ఎక్కువ క్యాలరీలు ఖర్చవ్వాలంటే..రివర్స్‌ వాకింగ్‌ ట్రై చేశారా? | Unbelievable Benefits Of Reverse Walking, Know Its Science Backed Advantages In Telugu | Sakshi
Sakshi News home page

ఎక్కువ క్యాలరీలు ఖర్చవ్వాలంటే..రివర్స్‌ వాకింగ్‌ ట్రై చేశారా?

Published Mon, Jul 8 2024 3:18 PM | Last Updated on Mon, Jul 8 2024 4:47 PM

Benefits of  reverse Walking and Advantages

ఆరోగ్యకరమైన  అలవాట్లు ఆహారం,  క్రమం తప్పని వ్యాయామంతో మనిషికి చాలా  ఆరోగ్య ప్రయోజనాలను లభిస్తాయి. చక్కని ఆరోగ్యంతోపాటు, చక్కని శరీరాకృతితో బరువు పెరగకుండా ఉండేందుకు చాలా వ్యాయమాలను చేస్తాం. అయితే  వెనుకకు నడవడం లేదా రివర్స్‌ వాకింగ్‌  ఉత్తమమైన వ్యాయామమని మీకు తెలుసా?  చిన్నతనంలో  ఏదో సరదాగా ఆటల్లో భాగంగా అలా చేసే ఉంటారు కదా. కానీ  పెద్దయ్యాక కూడా రివర్స్‌ వాకింగ్‌ వల్ల చాలా లాభాలున్నాయి. ఇది వింతగా అనిపించినప్పటికీ  ఇది ఎంతో మేలు చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

రివర్స్‌ వాకింగ్‌ మన సమతుల్యతను, స్థిరత్వాన్ని కాపాడుతుంది. తూలి పడిపోయే ప్రమాదం నుంచి రక్షిస్తుంది.   ముఖ్యంగా పెద్ద వయసువారిలో  పడిపోవడం వల్ల ఎముకలు విరగడం లాంటి ప్రమాదాలను నివారించవచ్చు.

ఈ టెక్నిక్‌తో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏకాగ్రతతో మరింత స్థిరంగా ఉండటానికి దోహదపడుతుంది. ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి కూడా వేగవంతమైన నడక కంటే రివర్స్‌ వాకింగ్‌తో 40 శాతం  ఎక్కువ కేలరీలు   ఖర్చు అవుతాయి.  ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది.

రివర్స్ వాకింగ్ కీళ్ల పనితీరు మెరుగుపడుతుంది. కాళ్లలోని కండరాలు బలపడతాయి.  కండరాలు ఎక్కువగా సాగుతాయి.  మోకాళ్ల నొప్పులు తగ్గే అవకాశం ఉంది.

వెన్ను నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. రివర్స్ వాకింగ్ కింది వీపుపై ఒత్తిడి తెస్తుంది. దీని వల్ల వెన్ను నొప్పి తగ్గుతుంది. 

మానసిక ఆరోగ్యాన్ని  మెరుగుపర్చడంలో కూడా  బాగా పనిచేస్తుంది. వెనుకకు నడిచేటప్పుడు ఏకాగ్రత అవసరం. కనుక శరీరంలోని మెదడు, ఇతర అవయవాల మధ్య సమన్వయం పెరుగుతుంది. గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. గుండె, ఇతర అవయవాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచి,  ప్రసరణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది అథ్లెట్లకు, ముఖ్యంగా రన్నర్లకు, ఇది బాగా  ఉపయోగకరం.

 ఎలా చేయాలి?
ఆరుబయట, విశాలమైన పార్క్ లేదా ప్రశాతంగా ఉండే నిశ్శబ్ద పరిసరాలు, సురక్షితమైన ఖాళీ స్థలాన్ని ఎంచుకోవాలి. 

ఎటువంటి అడ్డంకులు, ట్రాఫిక్ లేని ప్రాంతాలను ఎంచుకోండి. వెనుకకు నెమ్మదిగా అడుగులు వేస్తూ నడవాలి.  ట్రెడ్‌మిల్‌పై కూడా చేయవచ్చు.

ఈ రివర్స్‌వాకింగ్‌ను నెమ్మదిగా ప్రారంభించాలి. ఆరంభంలో ఎవరైనా తోడు ఉంటే ఇంకా మంచిది. అలవాటయ్యే కొద్దీ, ఈ వాకింగ్‌ సమయాన్ని, దూరాన్ని   పెంచుకోవచ్చు.  సపోర్ట్ ఇచ్చే ఫిట్టింగ్ పాదరక్షలను ధరించండి

నోట్‌ : మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పితో బాధపడేవారు వైద్య సలహా మేరకు రివర్స్‌వాకింగ్‌ చేయాలా వద్దా అని నిర్ణయించుకోవాలి.  తూలిపడే తత్వం, ఉదాహరణకు వర్టిగోతో బాధపడుతున్న వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలి.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement