
పుట్టగానే కుల ధ్రువీకరణ
ఇకపై బిడ్డపుట్టినపుడే జనన ధ్రువీకరణతోపాటు కుల ధ్రువీకరణ కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది.
ఎస్సీ, ఎస్టీ చిన్నారులకు వర్తింపు
* కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
* పాఠశాలల్లోనూ కుల, నివాస ధ్రువీకరణ పత్రాల జారీ
న్యూఢిల్లీ: ఇకపై బిడ్డపుట్టినపుడే జనన ధ్రువీకరణతోపాటు కుల ధ్రువీకరణ కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో ఎస్సీ, ఎస్టీ చిన్నారులకు బర్త్ సర్టిఫికెట్‌లోనే కులం పేరును పేర్కొనేలా చర్యలు తీసుకోనుంది. దీంతోపాటు 8వ తరగతిలో ఉన్నప్పుడు కూడా ఎస్సీ, ఎస్టీ (కుల ధ్రువీకరణ) పత్రాలతోపాటు నివాస ధ్రువీకరణ పత్రాలను పాఠశాలల ద్వారానే అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలకు దరఖాస్తు చేసుకుంటున్నప్పుడు.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కుల, ప్రాంత ధ్రువీకరణ (రెసిడెన్స్) పత్రాల విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతుండటంతో.. వీటిపై చర్చించిన ప్రభుత్వం.. పుట్టినప్పటి నుంచే కుల ధ్రువీకరణ ఉండేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
దీంతో జనన ధృవీకరణ పత్రాల్లోనే దళిత ముద్ర కనిపించేలా చర్యలు తీసుకోనుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని.. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా వ్యక్తిగత శిక్షణ విభాగం (డీవోపీటీ) ఈ కొత్త నిబంధనలు రూపొందించింది. పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులు వివరాలతో దరఖాస్తులు నింపి ఉన్నతాధికారులకు పంపిచాలి. పైస్థాయిలో దీన్ని పరిశీలించిన తర్వాత ప్రధానోపాధ్యాయుడి ద్వారా విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఒకవేళ ఎవరి దరఖాస్తు అయినా తిరస్కరిస్తే ఆ వివరాలను కూడా విద్యార్థికి తెలిపే విధానాన్ని అమలు చేయనున్నారు.