ఏమిటీ డ్రామా..? | Water Management Project Corruption in IWMC | Sakshi
Sakshi News home page

ఏమిటీ డ్రామా..?

Published Tue, Jul 8 2014 12:40 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

ఏమిటీ డ్రామా..? - Sakshi

ఏమిటీ డ్రామా..?

సాక్షిప్రతినిధి, నల్లగొండ :జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) పరిధిలో అమలవుతున్న సమగ్ర నీటి యాజమాన్య ప్రాజెక్టు (ఐడబ్ల్యూఎంపీ) అవినీతికి చిరునామాగా మారుతోంది. ఉన్నతాధికారుల పట్టింపులేనితనం... ద్వితీయ శ్రేణి అధికారుల కుమ్మక్కు ఫలితంగా ప్రాజెక్టు అధికారుల్లో కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న అధికారులు కొందరు తమ సొంత వాహనాల్లోనే తిరుగుతూ బినామీ పేర్లపై బిల్లులు ఎత్తుతున్నారు. ఒకవేళ వాహనం ఎవరిదైతేనేమి, ఎలాగూ ఏదో ఒక వాహనాన్ని అద్దెకు తీసుకోవాల్సిందే కదా అని సమాధానపరిచే మాటలు మాట్లాడినా.. తిరుగుతున్న కిలోమీటర్లలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. చూడడానికి చిన్నవిషయంగా కనిపిస్తున్నా ప్రభుత్వ సొమ్ము  దుర్వినియోగమవుతుందనే ఆరోపణలు వినవస్తున్నాయి.
 
 డ్వామా పరిధిలో అమలవుతున్న సమగ్ర నీటి యాజమాన్య ప్రాజెక్టులో భాగంగా వాటర్‌షెడ్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. వీటి పర్యవేక్షణకు జిల్లాలో 9 ప్రాజెక్టులున్నాయి. ఈ తొమ్మిది ప్రాజెక్టుల్లో ప్రాజెక్టు అధికారుల (పీఓ)కు ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పించింది. నెలకు 2500 కిలోమీటర్ల పరిమితితో రూ.24వేలు అద్దె చెల్లించేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే వీరిలో అత్యధికులు తమ సొంతూళ్ల నుంచి పనిచేసే చోటుకు నిత్యం వస్తూ పోతున్నారు. వాస్తవానికి పనిచేసే చోటే నివాసం ఉండాలి. కానీ, నిత్యం తిరగడం వల్ల వాహనాలు తిరిగే కిలోమీటర్లు పెరిగిపోతున్నాయి. తమ సొంత వాహనాలకు బినామీ పేర్ల మీద కొందరు బిల్లులు ఎత్తేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారంలో పీఓలకు డ్వామాలోని ఓ ద్వితీయశ్రేణి అధికారి అండదండలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం.
 
   నల్లగొండ పీఓ వినియోగిస్తున్న వాహన యజమాని పేరు జలందర్‌రెడ్డి కాగా, అద్దె మాత్రం పి.కృపాదానం అనే వ్యక్తి పేరున చెల్లించారు. ఆరా తీస్తే సదరు కృపాదానం అనే వ్యక్తి కూతురే నల్లగొండ  పీఓ అని తేలింది. ఈ వాహనం తిరిగిన కిలోమీటర్ల రీడింగుల్లోనూ అన్నీ తప్పులే. నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఎదురు సందులో ఉన్న పీఓ కార్యాలయం నుంచి తెలుగు మహిళా ప్రాంగణ సమీపంలోని డ్వామా ఆఫీసులో అడిషనల్ పీడీ సమావేశానికి వెళ్లి రావడానికి 30 కిలోమీటర్లు తిరిగినట్లు ఒక రోజు, మరో రోజు ఏకంగా 45 కిలోమీటర్లు చూపించారు. నల్లగొండ నుంచి కనగల్ ఎంపీడీఓ కార్యాలయానికి  వెళ్లి రావడానికి 72 కిలోమీటర్లు, అదే  తహసీల్దార్  కార్యాలయానికి అయితే ఏకంగా 98 కిలోమీటర్ల రీడింగ్ చూపించారు. ఒకే ఊళ్లో ఉన్న రెండు ఆఫీసుల మధ్య దూరం 26 కిలోమీటర్లు ఉంటుందా అన్నది అధికారులకే తెలియాలి.  కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిప్పర్తికి మన టీవీ కార్యక్రమం కోసం వెళ్లి రావడానికి 68 కిలోమీటర్లు అయ్యిందట.
 
   దేవరకొండ పీఓ వాహన రీడింగుల్లోనూ కావాల్సినన్ని తప్పులు ఉన్నాయి. దేవరకొండ నుంచి నల్లగొండ ఆఫీసుకు మీటింగ్‌కు వచ్చిపోతే ఏకంగా 210 కిలోమీటర్లు తిరిగినట్లు రీడింగ్ చూపించారు. కానీ దేవరకొండ నుంచి నల్లగొండకు మహా అయితే 55 కిలోమీటర్లు మాత్రమే. ఇక,  దేవరకొండ నుంచి హైదరాబాద్  ఆఫీసుకు సమావేశాల నిమిత్తం వెళ్లి వస్తే 350 కిలోమీటర్ల రీడింగ్ రాశారు. వాస్తవానికి దేవరకొండ నుంచి హైదరాబాద్ కేవలం 107 కిలోమీటర్లు. అప్ అండ్ డౌన్, లోకల్‌గా తిరిగినా 250కిలోమీటర్లు దాటకూడదు.   నాంపల్లి పీఓ సైతం ఒకే గ్రామాలకు వేర్వేరు తేదీల్లో ప్రయాణించి కిలోమీటర్లు వేర్వేరుగా చూపించారు.
 
 తేదీలు మారితే, నెల మారితే తిరిగిన దూరం కూడా మారిపోయింది. కుర్మేడు, వింజమూరుకు వె ళ్లి నాంపల్లికి తిరిగి రావడానికి ఒకసారి 126 కి.మీ., ఇవే గ్రామాలకు మరో రోజు 195 కి.మీ.గా పేర్కొన్నారు. అదే మాదిరిగా, తక్కల్లపల్లి, కుర్మేడుకు పోయిరావడానికి ఒకసారి 2కి.మీ, ఇదే గ్రామాలకు మరోసారి 194కి.మీగా చూపించారు. ఇదేలా సాధ్యమో వారికే తెలియాలి..ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. కోట్లాది రూపాయల వ్యయంతో చేపడుతున్న వాటర్ షెడ్   కార్యక్రమాల్లో నిధుల దుర్వినియోగం దండిగా జరుగుతోం దన్న ఆరోపణలకు వాహనాల అద్దె చెల్లింపులు, సొంత వాహనాల్లో తిరుగుతూ ఇష్టానుసారం రాస్తు న్న రీడింగులు ఓ ఉదాహరణగా నిలుస్తున్నాయి.
 
 పనిచేసేది ఒకచోట... ఉండేది మరోచోట
 నల్లగొండ ప్రాజెక్టు అధికారి హైదరాబాద్ నుంచి నల్లగొండకు రాకపోకలు సాగిస్తున్నారు. తిప్పర్తి ప్రాజెక్టు అధికారి మోత్కూరు నుంచి నిత్యం వచ్చి పోతున్నారు. దేవరకొండ పీఓ సైతం మోత్కూరు నుంచి దేవరకొండ షటిల్ సర్వీసు చేస్తున్నారు. నాంపల్లి ప్రాజెక్టు అధికారి హైదరాబాద్ నుంచి అప్‌డౌన్ చేస్తున్నారు. ఇలా నిత్యం తిరగడానికి వారు వాడుతోంది అద్దె (సొంత) వాహనాలే. క్షేత్ర స్థాయి పర్యటనలకు మాత్రమే వినియోగించాల్సిన వాహనాలను సొంతానికి వాడుతూ వేలాది రూపాయలు బిల్లుల రూపం లో తీసుకుంటున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం మేరకు ఐడబ్ల్యూఎంపీ పీఓల చేతివాటం ఔరా అనిపిస్తోంది.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement