‘అన్ని రకాల హింస మగాళ్ల వల్లే...’
న్యూఢిల్లీ: సమాజంలో జరుగుతున్న అన్ని రకాల హింసకు మగాళ్లే కారణమని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందువల్ల లింగ వివక్షను రూపుమాపడానికి పురుషుల పాత్ర పెరగాలని సూచించారు. ఆమె సోమవారం ఫేస్‌బుక్ యూజర్లతో లైవ్‌చాట్ చేశారు. లింగ వివక్షను రూపుమాపాలంటే పాఠశాల స్థాయి నుంచే చర్యలు ప్రారంభించాలన్నారు.
దీని కోసం స్కూళ్లలో ‘జెండర్ చాంపియన్స్’ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని, స్కూళ్లలో బాలికల పట్ల గౌరవం చూపుతూ, వారికి సహాయంగా ఉండే బాలురకు ప్రత్యేకంగా బహుమతులిస్తామని, అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించిన బాలికలకూ బహుమతి అందిస్తామని తెలిపారు. విజయాలు సాధించిన 100 మంది మహిళలను గుర్తించేందుకు చేపట్టిన ‘100 ఉమెన్ ఇనిషియేటివ్’ కార్యక్రమం కోసం ఆమె ఈ చాట్ నిర్వహించారు. దేశంలోని మురికివాడల్లో ఉన్న పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలంటే ప్రతి 7 నిమిషాలకు ఒక కొత్త పాఠశాల అవసరమన్నారు.