RMO
-
అమ్మో..ఆ పోస్టు మాకొద్దు
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలోని రాష్ట్ర స్థాయి కోవిడ్ 19 ట్రీట్మెంట్ సెంటర్ (ప్రభుత్వాస్పత్రి) రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. అసలు ఆ కుర్చీలో మేము కూర్చోమంటూ సీనియర్ ప్రొఫెసర్లు సైతం చేతులెత్తేస్తున్నారు. దీంతో రెండు నెలలుగా పూర్తి స్థాయి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ లేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆర్ఎంఓ చూడాల్సిన బాధ్యతలను సైతం సూపరింటెండెంట్ చూసుకుంటున్నారు. కోవిడ్ ఆస్పత్రి నేపథ్యంలో నిత్యం రిపోర్టులు ఇవ్వడం, మృతదేహాలను క్రిమిటోరియంకు రోగుల పర్యవేక్షణ చూడాల్సిన ఆర్ఎంఓ లేక పోవడంతో పాలన క్లిష్టతరంగా మారింది. రెండు నెలల కిందట ఆర్ఎంఓ సరెండర్ కోవిడ్ 19 ట్రీట్మెంట్ సెంటర్‌కు సివిల్ సర్జన్ ఆర్ఎంఓగా పనిచేస్తున్న డాక్టర్ ఆర్. గీతాంజలిని రెండు నెలల కిందట సూపరింటెండెంట్ డాక్టర్ పి. నాంచారయ్య డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు సరెండర్ చేశారు. ఆమె ఇక్కడ ఐదేళ్లుగా పనిచేశారు. అయితే ఎందుకు సరెండర్ చేయాల్సి వచ్చిందనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. అయితే ఆదేశాల్లో మాత్రం పాలనా పరమైన చర్యల్లో భాగంగా సరెండర్ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఆమె ఏప్రిల్ మొదటి వారంలో రిలీవ్ అయ్యి వెళ్లి పోయారు. అప్పటినుంచి ఆర్ఎంఓ లేని పరిస్థితి నెలకొంది. ఇన్‌చార్జీలుగా ఉండని వైనం డాక్టర్ గీతాంజలిని సరెండర్ చేసిన తర్వాత పిడియాట్రిక్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ఎస్ విఠల్‌రావును ఇన్చార్జి ఆర్ఎంఓగా నియమించారు. ఆయన కొద్దికాలం యాక్టివ్గానే పనిచేశారు. తర్వాత ఏమి జరిగిందో ఏమో కానీ ఈ కుర్చీ నాకొద్దు అంటూ తన డిపార్ట్మెంట్కు వెళ్లిపోయారు. అనంతరం డెర్మటాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పెంచలయ్యకు ఇన్చార్జి ఇచ్చారు. ఆయన కూడా రెండు రోజులు ఆర్ఎంఓ చాంబర్లో కూర్చుని తర్వాత వారం రోజులు సెలవుపై వెళ్లారు. తర్వాత డ్యూటీకి వెళ్లినా తన విభాగంలో విధులకు వెళ్లారే కానీ ఆర్ఎంఓ సీటులోకి రాలేదు. తాజాగా మరో అసిస్టెంట్ సివిల్ సర్జన్‌కు ఇన్చార్జి ఇవ్వగా అమ్మో ఆ సీటు నాకొద్దు.. నేను కొద్దిరోజుల్లో పదవీ విరమణ చేయబోతున్నా అంటూ నిరాకరించినట్లు తెలిసింది. ఆర్ఎంఓగా వచ్చేందుకు అనాసక్తి సాధారణంగా విజయవాడ లాంటి ఆస్పత్రిలో సివిల్ సర్జన్ పోస్టు ఖాళీగా ఉంటే దానిని దక్కించుకునేందుకు పోటీ పడతారు. కానీ ఇక్కడ రెండు నెలలుగా పోస్టు ఖాళీగా ఉన్నా ఇక్కడకు వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కోవిడ్ ఆస్పత్రితో పాటు పాలనా పరమైన ఇబ్బందులు ఎదురవుతుండటంతో వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. అంతేకాదు నాలుగు నెలల కిందట డెప్యూటీ ఆర్ఎంఓగా పనిచేస్తున్న డాక్టర్ సతీష్‌కుమార్ సివిల్ సర్జన్ పదోన్నతిపై గుంటూరు ఆర్ఎంఓగా వెళ్లారు. ఆయన స్థానంలో కూడా ఎవరూ వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో అసలు ఏమి జరుగుతుందోనని బయట చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రభుత్వాస్పత్రిపై దృష్టి సారించి పాలనా పరమైన ఇబ్బందులు సరిచేయడంతో పాటు, ఆర్‌ఎంఓల నియామకం చేయాల్సి ఉంది. -
ఆర్ఎంవోకే అందని వైద్యం
నిజామాబాద్: జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. సాక్షాత్తూ ఆ ఆస్పత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్(ఆర్ఎంవో) నరేందర్ కుమార్‌కే సకాలంలో వైద్యం అందలేదు. సోమవారం ఆయన డెంగీ జ్వరంతో ఆస్పత్రిలో చేరారు. బీపీ ఎక్కువైన సమయంలో డ్యూటీ డాక్టర్‌కు చెప్పినా ఆయన వెంటనే స్పందించలేదు. దీంతో తీవ్ర ఆగ్రహంతో డీఎంహెచ్‌వో, ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. కొందరు వైద్యుల కారణంగా ప్రభుత్వ ఆస్పత్రులకు చెడ్డపేరు వస్తోందని నరేందర్ కుమార్ ఆరోపించారు. -
నిలోఫర్ సూపరింటెండెంట్, ఆర్ఎంవోపై వేటు
• డీఎంఈకి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ • నిలోఫర్ కొత్త సూపరింటెండెంట్‌గా డాక్టర్ శైలజ నియామకం సాక్షి, హైదరాబాద్: నిలోఫర్ ఆసుపత్రిలో బాలింతల మరణాలకు బాధ్యులైన వారిపై వేటు పడింది. ప్రాథమిక విచారణ అనంతరం విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సి.సురేశ్‌కుమార్, ఆర్ఎంవో డాక్టర్ కె.ఉషారాణిలను ప్రభుత్వం విధులనుంచి తప్పించింది. వారిని వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ)కి సరెండర్ చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం వారిని సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు సుల్తాన్ బజార్ ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రి సూపరింటెం డెంట్ డాక్టర్ శైలజను అక్కడి నుంచి బదిలీ చేసి నిలోఫర్ కొత్త సూపరింటెండెంట్‌గా నియ మిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. నిలోఫర్‌లో గత నెల 28 నుంచి ఈ నెల 4 వరకు సిజేరియన్ విభాగంలో శస్త్రచికిత్స తర్వాత ఐదుగురు బాలింతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం... జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టింది. మరింత మందిపై చర్యలు... బాలింతల మరణాలపై దర్యాప్తు కోసం జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా అధ్యక్షతన నియమిం చిన విచారణ కమిటీ నివేదిక వచ్చాక మరి కొందరిపై వేటు పడే అవకాశం ఉన్నట్లు వైద్య ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కలెక్టర్ ఆధ్వర్యంలోని విచారణ కమిటీ నిలోఫర్ ఆసుపత్రిని సందర్శించింది. లేబర్ వార్డులోని ఆపరేషన్ థియేటర్లు, అక్కడి రికార్డులు, మందులు, ఇంజక్షన్లను పరిశీలిం చింది. ఆసుపత్రిలో చేరే సమయానికి బాలిం తల ఆరోగ్య పరిస్థితి, వారికి చేసిన చికిత్సలు, సర్జరీ సమయంలో తలెత్తిన సమస్యలు, బాలింతలకు ఎక్కించిన రక్తం నమూనాలు, వగైరా అంశాలపై ఆరా తీసింది. నివేదిక కోసం ప్రభుత్వం వేచి చూస్తోంది. -
'డీఎన్ఏ పరీక్ష జరిపి ఎవరి పిల్లల్ని వాళ్లకి అప్పగిస్తాం'
హైదరాబాద్ : శిశువు తారుమారు అయిన ఘటనపై కోఠి మెటర్నటీ ఆసుపత్రి ఆర్ఎంవో విద్యావతి బుధవారం హైదరాబాద్‌లో స్పందించారు. సమాచార లోపంతోనే ఈ వివాదం ఏర్పడిందన్నారు. ఈ వివాదంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. డీఎన్ఏ పరీక్ష జరిపి ఎవరి పిల్లల్ని వాళ్లకు అప్పగిస్తామన్నారు. ప్రస్తుతం రజిత, రమాదేవి పిల్లలు మా సంరక్షణలోనే ఉన్నారని విద్యావతి పేర్కొన్నారు. ఆసుపత్రిలో పిల్లలను తారుమారు చేశారని ఆరోపిస్తూ.. రజిత కుటుంబ సభ్యులు మంగళవారం కోఠి మెటర్నిటీ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. సిబ్బందికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో ఆసుపత్రి ఎదుట ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. -
నీళ్లు లేక ఉస్మానియాలో ఆగిన ఆపరేషన్లు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో నీరు లేకపోవడంతో శనివారం పలు శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. శస్త్రచికిత్స సమయంలో చేతులు శుభ్రం చేసుకునేందుకు నీరు లేక ఏకంగా నాలుగు ఆపరేషన్ థియేటర్లకు తాళాలు బిగించారు. ఫలితంగా 50కి పైగా శస్త్రచికిత్సలు వాయిదా పడ్డాయి. దీంతో తెల్లవారుజామునే ఆపరేషన్ థియేటర్ల వద్దకు చేరుకున్న రోగులకు తీవ్ర నిరాశే మిగిలింది. అంతేకాదు మూత్రశాలలు, మరుగుదొడ్లకు గత మూడు రోజుల నుంచి నీరు సరఫరా కావడం లేదు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, ఇతర రోగులు, వారికి సహాయంగా వచ్చిన బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసన భరించలేక వైద్యులు కూడా అటువైపు వెళ్లడానికి భయపడుతున్నారు. రోజుకు 50 లక్షల లీటర్లు అవసరం: ఆస్పత్రి ఔట్‌పేషంట్ విభాగానికి ప్రతిరోజూ 2,000-2,500 మంది రోగులు వస్తుంటారు. ఇన్‌పేషంట్ విభాగాల్లో నిత్యం 1,500 మంది చికిత్స పొందుతుంటారు. వైద్యులు మరో 200 ఉంటారు. ప్రతి రోజు 150-200 శస్త్రచికి త్సలు జరుగుతుంటాయి. రోజుకు 50 లక్షల లీటర్ల నీరు అవసరం కాగా 29.47 లక్షల లీటర్లు సరఫరా అవుతోంది. వీటిని 14 ట్యాంకుల్లో నిల్వ చేస్తున్నారు. ట్యాంకులకు మూతల్లేక పావురాల మలవిసర్జన నీటిపై తేలియాడుతోంది. ట్యాంకుల్ని 15 రోజులకోసారి శుభ్రం చేయాల్సి ఉన్నా నెలకోసారీ చేయడం లేదు. పది మంది ఆర్ఎంవోలున్నా..: పంపింగ్ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఎప్పటికప్పుడు ట్యాంకులను క్లీన్ చేయడంతో పాటు నీటి సరఫరా, నిల్వలను పరిశీలించాలి. కానీ వీరెవరూ కూర్చున్న కుర్చీలో నుంచి కదలడం లేదు. పది మంది ఆర్ఎంవోలు పని చేస్తున్నా.. వీరు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకున్నా కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు పుచ్చుకుని వంద శాతం మార్కులు వేస్తుండటం కొసమెరుపు. -
ఆర్వీఎం పీవో రేసులో ముగ్గురు!
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో కీలకమైన పోస్టు ఏదైనా ఖాళీ అయితే.. దాన్ని దక్కించుకునేందుకు వెంటనే ప్రయత్నాలు, పైరవీలు ప్రారంభమైపోతాయి. అర్హతలతోపాటు రాజకీయ పలుకుబడి, సామాజికవర్గం మద్దతు ఉన్నవారు సాధారణంగా అందలం ఎక్కేస్తుంటారు. ప్రస్తుతం జిల్లా రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం-ఎస్ఎస్ఏ) పీవో పోస్టు కోసం ముగ్గురు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పీవోగా పనిచేస్తున్న బి.నగేష్‌కు విశాఖపట్నం బదిలీ కావటంతో ఖాళీ అయిన ఈ పోస్టు కోసం గట్టిగా పోటీ పడుతున్నారు. వీరిలో ఇద్దరు విద్యాశాఖ అధికారులు కాగా ఒకరు మత్స్యశాఖ అధికారి కావటం విశేషం. ఇద్దరికి గతంలో ఆర్వీఎం పీవోగాపనిచేసిన అనుభవం కూడా ఉంది. రాజకీయ పలుకుబడి, సామాజికవర్గం మద్దతుతో ఇద్దరు అధికారులు తమ యత్నాలను ముమ్మరం చేయగా అవేమీ లేని మరొకరు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పోటీ పడుతున్నది వీరే..! ప్రస్తుతం డైట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న తిరుమల చైతన్య, శ్రీకాకుళం ఉప విద్యాశాఖాధికారి అబోతుల ప్రభాకరరావు, శ్రీకాకుళంలో మత్స్యశాఖ ఏడీగా పనిచేస్తూ పదోన్నతిపై విశాఖపట్నం డీడీగా వెళ్లిన పి.కోటేశ్వరరావులు పీవో పోస్టు కోసం యత్నిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. గతంలో ఆర్వీఎం పీవోగా పనిచేసిన తిరుమల చైతన్య అప్పట్లో కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు. బాల సాహిత్యం, పదో తరగతి పరీక్షలకు సంబంధించిన పుస్తకాల రూపకల్పన విషయంలో విమర్శల పాలయ్యారు. ఆయన హయాంలో కార్యాలయ సిబ్బంది మధ్య తరుచూ వివాదాలు చోటు చేసుకునేవి. రాజకీయ పలుకుబడి లేని ఆయన గత అనుభవం ప్రాతిపదికగా పోస్టు కోసం యత్నిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీకాకుళం ఉపవిద్యాశాఖాధికారిగా పనిచేస్తున్న అబోతుల ప్రభాకరరావు పీవో పోస్టు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. గతంలో వమరవల్లి డైట్లో ఉపన్యాసకులుగా పనిచేసిన ఆయన, అక్కడనుంచి విజయనగరం రాజీవ్ విద్యామిషన్ పీవోగా వెళ్లారు. ఉప విద్యాశాఖాధికారి బలివాడ మల్లేశ్వరరావు ఉద్యోగ విరమణ తర్వాత ఆయన స్థానంలో మళ్లీ జిల్లాకు వచ్చారు. ఈ జిల్లాకే చెందిన ఆయనకు బలమైన సామాజిక వర్గం అండదండలు, అధికార పార్టీ నేతల మద్దతు ఉంది. జిల్లాకు చెందిన మంత్రులతోపాటు విజయనగరానికి చెందిన నాయకుల సహాయాన్ని కూడా ఆయన కోరినట్టు తెలిసింది. ప్రస్తుతం విశాఖపట్నంలో మత్స్యశాఖ డీడీగా పనిచేస్తున్న పి.కోటేశ్వరరావు కూడా ఉన్నత స్థాయిలో యత్నాలు చేస్తున్నారు. మత్స్యశాఖ అధికారి అయిన ఆయన ఎక్కువకాలం ఇతర శాఖల్లోనే డిప్యుటేషన్‌పై పనిచేయటం గమనార్హం. శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఏపీడీగా చాలాకాలం పనిచేశారు. ఆ సమయంలో ఏసీలు, ఏపీఎంల బదిలీలు, పదోన్నతుల్లో చేతివాటానికి పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొన్నారు. పీడీని పక్కనబెట్టి చక్రం తిప్పారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఆయనకు అధికార పార్టీ మంత్రులు, నాయకుల మద్దతు పుష్కలంగా ఉందని సమాచారం. అయితే విద్యాశాఖకు ఇతర శాఖల ఉద్యోగులను డిప్యుటేషన్‌పై తీసుకోరాదని 2010-11లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అడ్డంకి కావచ్చని కొందరు అంటున్నారు. కానీ ఈ జీవో అమలయ్యే దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. ప్రస్తుతం బదిలీపై వెళ్లిన నగేష్ కూడా విద్యాశాఖ అధికారి కాదు. ఈ పరిణామాల నేపథ్యంలో పీవోగా ఎవరు నియమితులవుతారోనని విద్యాశాఖ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.