PO
-
ఉద్యమస్థాయిలో కృషి చేద్దాం
–ప్రభుత్వ బడుల్లో చిన్నారుల చేరికలు పెంచుదాం –సర్వ శిక్షాభియాన్ పీవో శేషగిరి భానుగుడి(కాకినాడ సిటీ) : ప్రభుత్వ పాఠశాలల్లో అమలయ్యే కేంద్ర, రాష్ట్ర ప«థకాలను వివరించి విద్యార్థుల తల్లిదండ్రులను చైతన్యపరిచేందుకు ఉద్యమస్థాయిలో పనిచేయాలని సర్వశిక్షాభియాన్ పీవో మేకా శేషగిరి కోరారు. ‘ప్రభుత్వ బడి–అమ్మ ఒడి, పదితర్వాత పెళ్ళి కాదు 11’ కార్యక్రమాలపై సర్వశిక్షాభియాన్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయిలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక, బడిబయట పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా ఐక్యంగా పనిచేయాలని ఉపాధ్యాయులకు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సిబ్బందికి, ఐఈఆర్టీలకు సూచించారు. ఇన్చార్జి డీఈవో ఎస్.అబ్రహాం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు చాలా మెరుగుపడ్డాయని, వసతులు, విద్యాభివృధ్ధి పథకాలలో ప్రైవేటు పాఠశాలలకు అందనంత స్థాయిలో ప్రభుత్వపాఠశాలలు ఉన్నాయని చెప్పారు. తల్లిదడ్రులు అవగాహనారాహిత్యంతోనే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల ఉచ్చులో పడుతున్నారన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ఎల్కేజీ విద్యను పూర్తిచేసుకున్న చిన్నారులకు వర్సిటీ స్నాతకోత్సవం రీతిలో పట్టాలు ప్రదానం చేశారు. డీఈవో కార్యాలయం నుంచి బాలాజీచెరువు వరకు ర్యాలీ నిర్వహించారు. ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ శారదాదేవి, వివిధ మండలాల ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఐఈఆర్టీలు, అంగన్వాడీలు, సర్వశిక్షాభియాన్ సిబ్బంది పాల్గొన్నారు. -
పకడ్బందీగా పీసా చట్టం అమలు
సీతంపేట: పీసా చట్టం పకడ్బందీగా అమలు చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్ ఆదేశించారు. సీతంపేటలో షెడ్యూల్డ్ ఏరియా పంచాయతీలకు రెండు రోజుల పాటు జరగనున్న పీసాచట్టం అవగాహన సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులపై గ్రామసభల్లో తీర్మాన చేయాల్సిన అవసరం ఉందన్నారు. రేషన్‌షాపులు ఏర్పాటు చేయాలన్నా, ప్రభుత్వం నుంచి పథకాలు రావాల్సి ఉన్నా పీసా అనుమతి తప్పని సరిగా తీసుకుంటేనే దానికి చట్టబద్ధత ఉంటుందన్నారు. మైనింగ్, గనుల తవ్వకాలు చేపట్టాలంటే తప్పనిసరిగా అనుమతి ఉండాలని చెప్పారు. సదస్సులో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో ఉరిటి రాధాకృష్ణన్, రిసోర్స్ పర్సన్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
మండలస్థాయిలో అదనపు నీటి లభ్యతను గుర్తించాలి
ఐటీడీఏ పీవో ఏఎస్ దినేష్‌కుమార్ రంపచోడవరం : వ్యవసాయం, అనుబంధ రంగాల సమన్వయంతో పురోగతి సాధించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఐటీడీఏ పీవో ఏఎస్ దినేష్‌కుమార్ తెలిపారు. వ్యవసాయ, అనుబంధ శాఖలతో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ మండలస్థాయిలో అదనపు నీటి లభ్యతను గుర్తిస్తే ఎక్కువ విస్తీర్ణంలో సాగుకు వీలు కలుగుతుందన్నారు. రైతులను భూసార పరీక్షలు చేయించి సూక్ష్మ పోషకాలందించి అధిక దిగుబడిని సాధించేలా చైతన్యం చేయాలన్నారు. ఏజెన్సీలోని చెక్‌డ్యామ్‌లకు మరమ్మతులు చేయించి పూర్తిగా వినియోగంలోకి తెస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న మధ్య తరహా నీటి ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టు స్థిరీకరణ అవకాశాలను మెరుగుపర్చాలన్నారు. వ్యవసాయశాఖ ఏడీఏ రాబర్ట్‌పాల్, శ్రీనివాస్‌రెడ్డి , ఏపీడీ వై శంకర్‌నాయక్, పీహెచ్ఓ బి.శ్రీనివాసులు, ఈఈ వెంకటేశ్వర్లు, మైక్రో ఇరిగేషన్ పీడీ సుబ్బారావు, కేవీకే కో ఆర్డినేటర్ శ్రీనివాసు, పీఏఓ నాగమణి తదితరులు పాల్గొన్నారు. కాగా నోడల్ ఏజెన్సీలో ఉన్న పెండింగ్ సమస్యలను గిరిజన సబ్‌ప్లాన్‌లో పరిష్కరించాలని ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు ఎన్.స్టాలిన్‌బాబు పీవో దినేష్‌కుమార్‌ను కోరారు. టీఎస్పీ కింద గిరిజనాభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం 2017–24 వరకు గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం టీఎస్పీ కింద రాష్ట్రంలో పలు కార్యక్రమాలు అమలు చేస్తుందని పీవో దినేష్‌కుమార్ చెప్పారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో టీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి నాబార్డు కన్సల్టెన్సీ ప్రతినిధులు బుధవారం సంప్రదింపులు జరిపినట్లు పీవో తెలిపారు. -
ఏమిటీ డ్రామా..?
సాక్షిప్రతినిధి, నల్లగొండ :జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) పరిధిలో అమలవుతున్న సమగ్ర నీటి యాజమాన్య ప్రాజెక్టు (ఐడబ్ల్యూఎంపీ) అవినీతికి చిరునామాగా మారుతోంది. ఉన్నతాధికారుల పట్టింపులేనితనం... ద్వితీయ శ్రేణి అధికారుల కుమ్మక్కు ఫలితంగా ప్రాజెక్టు అధికారుల్లో కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న అధికారులు కొందరు తమ సొంత వాహనాల్లోనే తిరుగుతూ బినామీ పేర్లపై బిల్లులు ఎత్తుతున్నారు. ఒకవేళ వాహనం ఎవరిదైతేనేమి, ఎలాగూ ఏదో ఒక వాహనాన్ని అద్దెకు తీసుకోవాల్సిందే కదా అని సమాధానపరిచే మాటలు మాట్లాడినా.. తిరుగుతున్న కిలోమీటర్లలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. చూడడానికి చిన్నవిషయంగా కనిపిస్తున్నా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమవుతుందనే ఆరోపణలు వినవస్తున్నాయి. డ్వామా పరిధిలో అమలవుతున్న సమగ్ర నీటి యాజమాన్య ప్రాజెక్టులో భాగంగా వాటర్‌షెడ్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. వీటి పర్యవేక్షణకు జిల్లాలో 9 ప్రాజెక్టులున్నాయి. ఈ తొమ్మిది ప్రాజెక్టుల్లో ప్రాజెక్టు అధికారుల (పీఓ)కు ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పించింది. నెలకు 2500 కిలోమీటర్ల పరిమితితో రూ.24వేలు అద్దె చెల్లించేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే వీరిలో అత్యధికులు తమ సొంతూళ్ల నుంచి పనిచేసే చోటుకు నిత్యం వస్తూ పోతున్నారు. వాస్తవానికి పనిచేసే చోటే నివాసం ఉండాలి. కానీ, నిత్యం తిరగడం వల్ల వాహనాలు తిరిగే కిలోమీటర్లు పెరిగిపోతున్నాయి. తమ సొంత వాహనాలకు బినామీ పేర్ల మీద కొందరు బిల్లులు ఎత్తేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారంలో పీఓలకు డ్వామాలోని ఓ ద్వితీయశ్రేణి అధికారి అండదండలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. నల్లగొండ పీఓ వినియోగిస్తున్న వాహన యజమాని పేరు జలందర్‌రెడ్డి కాగా, అద్దె మాత్రం పి.కృపాదానం అనే వ్యక్తి పేరున చెల్లించారు. ఆరా తీస్తే సదరు కృపాదానం అనే వ్యక్తి కూతురే నల్లగొండ పీఓ అని తేలింది. ఈ వాహనం తిరిగిన కిలోమీటర్ల రీడింగుల్లోనూ అన్నీ తప్పులే. నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఎదురు సందులో ఉన్న పీఓ కార్యాలయం నుంచి తెలుగు మహిళా ప్రాంగణ సమీపంలోని డ్వామా ఆఫీసులో అడిషనల్ పీడీ సమావేశానికి వెళ్లి రావడానికి 30 కిలోమీటర్లు తిరిగినట్లు ఒక రోజు, మరో రోజు ఏకంగా 45 కిలోమీటర్లు చూపించారు. నల్లగొండ నుంచి కనగల్ ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి రావడానికి 72 కిలోమీటర్లు, అదే తహసీల్దార్ కార్యాలయానికి అయితే ఏకంగా 98 కిలోమీటర్ల రీడింగ్ చూపించారు. ఒకే ఊళ్లో ఉన్న రెండు ఆఫీసుల మధ్య దూరం 26 కిలోమీటర్లు ఉంటుందా అన్నది అధికారులకే తెలియాలి. కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిప్పర్తికి మన టీవీ కార్యక్రమం కోసం వెళ్లి రావడానికి 68 కిలోమీటర్లు అయ్యిందట. దేవరకొండ పీఓ వాహన రీడింగుల్లోనూ కావాల్సినన్ని తప్పులు ఉన్నాయి. దేవరకొండ నుంచి నల్లగొండ ఆఫీసుకు మీటింగ్‌కు వచ్చిపోతే ఏకంగా 210 కిలోమీటర్లు తిరిగినట్లు రీడింగ్ చూపించారు. కానీ దేవరకొండ నుంచి నల్లగొండకు మహా అయితే 55 కిలోమీటర్లు మాత్రమే. ఇక, దేవరకొండ నుంచి హైదరాబాద్ ఆఫీసుకు సమావేశాల నిమిత్తం వెళ్లి వస్తే 350 కిలోమీటర్ల రీడింగ్ రాశారు. వాస్తవానికి దేవరకొండ నుంచి హైదరాబాద్ కేవలం 107 కిలోమీటర్లు. అప్ అండ్ డౌన్, లోకల్‌గా తిరిగినా 250కిలోమీటర్లు దాటకూడదు. నాంపల్లి పీఓ సైతం ఒకే గ్రామాలకు వేర్వేరు తేదీల్లో ప్రయాణించి కిలోమీటర్లు వేర్వేరుగా చూపించారు. తేదీలు మారితే, నెల మారితే తిరిగిన దూరం కూడా మారిపోయింది. కుర్మేడు, వింజమూరుకు వె ళ్లి నాంపల్లికి తిరిగి రావడానికి ఒకసారి 126 కి.మీ., ఇవే గ్రామాలకు మరో రోజు 195 కి.మీ.గా పేర్కొన్నారు. అదే మాదిరిగా, తక్కల్లపల్లి, కుర్మేడుకు పోయిరావడానికి ఒకసారి 2కి.మీ, ఇదే గ్రామాలకు మరోసారి 194కి.మీగా చూపించారు. ఇదేలా సాధ్యమో వారికే తెలియాలి..ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. కోట్లాది రూపాయల వ్యయంతో చేపడుతున్న వాటర్ షెడ్ కార్యక్రమాల్లో నిధుల దుర్వినియోగం దండిగా జరుగుతోం దన్న ఆరోపణలకు వాహనాల అద్దె చెల్లింపులు, సొంత వాహనాల్లో తిరుగుతూ ఇష్టానుసారం రాస్తు న్న రీడింగులు ఓ ఉదాహరణగా నిలుస్తున్నాయి. పనిచేసేది ఒకచోట... ఉండేది మరోచోట నల్లగొండ ప్రాజెక్టు అధికారి హైదరాబాద్ నుంచి నల్లగొండకు రాకపోకలు సాగిస్తున్నారు. తిప్పర్తి ప్రాజెక్టు అధికారి మోత్కూరు నుంచి నిత్యం వచ్చి పోతున్నారు. దేవరకొండ పీఓ సైతం మోత్కూరు నుంచి దేవరకొండ షటిల్ సర్వీసు చేస్తున్నారు. నాంపల్లి ప్రాజెక్టు అధికారి హైదరాబాద్ నుంచి అప్‌డౌన్ చేస్తున్నారు. ఇలా నిత్యం తిరగడానికి వారు వాడుతోంది అద్దె (సొంత) వాహనాలే. క్షేత్ర స్థాయి పర్యటనలకు మాత్రమే వినియోగించాల్సిన వాహనాలను సొంతానికి వాడుతూ వేలాది రూపాయలు బిల్లుల రూపం లో తీసుకుంటున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం మేరకు ఐడబ్ల్యూఎంపీ పీఓల చేతివాటం ఔరా అనిపిస్తోంది. -
ఆర్వీఎం పీవో రేసులో ముగ్గురు!
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో కీలకమైన పోస్టు ఏదైనా ఖాళీ అయితే.. దాన్ని దక్కించుకునేందుకు వెంటనే ప్రయత్నాలు, పైరవీలు ప్రారంభమైపోతాయి. అర్హతలతోపాటు రాజకీయ పలుకుబడి, సామాజికవర్గం మద్దతు ఉన్నవారు సాధారణంగా అందలం ఎక్కేస్తుంటారు. ప్రస్తుతం జిల్లా రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం-ఎస్ఎస్ఏ) పీవో పోస్టు కోసం ముగ్గురు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పీవోగా పనిచేస్తున్న బి.నగేష్‌కు విశాఖపట్నం బదిలీ కావటంతో ఖాళీ అయిన ఈ పోస్టు కోసం గట్టిగా పోటీ పడుతున్నారు. వీరిలో ఇద్దరు విద్యాశాఖ అధికారులు కాగా ఒకరు మత్స్యశాఖ అధికారి కావటం విశేషం. ఇద్దరికి గతంలో ఆర్వీఎం పీవోగాపనిచేసిన అనుభవం కూడా ఉంది. రాజకీయ పలుకుబడి, సామాజికవర్గం మద్దతుతో ఇద్దరు అధికారులు తమ యత్నాలను ముమ్మరం చేయగా అవేమీ లేని మరొకరు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పోటీ పడుతున్నది వీరే..! ప్రస్తుతం డైట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న తిరుమల చైతన్య, శ్రీకాకుళం ఉప విద్యాశాఖాధికారి అబోతుల ప్రభాకరరావు, శ్రీకాకుళంలో మత్స్యశాఖ ఏడీగా పనిచేస్తూ పదోన్నతిపై విశాఖపట్నం డీడీగా వెళ్లిన పి.కోటేశ్వరరావులు పీవో పోస్టు కోసం యత్నిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. గతంలో ఆర్వీఎం పీవోగా పనిచేసిన తిరుమల చైతన్య అప్పట్లో కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు. బాల సాహిత్యం, పదో తరగతి పరీక్షలకు సంబంధించిన పుస్తకాల రూపకల్పన విషయంలో విమర్శల పాలయ్యారు. ఆయన హయాంలో కార్యాలయ సిబ్బంది మధ్య తరుచూ వివాదాలు చోటు చేసుకునేవి. రాజకీయ పలుకుబడి లేని ఆయన గత అనుభవం ప్రాతిపదికగా పోస్టు కోసం యత్నిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీకాకుళం ఉపవిద్యాశాఖాధికారిగా పనిచేస్తున్న అబోతుల ప్రభాకరరావు పీవో పోస్టు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. గతంలో వమరవల్లి డైట్లో ఉపన్యాసకులుగా పనిచేసిన ఆయన, అక్కడనుంచి విజయనగరం రాజీవ్ విద్యామిషన్ పీవోగా వెళ్లారు. ఉప విద్యాశాఖాధికారి బలివాడ మల్లేశ్వరరావు ఉద్యోగ విరమణ తర్వాత ఆయన స్థానంలో మళ్లీ జిల్లాకు వచ్చారు. ఈ జిల్లాకే చెందిన ఆయనకు బలమైన సామాజిక వర్గం అండదండలు, అధికార పార్టీ నేతల మద్దతు ఉంది. జిల్లాకు చెందిన మంత్రులతోపాటు విజయనగరానికి చెందిన నాయకుల సహాయాన్ని కూడా ఆయన కోరినట్టు తెలిసింది. ప్రస్తుతం విశాఖపట్నంలో మత్స్యశాఖ డీడీగా పనిచేస్తున్న పి.కోటేశ్వరరావు కూడా ఉన్నత స్థాయిలో యత్నాలు చేస్తున్నారు. మత్స్యశాఖ అధికారి అయిన ఆయన ఎక్కువకాలం ఇతర శాఖల్లోనే డిప్యుటేషన్‌పై పనిచేయటం గమనార్హం. శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఏపీడీగా చాలాకాలం పనిచేశారు. ఆ సమయంలో ఏసీలు, ఏపీఎంల బదిలీలు, పదోన్నతుల్లో చేతివాటానికి పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొన్నారు. పీడీని పక్కనబెట్టి చక్రం తిప్పారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఆయనకు అధికార పార్టీ మంత్రులు, నాయకుల మద్దతు పుష్కలంగా ఉందని సమాచారం. అయితే విద్యాశాఖకు ఇతర శాఖల ఉద్యోగులను డిప్యుటేషన్‌పై తీసుకోరాదని 2010-11లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అడ్డంకి కావచ్చని కొందరు అంటున్నారు. కానీ ఈ జీవో అమలయ్యే దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. ప్రస్తుతం బదిలీపై వెళ్లిన నగేష్ కూడా విద్యాశాఖ అధికారి కాదు. ఈ పరిణామాల నేపథ్యంలో పీవోగా ఎవరు నియమితులవుతారోనని విద్యాశాఖ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.