బెజవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చంటిబిడ్డ మాయం
* పసికందుతో ఆగంతకురాలు పరారీ
* బస్టాండ్‌లో మరో మహిళకు శిశువు అప్పగింత
* సీసీ కెమెరాల్లో చిక్కిన దృశ్యాలు
విజయవాడ(లబ్బీపేట): ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆసుపత్రుల నుంచి శిశువుల అపహరణ కొనసాగుతూనే ఉంది. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మరో ఉదంతం చోటుచేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే ప్రత్యేక నవజాత శిశు వైద్య విభాగంలో(ఎస్‌ఎన్‌సీయూ)లో చికిత్స పొందుతున్న ఐదు రోజుల మగశిశువును గుర్తు తెలియని మహిళ అపహరించుకుపోయింది. అనంతరం శిశువును బస్టాండ్‌లో మరో మహిళకు అప్పగించినట్లు పోలీసులు గుర్తించారు.
విజయవాడలో గురువారం జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. వన్‌టౌన్ పోతినవారి వీధిలో నివసించే ఐతా సుబ్రహ్మణ్యం, కల్యాణి దంపతులకుఈ నెల 9న మగశిశువు జన్మించాడు. ప్రసవం ప్రభుత్వాసుపత్రిలో జరగ్గా, 11న డిశ్చార్జి చేశారు. శిశువు కళ్లు పచ్చగా ఉండటంతో కామెర్లు సోకాయని భావించిన తల్లిదండ్రులు చికిత్స కోసం బుధవారం ఉదయం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ఎస్‌ఎన్‌సీయూలోని వార్మర్స్‌లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆ శిశువును గుర్తుతెలియని మహిళ ఉదయం 11 గంటల సమయంలో అపహరించుకుపోయింది. ఎస్‌ఎన్‌సీయూ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు, ప్రసూతి విభాగం వద్ద ఉన్న రెండంచెల సెక్యూరిటీని దాటుకుని శిశువుతో సహా ఉడాయించింది. ఆమె రెండు రోజులుగా ఆసుపత్రి ప్రాంగణంలోనే రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఆరు బృందాలతో గాలింపు
శిశువు అపహరణకు గురయ్యాడన్న విషయం తెలుసుకున్న అధికారులు ఉలిక్కిపడ్డారు. పోలీసులతోపాటు సబ్ కలెక్టర్ సృజన రంగంలోని దిగారు. శిశువు తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. బిడ్డను క్షేమంగా అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఆరు ప్రత్యేక బృందాలతో నగరంలో విస్తృతంగా గాలిస్తున్నామని, అన్ని పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేశామని సౌత్‌జోన్ ఏసీపీ కంచి శ్రీనివాసరావు చెప్పారు. గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.జగన్మోహనరావు, డీఎంఈ డాక్టర్ సుబ్బారావు, ఎస్‌ఎన్‌సీయూ ఇన్‌చార్జి డాక్టర్ ఎంఏ రెహమాన్, సిబ్బందిని విచారించారు.
చంద్రబాబు ఆరా..
సాక్షి, హైదరాబాద్: విజయవాడ పాత ప్రభుత్వ వైద్యశాలలో శిశువు అపహరణ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. రష్యా పర్యటనలో ఉన్న సీఎం గురువారం ఈ ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారని, సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారని సీఎం కార్యాలయం తెలిపింది.
బస్టాండ్‌లో శిశువు దృశ్యాలు లభ్యం
ఎస్‌ఎన్‌సీయూ నుంచి అపహరించిన మగ శిశువును ఆగంతకురాలు బస్టాండ్‌లో మరొకరికి విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. బస్టాండ్‌లో సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించగా ఉదయం 11.30 గంటల సమయంలో ఎర్రచీర కట్టుకున్న మహిళ శిశువును తీసుకెళ్లి మరో మహిళకు అప్పగించగా, ఆమె శిశువును తీసుకుని వెళ్లిపోయినట్లు తెలిసింది. పసిబిడ్డను తీసుకున్న మహిళ బస్సు ఎక్కలేదని, బస్టాండ్ బయటకు వెళ్లి కారులో గానీ, మరో వాహనంలో గానీ వెళ్లినట్లు గుర్తించారు. పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య అన్నారు. ఆమె గురువారం రాత్రి ప్రభుత్వాస్పత్రికి వచ్చి శిశువు తల్లిదండ్రులతో మాట్లాడారు. క్లూ దొరికింది కాబట్టి శిశువును గుర్తించి తల్లిదండ్రులకు అప్పగిస్తామన్నారు.