ఆర్వీఎం పీవో రేసులో ముగ్గురు!
Published Fri, Jan 3 2014 4:50 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో కీలకమైన పోస్టు ఏదైనా ఖాళీ అయితే.. దాన్ని దక్కించుకునేందుకు వెంటనే ప్రయత్నాలు, పైరవీలు ప్రారంభమైపోతాయి. అర్హతలతోపాటు రాజకీయ పలుకుబడి, సామాజికవర్గం మద్దతు ఉన్నవారు సాధారణంగా అందలం ఎక్కేస్తుంటారు. ప్రస్తుతం జిల్లా రాజీవ్ విద్యామిషన్(ఆర్‌వీఎం-ఎస్‌ఎస్‌ఏ) పీవో పోస్టు కోసం ముగ్గురు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పీవోగా పనిచేస్తున్న బి.నగేష్‌కు విశాఖపట్నం బదిలీ కావటంతో ఖాళీ అయిన ఈ పోస్టు కోసం గట్టిగా పోటీ పడుతున్నారు. వీరిలో ఇద్దరు విద్యాశాఖ అధికారులు కాగా ఒకరు మత్స్యశాఖ అధికారి కావటం విశేషం. ఇద్దరికి గతంలో ఆర్‌వీఎం పీవోగాపనిచేసిన అనుభవం కూడా ఉంది. రాజకీయ పలుకుబడి, సామాజికవర్గం మద్దతుతో ఇద్దరు అధికారులు తమ యత్నాలను ముమ్మరం చేయగా అవేమీ లేని మరొకరు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
పోటీ పడుతున్నది వీరే..!
ప్రస్తుతం డైట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న తిరుమల చైతన్య, శ్రీకాకుళం ఉప విద్యాశాఖాధికారి అబోతుల ప్రభాకరరావు, శ్రీకాకుళంలో మత్స్యశాఖ ఏడీగా పనిచేస్తూ పదోన్నతిపై విశాఖపట్నం డీడీగా వెళ్లిన పి.కోటేశ్వరరావులు పీవో పోస్టు కోసం యత్నిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. గతంలో ఆర్‌వీఎం పీవోగా పనిచేసిన తిరుమల చైతన్య అప్పట్లో కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు. బాల సాహిత్యం, పదో తరగతి పరీక్షలకు సంబంధించిన పుస్తకాల రూపకల్పన విషయంలో విమర్శల పాలయ్యారు. ఆయన హయాంలో కార్యాలయ సిబ్బంది మధ్య తరుచూ వివాదాలు చోటు చేసుకునేవి. రాజకీయ పలుకుబడి లేని ఆయన గత అనుభవం ప్రాతిపదికగా పోస్టు కోసం యత్నిస్తున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం శ్రీకాకుళం ఉపవిద్యాశాఖాధికారిగా పనిచేస్తున్న అబోతుల ప్రభాకరరావు పీవో పోస్టు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. గతంలో వమరవల్లి డైట్‌లో ఉపన్యాసకులుగా పనిచేసిన ఆయన, అక్కడనుంచి విజయనగరం రాజీవ్ విద్యామిషన్ పీవోగా వెళ్లారు. ఉప విద్యాశాఖాధికారి బలివాడ మల్లేశ్వరరావు ఉద్యోగ విరమణ తర్వాత ఆయన స్థానంలో మళ్లీ జిల్లాకు వచ్చారు. ఈ జిల్లాకే చెందిన ఆయనకు బలమైన సామాజిక వర్గం అండదండలు, అధికార పార్టీ నేతల మద్దతు ఉంది. జిల్లాకు చెందిన మంత్రులతోపాటు విజయనగరానికి చెందిన నాయకుల సహాయాన్ని కూడా ఆయన కోరినట్టు తెలిసింది.
ప్రస్తుతం విశాఖపట్నంలో మత్స్యశాఖ డీడీగా పనిచేస్తున్న పి.కోటేశ్వరరావు కూడా ఉన్నత స్థాయిలో యత్నాలు చేస్తున్నారు. మత్స్యశాఖ అధికారి అయిన ఆయన ఎక్కువకాలం ఇతర శాఖల్లోనే డిప్యుటేషన్‌పై పనిచేయటం గమనార్హం. శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఏపీడీగా చాలాకాలం పనిచేశారు. ఆ సమయంలో ఏసీలు, ఏపీఎంల బదిలీలు, పదోన్నతుల్లో చేతివాటానికి పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొన్నారు. పీడీని పక్కనబెట్టి చక్రం తిప్పారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఆయనకు అధికార పార్టీ మంత్రులు, నాయకుల మద్దతు పుష్కలంగా ఉందని సమాచారం. అయితే విద్యాశాఖకు ఇతర శాఖల ఉద్యోగులను డిప్యుటేషన్‌పై తీసుకోరాదని 2010-11లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అడ్డంకి కావచ్చని కొందరు అంటున్నారు. కానీ ఈ జీవో అమలయ్యే దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. ప్రస్తుతం బదిలీపై వెళ్లిన నగేష్ కూడా విద్యాశాఖ అధికారి కాదు. ఈ పరిణామాల నేపథ్యంలో పీవోగా ఎవరు నియమితులవుతారోనని విద్యాశాఖ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
Advertisement
Advertisement