ప్రతీకాత్మక చిత్రం
Winter Care Tips In Telugu: Massage For Babies Helpful: శీతాకాలం ప్రతిఒక్కరికీ పరీక్ష పెడుతుంది. ఏడాదిలోపు చంటిపిల్లలను సంరక్షించడం అంటే తల్లికి చిన్న పరీక్ష కాదు. అనుక్షణం బిడ్డ ధ్యాసలోనే గడపాల్సి ఉంటుంది. పాపాయికి తినిపించే ఆహారం నుంచి స్నానం చేయించడం, దుస్తులు, ఒంటికి నూనెలు పట్టించి మసాజ్ చేయడం ప్రతిదీ అత్యంత జాగ్రత్తగా చేయాలి. ముఖ్యంగా మసాజ్ చేసేటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు పాటించి తీరాలి.
►శీతాకాలంలో మసాజ్‌కు ఆవనూనె అయితే మంచిది. ఇది ఒంటికి సహజంగా వేడినివ్వడంతోపాటు ర్యాష్ వంటి చర్మ సమస్యలను దూరంగా ఉంచుతుంది. ఒకవేళ న్యాపీ ర్యాష్ వంటి సమస్యలు ఉన్నా కూడా తగ్గిస్తుంది. ఆవనూనె సాధ్యం కానప్పుడు వెన్న, మీగడలతో మసాజ్ చేయవచ్చు. ఇవి అన్ని కాలాల్లోనూ వాడదగినవే.
►మసాజ్ కోసం బిడ్డను చేతుల్లోకి తీసుకునే ముందు తల్లి తన చేతులను వేడి నీటితో కడుక్కోవాలి. ఈ కాలంలో చేతులు చల్లగా ఉంటాయి. చల్లటి చేయి ఒంటికి తగలగానే పాపాయి భయంతో ఉలిక్కిపడుతుంది. అందుకే ఈ జాగ్రత్త.
►మసాజ్‌కు వాడే నూనెను చిన్న స్టీలు గిన్నెలో తీసుకుని గోరువెచ్చగా చేసిన తర్వాతనే పాపాయి ఒంటికి పట్టించాలి. వేడి చేయడం వీలుకాకపోతే నూనెను రెండు చేతుల్లో వేసుకుని రుద్దుకుంటే చల్లదనం తగ్గుతుంది. పాపాయి చర్మానికి సౌకర్యంగా ఉంటుంది.
గదిని వెచ్చబరచాలి..
►నూనె పట్ల తీసుకునే జాగ్రత్తలతోపాటు మసాజ్ చేయడానికి ముందు దుస్తులు తొలగించడంలోనూ జాగ్రత్త తీసుకోవాలి. వేసవిలో చేసినట్లు ఒకేసారి దుస్తులన్నీ తీసేయరాదు. ముందు సాక్స్, ప్యాంటు తీసి కాళ్లకు మసాజ్ చేయాలి. అప్పుడు కాళ్ల మీద మందపాటి టవల్ కప్పి ఆ తర్వాత చేతులకున్న మిటెన్స్, స్కార్ఫ్, చొక్కా తీసి పై భాగానికి మసాజ్ చేయాలి.
►వీటన్నింటికంటే ముందు గదిని వెచ్చబరచాలి. రూమ్ హీటర్‌లు అందుబాటు ధరల్లోనే దొరుకుతున్నాయి. కాబట్టి చంటిబిడ్డ ఉన్న ఇంట్లో రూమ్ హీటర్ తప్పకుండా ఉండాలి. మసాజ్ మొదలు పెట్టడానికి పది నిమిషాల ముందు రూమ్ హీటర్ ఆన్ చేయాలి. హీటర్ నుంచి వచ్చే గాలిని నేరుగా పాపాయికి తగలనివ్వకూడదు. హీటర్ సాధ్యం కానప్పుడు సాంబ్రాణి పొగ లేదా ధూప్ స్టిక్‌తో గదిని వెచ్చబరచవచ్చు.
నిజానికి జలుబుకు కారణం మసాజ్ కాదు
►సాధారణంగా చేసే పొరపాటు ఏమిటంటే... పక్క దుస్తులకు నూనె జిడ్డు అంటకుండా ఉండడానికి మసాజ్ చేసేటప్పుడు పాపాయిని ప్లాస్టిక్ షీట్ మీద పడుకోబెడుతుంటారు. ఈ సీజన్‌లో మాత్రం ఆ పని చేయనే చేయకూడదు. ప్లాస్టిక్ షీట్ చల్లగా ఉంటుంది. పాపాయికి జలుబు చేసే ప్రమాదం ఉంది. అందుకే పాతబడిన దుప్పటిని హీటర్ ముందు పెట్టి గోరువెచ్చగా చేసిన తర్వాత పాపాయిని పడుకోబెట్టాలి.
►పాపాయి చర్మ సంరక్షణకు, కండరాల వ్యాయామానికి మసాజ్‌ను మించిన ఔషధం మరొకటి ఉండదు. కాబట్టి శీతాకాలంలో కూడా చక్కగా మసాజ్ చేయవచ్చు. ఈ కాలంలో మసాజ్ చేస్తే జలుబు చేస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. పైన చెప్పుకున్న జాగ్రత్తలు పాటించకుండా వేసవిలో మసాజ్ చేసినట్లే పాపాయిని దుస్తులు లేకుండా ఎక్కువ సేపు చలిగాలికి ఉంచినప్పుడు జలుబు చేస్తుంది. ఈ జలుబుకి కారణం మసాజ్ కాదు. తగిన జాగ్రత్తలు పాటించకపోవడమే.
Comments
Please login to add a commentAdd a comment