనివారం సాయంత్రం ఓ ఆడ శిశువు దర్శనమిచ్చింది. అప్పుడే పుట్టినట్లు ఉన్న బిడ్డను చూసి స్థానికులు చలించిపోయారు. బిడ్డ చనిపోయి ఉండడంతో అయ్యో అంటూ నిట్టూర్చారు. ఎవరో తెచ్చి బిడ్డను పడేసి ఉంటారని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టూటౌన్ సీఐ ఇ. నర్సింగ మూర్తి ఘటనా స్థలానికి చేరుకుని శిశువును ఖననం చేయించారు.