'సెల్యులైటిస్ అనేది ఓ చర్మవ్యాధి. కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లతో చర్మంపై పగుళ్లు రావడం, ఎర్రబారడం, కొద్దిపాటి వాపు మంట వంటి లక్షణాలతో బాధించే ఈ వ్యాధి తాలూకు బాధలు చలికాలంలో ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా ఉన్నప్పుడు మరింత ఎక్కువవుతాయి. అసలు సెల్యులైటిస్ రావడానికి ఏయే అంశాలు కారణమవుతాయి, లక్షణాలేమిటి, చలికాలంలో ఇది ఎందుకిలా మరింత ఎక్కువగా బాధిస్తుంది వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.'
చర్మం పగుళ్లుబారినట్లుగా కనిపిస్తూ, కొద్దిపాటి వాపు, ఎర్రబారడం వంటి వాటితో వ్యక్తమయ్యే ఈ వ్యాధి స్ట్రెప్టోకాకస్, స్టెఫాలోకాకస్ వంటి బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. చర్మంపై ఒకచోట వస్తే మిగతా చోట్లకు పాకుతుంది. అయితే ఇది అంటువ్యాధి కాదు. ఒకరినుంచి మరొకరికి వ్యాపించదు.
ప్రేరేపించే అంశాలు..
స్ట్రెప్టోకాకస్, స్టెఫాలోకాకస్ వంటి బ్యాక్టీరియా వల్ల వచ్చినప్పటికీ... కొన్ని అంశాలు దీన్ని తీవ్రతరం చేస్తాయి. అవి.. కాళ్లు, చేతుల్లోని రక్తనాళాల్లో ఏమైనా సమస్యలతో రక్తసరఫరాలో తేడాలు, ఊబకాయం, కాళ్లవాపులు, డయాబెటిస్, మద్యం తాగే అలవాటు కారణాలతో పాటు వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనం కావడం.
లక్షణాలు..
ఈ ఆరోగ్య సమస్యలో కనిపించే ఓ కీలకమైన అంశం ఏమిటంటే.. సాధారణంగా సెల్యులైటిస్ దేహంలోని ఒకవైపునే కనిపిస్తుండటం విశేషం. ఈ వ్యాధి ఉన్నవారిలో కనిపించే సాధారణ లక్షణాలివి..
- ఈ వ్యాధి సోకిన ప్రాంతంలో చర్మం దురద పెడుతుండటంతో పాటు ఈ దురదలు క్రమంగా పక్కలకు వ్యాపిస్తూ ఉంటాయి.
- వ్యాధిసోకిన చర్మపు ప్రాంతంలో వాపు, ముట్టుకోనివ్వకపోవడం (టెండర్‌నెస్)
- నొప్పి, వేడిగా అనిపించడం
- జ్వరంతో పాటు అది కొందరిలో చలిజ్వరంగా వ్యక్తం కావడం
- సెల్యులైటిస్ వచ్చిన ప్రాంతాల్లో మచ్చలతో పాటు నీటి పొక్కుల్లా (బ్లిస్టర్స్) రావడం.
- కొందరిలో చర్మంపై గుంటల్లా పడుతూ, చర్మం వదులైన తోలు మాదిరిగా కనిపించడం (స్కిన్ డింప్లింగ్)
చలికాలంలో బాధలు ఎందుకు పెరుగుతాయంటే..
సెల్యులైటిస్ లక్షణాలతో వచ్చే బాధలు చలికాలంలో పెరగడానికి, ఈ సీజన్‌లో చర్మంపై కనిపించే కొన్ని అంశాలు దోహదపడతాయి. ఉదాహరణకు..
చర్మం పొడిబారడం (డ్రైస్కిన్):
ఈ సీజన్‌లో తేమ తగ్గడంతో చర్మం బాగా పొడిబారిపోతూ ఉండటం చాలామందికి అనుభవంలో వచ్చే విషయమే. పైగా చలిగాలులకు వెళ్లినప్పుడు మరింతగా పెరుగుతుంది. ఇలా పొడిబారిన చర్మం బ్యాక్టీరియా చేరడానికి అనువుగా ఉంటుంది. దాంతో సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే ఈ సీజన్‌లో మాయిశ్చరైజర్లతో చర్మాన్ని తేమగా ఉంచుకుంటే ఇలా పగుళ్లుబారడంతో పాటు సెల్యులైటిస్‌నూ నివారించవచ్చు.
వ్యాధినిరోధక వ్యవస్థ బలహీనపడటం / వ్యాధినిరోధక శక్తి తగ్గడం:
చలికాలంలో మామూలుగానే వ్యాధినిరోధక వ్యవస్థ పనితీరు కాస్త మందగించే అవకాశముంది. దీనికి తోడు డయాబెటిస్ ఉండటం, మద్యం అలవాట్ల వంటివి ఉంటే అది వ్యాధి నిరోధక వ్యవస్థను మరింత మందకొడిగా మార్చవచ్చు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో సమతులాహారం తీసుకోకపోవడం, ఆహారంలో విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు తక్కువగా ఉండటం లాంటి అంశాలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే అవకాశముంది.
సెల్యులైటిస్ నివారణ ఇలా...
- చర్మాన్ని శుభ్రంగా, తేటగా ఉంచుకోవాలి.
- ఘాటైన రసాయనాలతో కూడిన వాసన సబ్బులు కాకుండా, మైల్డ్ సోప్ వాడాలి.
- మిగతా చర్మంతో పోలిస్తే.. మేనిపై పొడిగా ఉండే భాగాలైన మోచేతులు, మోకాళ్లు వంటి చోట్ల మాయిశ్చరైజర్ వంటివి రాసి, తేమగా ఉండేలా చూసుకోవడం మంచిది.
- చర్మం పగుళ్లు బారి, తోలు రేగిన ప్రాంతాల్లో వాటిని గిల్లడం, లాగడం చేయకూడదు.
- గోళ్లు, చర్మంతో గోళ్లు ముడిపడే భాగాల్ని శుభ్రంగా ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే అక్కడి నుంచి బ్యాక్టీరియా చర్మంపై దాడి చేసే అవకాశాలుంటాయి.
- చలికాలంలో చర్మానికి మంచి రక్షణ కలిగేలా, ఒళ్లంతా కప్పి ఉంచేలాంటి దుస్తులు వాడటం మేలు.
- చలిగాలులు వేగంగా తాకకుండా ఉండేలా దుస్తులు ఉండాలి.
- తమ వ్యక్తిగత దుస్తులు, సామగ్రిని ఇతరులతో పంచుకోకూడదు.
- ఇల్లు శుభ్రం చేసుకోవడం, తోటపని వంటి మన రోజువారీ కార్యక్రమాల్లో చర్మానికి ఎలాంటి గాయాలు కాకుండా జాగ్రత్తపడాలి.
- ఎక్కడైనా చర్మం తెగినా, గాయపడ్డా డాక్టర్ సలహా మేరకు తగిన యాంటీబయాటిక్ క్రీమ్స్ వంటివి రాస్తూ, గాయాలు వేగంగా తగ్గేలా జాగ్రత్త తీసుకోవాలి.
- పాదాల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా బాగా పొడిబారి పగుళ్లకు అవకాశం ఉండే మడమలు, అలాగే వేళ మధ్యభాగాలు తేమతో, ఆరోగ్యంగా ఉంచుకునేలా జాగ్రత్త వహించాలి. రోజూ తగినన్ని నీళ్లు తాగాలి.
- వ్యాధినిరోధక వ్యవస్థ చురుగ్గా ఉండేందుకు అన్ని పోషకాలూ, విటమిన్లు, మినరల్స్‌తో కూడిన మంచి ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకుంటూ ఉండాలి.
- డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, తమ జబ్బులను అదుపులో పెట్టుకునేలా క్రమం తప్పకుండా మందులు వాడటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
- క్రమం తప్పకుండా ఆరోగ్యపరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
చివరగా.. చలికాలంతో కొన్ని సౌకర్యాలున్నప్పటికీ.. దాంతోపాటు మరికొన్ని ఆరోగ్యసమస్యలనూ తీవ్రం చేసే సీజన్ అది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చర్మాన్నీ, దేహాన్నీ ఆరోగ్యంగా ఉంచుకుంటే ఈ సీజన్ నిరపాయకరంగా గడిచిపొతుంది.
ఇవి చదవండి: వింటర్‌లో ముఖం తేటగా ఉండాలంటే వెంటనే ఇలా చేయండి!
Comments
Please login to add a commentAdd a comment