హైదరాబాద్ : శిశువు తారుమారు అయిన ఘటనపై కోఠి మెటర్నటీ ఆసుపత్రి ఆర్ఎంవో విద్యావతి బుధవారం హైదరాబాద్లో స్పందించారు. సమాచార లోపంతోనే ఈ వివాదం ఏర్పడిందన్నారు. ఈ వివాదంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. డీఎన్ఏ పరీక్ష జరిపి ఎవరి పిల్లల్ని వాళ్లకు అప్పగిస్తామన్నారు.
ప్రస్తుతం రజిత, రమాదేవి పిల్లలు మా సంరక్షణలోనే ఉన్నారని విద్యావతి పేర్కొన్నారు. ఆసుపత్రిలో పిల్లలను తారుమారు చేశారని ఆరోపిస్తూ.. రజిత కుటుంబ సభ్యులు మంగళవారం కోఠి మెటర్నిటీ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. సిబ్బందికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో ఆసుపత్రి ఎదుట ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.