పుట్టిన బిడ్డ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలని తల్లితో పాటు ఆ కుటుంబం కూడా తపిస్తుంటుంది. అయితే, ఈ విషయంలో సరైన అవగాహన ఉండటం లేదనేది వైద్యుల మాట. ఎందుకంటే, ఇప్పటికీ భారతదేశంలో నవజాత శిశు మరణాల రేటు ఆందోళనకరంగానే ఉంది. యూరప్‌లో 1990ల మొదట్లో శిశు మరణాల రేటును తగ్గించడానికి చర్యలు తీసుకోవడంలో, అవగాహన కల్పించేందుకు నవంబర్ 7ను శిశు రక్షణ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించాయి.
ఆ తర్వాత అమెరికా, మిగతా దేశాలు కూడా ఈరోజు శిశు రక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. నవజాత శిశువులలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, శిశు మరణాల రేటును తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ విషయంలో నిపుణుల అభిప్రాయాలు తీసుకోవడం తప్పనిసరి.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి
ప్రెగ్నెన్సీ అని తెలియగానే కాబోయే తల్లితోపాటు, ఆ కటుంబం కూడా జాగ్రత్త పడాలి. మన దగ్గర రక్తహీనత సమస్య, పోషకాహార లేమి ఎక్కువ. దీనివల్ల బేబీ గ్రోత్ మందగిస్తుంది. గర్భిణుల్లో హైపో థైరాయిడ్ సమస్య ఎక్కువ చూస్తున్నాం. ఐరన్ లోపం, రసాయనాల ఆహారం తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంటుంది. తల్లి ఆరోగ్యం సరిగాలేకపోతే లోపల బేబీ శరీర, మానసిక ఎదుగుదలపైన ప్రభావం చూపుతుంది.
బీపీ, షుగర్.. వంటి సమస్యలు ఉన్నప్పుడు వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేవారు ముందునుంచే వైద్యులు చెప్పిన టైమ్‌కి వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. తల్లి మానసిక ఆరోగ్యం కూడా బాగుండాలి. అందుకు, సైకలాజికల్ కౌన్సెలింగ్ కూడా తీసుకోవడం ముఖ్యం. వైద్యులు చెప్పిన సూచనలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే కుటుంబం అంతా భవిష్యత్తులో రాబోయే సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
– డాక్టర్ శిరీషా రెడ్డి, గైనకాలజిస్ట్, తార్నాక, హైదరాబాద్
ప్రమాదాలను ముందే పసిగట్టాలి
నెలలు నిండకుండా పుట్టడం, బరువు తక్కువుండి పుట్టడం, ఇన్ఫెక్షన్స్, పోషకాహార లోపం వల్ల శిశు మరణాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. ఏడాదిలోపు పిల్లలను నవజాత శిశువులు అంటారు. ఈ సమయంలో సులువుగా ఇన్ఫెక్షన్స్ సోకుతుంటాయి. అందుకే, వీరిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. ఏడాదిలోపు వచ్చే ఆరోగ్య సమస్యలను నివారించగలిగితే ఆ తర్వాత వచ్చే సమస్యలను సులువుగా అధిగమించవచ్చు. మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే పట్టడం అవసరం, ఆరోగ్యం కూడా. ఆ తర్వాత వారికి ఇచ్చే పోషకాహారం చాలా ముఖ్యం. దీంతోపాటు వ్యాక్సినేషన్ చేయించడం ముఖ్యం.
ఎందుకంటే, నిమోనియా, డయేరియా వల్ల మరణాలు ఎక్కువ. అందుకే, ప్రభుత్వం కూడా డయేరియా, న్యూమోనియా.. వ్యాక్సినేషన్ జాబితాలో చేర్చింది. పిల్లల వైద్యనిపుణుల పర్యవేక్షణ చాలా అవసరం. కొన్ని గ్రామీణ ప్రాంతాల వారికి ఈ సౌకర్యం అందుబాటులో లేకపోవచ్చు. కానీ, రెగ్యులర్ హెల్త్ చెకప్ అనేది ముఖ్యం అని తెలుసుకోవాలి. ఇక నవజాత శిశువులకు దెబ్బలు తగిలే అవకాశం కూడా ఉంది. మంచంపై నుంచి కింద పడటం వంటివి. చిన్న దెబ్బలు కూడా పెద్దవి కావచ్చు. మదర్ పోస్ట్ ప్యాటర్న్ డిప్రెషన్‌లో ఉన్నప్పుడు బిడ్డను చూసుకునేవారుండరు. ఇలాంటప్పుడు కూడా శిశువు సంరక్షణ ప్రమాదంలో పడుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కుటుంబం జాగ్రత్త వహించాలి.
– ప్రియాంకరెడ్డి, పిడియాట్రిషియన్, మాదాపూర్, హైదరాబాద్
ఒకరి ద్వారా మరొకరికి సూచనలు
మేం గర్భిణులపై ఎక్కువ ఫోకస్ పెడుతుంటాం. ఎందుకంటే, వారి ఆరోగ్యం బాగుంటేనే పుట్టబోయే బిడ్డ బాగుంటుంది. ఆరోగ్యం, పౌష్టికాహారంతో పాటు ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్లేవరకు ఎలా చూసుకోవాలో ఆమెకే కాదు, ఇంటిల్లిపాదికీ కౌన్సెలింగ్ ఇస్తాం. ఎంత చెప్పినా వినిపించుకోని వారు కొందరుంటారు. అయినా వారిని వదలకుండా తల్లి అయిన వారితో కౌన్సెలింగ్ ఇప్పిస్తాం. చార్ట్ ప్రకారం వాళ్లు తీసుకోవాల్సిన పోషకాహారం, మందులు కూడా అంగన్‌వాడీ నుంచి ఇస్తుంటాం.
చంటిపిల్లల విషయంలో మేం తగు జాగ్రత్తలు చెప్పడంతో పాటు, ఏ సమయానికి వ్యాక్సిన్లు వేయించాలి, ఎలా చూసుకోవాలి అనే విషయాలపైన తల్లులకు ఒకరి ద్వారా మరొకరు సూచనలు చేసుకునేలా కౌన్సెలింగ్ చేస్తుంటాం. దీనివల్ల నవజాత శిశు మరణాల రేటు తగ్గడమే కాకుండా శిశువులు ఆరోగ్యంగా పెరిగేందుకు దోహదం చేస్తుంది.
– వెంకటరమణ, అంగన్‌వాడీ టీచర్, ఖాసింపేట, సూర్యపేట జిల్లా
Comments
Please login to add a commentAdd a comment