నిలోఫర్ సూపరింటెండెంట్, ఆర్‌ఎంవోపై వేటు
• డీఎంఈకి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ
• నిలోఫర్ కొత్త సూపరింటెండెంట్‌గా డాక్టర్ శైలజ నియామకం
సాక్షి, హైదరాబాద్: నిలోఫర్ ఆసుపత్రిలో బాలింతల మరణాలకు బాధ్యులైన వారిపై వేటు పడింది. ప్రాథమిక విచారణ అనంతరం విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సి.సురేశ్‌కుమార్, ఆర్‌ఎంవో డాక్టర్ కె.ఉషారాణిలను ప్రభుత్వం విధులనుంచి తప్పించింది. వారిని వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ)కి సరెండర్ చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం వారిని సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి.
మరోవైపు సుల్తాన్ బజార్ ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రి సూపరింటెం డెంట్ డాక్టర్ శైలజను అక్కడి నుంచి బదిలీ చేసి నిలోఫర్ కొత్త సూపరింటెండెంట్‌గా నియ మిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. నిలోఫర్‌లో గత నెల 28 నుంచి ఈ నెల 4 వరకు సిజేరియన్ విభాగంలో శస్త్రచికిత్స తర్వాత ఐదుగురు బాలింతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం... జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టింది.
మరింత మందిపై చర్యలు...
బాలింతల మరణాలపై దర్యాప్తు కోసం జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా అధ్యక్షతన నియమిం చిన విచారణ కమిటీ నివేదిక వచ్చాక మరి కొందరిపై వేటు పడే అవకాశం ఉన్నట్లు వైద్య ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కలెక్టర్ ఆధ్వర్యంలోని విచారణ కమిటీ నిలోఫర్ ఆసుపత్రిని సందర్శించింది. లేబర్ వార్డులోని ఆపరేషన్ థియేటర్లు, అక్కడి రికార్డులు, మందులు, ఇంజక్షన్లను పరిశీలిం చింది. ఆసుపత్రిలో చేరే సమయానికి బాలిం తల ఆరోగ్య పరిస్థితి, వారికి చేసిన చికిత్సలు, సర్జరీ సమయంలో తలెత్తిన సమస్యలు, బాలింతలకు ఎక్కించిన రక్తం నమూనాలు, వగైరా అంశాలపై ఆరా తీసింది. నివేదిక కోసం ప్రభుత్వం వేచి చూస్తోంది.