సీలేరు (విశాఖ) : మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి బైక్ నడుపుతూ దారిన నడిచి వెళ్తున్న తల్లీకూతుళ్లను ఢీకొట్టాడు. ఈ ఘటన విశాఖ జిల్లా సీలేరు మండలం దారకొండలో మంగళవారం చోటుచేసుకుంది. గుమ్మురేవుల పంచాయతీ నవగం గ్రామానికి చెందిన మండి సావిత్రి(20) తన ఇరవై రోజుల పసికందుతో మంగళవారం మధ్యాహ్నం దారకొండ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది.
వైద్య పరీక్షల అనంతరం శిశువును ఎత్తుకుని నడిచి వెళ్తున్న ఆమెను వెనుక నుంచి వచ్చిన బైక్ గుద్దేసింది. దీంతో బాలింత సహా శిశువుకు గాయాలయ్యాయి. చుట్టుపక్కలవారు అప్రమత్తమై బైక్‌పై ఉన్న ఇద్దరిలో ఒకరిని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారయ్యాడు. పట్టుబడిన వ్యక్తి ఒడిశాకు చెందినవాడని తేలింది. అతడు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పసికందు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.