నీళ్లు లేక ఉస్మానియాలో ఆగిన ఆపరేషన్లు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో నీరు లేకపోవడంతో శనివారం పలు శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. శస్త్రచికిత్స సమయంలో చేతులు శుభ్రం చేసుకునేందుకు నీరు లేక ఏకంగా నాలుగు ఆపరేషన్ థియేటర్లకు తాళాలు బిగించారు. ఫలితంగా 50కి పైగా శస్త్రచికిత్సలు వాయిదా పడ్డాయి. దీంతో తెల్లవారుజామునే ఆపరేషన్ థియేటర్ల వద్దకు చేరుకున్న రోగులకు తీవ్ర నిరాశే మిగిలింది. అంతేకాదు మూత్రశాలలు, మరుగుదొడ్లకు గత మూడు రోజుల నుంచి నీరు సరఫరా కావడం లేదు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, ఇతర రోగులు, వారికి సహాయంగా వచ్చిన బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసన భరించలేక వైద్యులు కూడా అటువైపు వెళ్లడానికి భయపడుతున్నారు.
రోజుకు 50 లక్షల లీటర్లు అవసరం: ఆస్పత్రి ఔట్‌పేషంట్ విభాగానికి ప్రతిరోజూ 2,000-2,500 మంది రోగులు వస్తుంటారు. ఇన్‌పేషంట్ విభాగాల్లో నిత్యం 1,500 మంది చికిత్స పొందుతుంటారు. వైద్యులు మరో 200 ఉంటారు. ప్రతి రోజు 150-200 శస్త్రచికి త్సలు జరుగుతుంటాయి. రోజుకు 50 లక్షల లీటర్ల నీరు అవసరం కాగా 29.47 లక్షల లీటర్లు సరఫరా అవుతోంది. వీటిని 14 ట్యాంకుల్లో నిల్వ చేస్తున్నారు. ట్యాంకులకు మూతల్లేక పావురాల మలవిసర్జన నీటిపై తేలియాడుతోంది. ట్యాంకుల్ని 15 రోజులకోసారి శుభ్రం చేయాల్సి ఉన్నా నెలకోసారీ చేయడం లేదు.
పది మంది ఆర్‌ఎంవోలున్నా..: పంపింగ్ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఎప్పటికప్పుడు ట్యాంకులను క్లీన్ చేయడంతో పాటు నీటి సరఫరా, నిల్వలను పరిశీలించాలి. కానీ వీరెవరూ కూర్చున్న కుర్చీలో నుంచి కదలడం లేదు. పది మంది ఆర్‌ఎంవోలు పని చేస్తున్నా.. వీరు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకున్నా కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు పుచ్చుకుని వంద శాతం మార్కులు వేస్తుండటం కొసమెరుపు.