
వైరల్ వీడియో: పుట్టీ పుట్టగానే నడక!
పిల్లలు నడక నేర్చుకోవాలంటే.. కనీసం ఏడాది వయసు రావాలి. మరీ చురుగ్గా ఉండే పిల్లలైతే తొమ్మిదో నెలలో కూడా నడుస్తారు. కానీ, ఈ వీడియోలో కనిపిస్తున్న గడుగ్గాయి మాత్రం పుట్టీ పుట్టగానే నడక మొదలుపెట్టేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మే 26న.. అంటే మూడు రోజుల క్రితం వీడియోను పోస్ట్ ఫేస్‌బుక్‌లో చేయగా, ఇప్పటికి 6.8 కోట్ల సార్లు దాన్ని చూశారు. 15 లక్షల సార్లు షేర్ అయింది. 3.25 లక్షల రియాక్షన్లు వచ్చాయి. అప్పుడే పుట్టిన శిశువును నర్సు చేత్తో పట్టుకోగా ముందు ఒక కాలు, తర్వాత మరో కాలు ఎత్తుతూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఈ 41 సెకండ్ల వీడియో ఉంది. అర్లెట్ అరాంటెస్ అనే వ్యక్తి బ్రెజిల్ నుంచి ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పెట్టారు. అయితే దీన్ని ఎప్పుడు, ఎక్కడ రికార్డు చేశారో మాత్రం తెలియడం లేదు.
ఈ విషయమై యూనివర్సిటీ ఆఫ్ రోషెస్టర్ మెడికల్ సెంటర్ ప్రతినిధులు స్పందించారు. ఇది మరీ వింత కాదని, అప్పుడే పుట్టినవారిలో కొంతమందిలో ఇలా కనిపిస్తుందని అన్నారు. దీన్ని 'స్టెప్పింగ్ రిఫ్లెక్స్' అంటారని, దీన్నే కొంతమంది నడకలా భావిస్తే మరికొందరు డాన్సు అనుకుంటారని చెప్పారు. చేతులతో పట్టుకుని వాళ్లను నిలబెడితే కాళ్లు ఒకేచోట ఉంచరని.. అలా అటూ ఇటూ కదిలిస్తుంటారని తెలిపారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ఒకరు ఈ బేబీ పేరు ఉసేన్ బోల్ట్ అని అంటే, మరొకరు 9 నెలల పయనం తర్వాత కాళ్లు చాపుతున్నాడు అన్నారు.